డబ్బుంటే అంతే: జైలుకు వెళ్లకుండా.. సొంత ఇంట్లో నిర్బంధంలో వ్యాపారి
డబ్బుంటే.. ఏ చట్టం, ఏ శిక్ష వర్తించదు అంటున్న చైనా స్థిరాస్తి వ్యాపారి విధాత: అవినీతి ఆరోపణ కేసులో జైలుకు వెళ్లకుండా సొంత ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న చైనా స్థిరాస్తి వ్యాపారి ఝాంగ్‌లీ ఉదంతం ఇంగ్లండ్‌లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ధనవంతులు తమకు కావాల్సిన స్వేచ్ఛను కొనుక్కోవచ్చని ఈ ఉదంతం తెలియజేస్తున్నదని బ్రిటిష్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా టైకూన్‌గా పేరుగాంచిన ఝాంగ్‌లీ అతిపెద్ద స్థిరాస్తి వ్యాపారి. దేశ దేశాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ పనులు […]

డబ్బుంటే.. ఏ చట్టం, ఏ శిక్ష వర్తించదు అంటున్న చైనా స్థిరాస్తి వ్యాపారి
విధాత: అవినీతి ఆరోపణ కేసులో జైలుకు వెళ్లకుండా సొంత ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న చైనా స్థిరాస్తి వ్యాపారి ఝాంగ్‌లీ ఉదంతం ఇంగ్లండ్‌లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ధనవంతులు తమకు కావాల్సిన స్వేచ్ఛను కొనుక్కోవచ్చని ఈ ఉదంతం తెలియజేస్తున్నదని బ్రిటిష్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనా టైకూన్‌గా పేరుగాంచిన ఝాంగ్‌లీ అతిపెద్ద స్థిరాస్తి వ్యాపారి. దేశ దేశాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ పనులు చేపడుతాడు. అమెరికాలో తన నిర్మాణ పనుల కోసం శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరంలోని అధికారులకు ముడుపులు ముట్ట చెప్పినట్లు ఆరోపణలున్నాయి. లంచం ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాడన్న ఆరోపణలున్నాయి.
ఆ నేపథ్యంలోనే అతన్ని అరెస్టు చేసి విచారించాలని అమెరికా నిర్ణయించింది. ఝాంగ్‌లీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే.. 25ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే.. సింగపూర్ నుంచి ఇంగ్లండ్ చేరుకున్న ఝాంగ్‌లీని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు.
తనను అమెరికాకు తరలించకుండా ఉండేందుకు బ్రిటీష్ కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాగే తనను తన సొంత అపార్ట్‌మెంట్‌లోనే ఉంటానని, జైలుకు తరలించవద్దని కోరుతున్నాడు. దానికి అనుగుణంగా తానే తన ఐదుగదుల లగ్జరీ ఫ్లాట్‌లో స్వీయ నిర్బంధం చేసుకొని బయటకు రావటం లేదు.
అలాగే తన భద్రతకు సంబంధించిన ఖర్చును కూడా తానే భరిస్తానని కోర్టుకు తెలిపాడు. ఆ మేరకు అతను జైలుకు వెళ్లకుండా సొంత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారం ఇంగ్లండ్‌లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది.
ధనవంతులు తమ వద్ద ఉన్న డబ్బుతో దేన్నయినా కొనేయవచ్చన్నది తేటతెల్లం అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. డబ్బుతో స్వేచ్ఛను కూడా కొనుక్కోవచ్చని ఝాంగ్‌లీ ఉదంతం చెప్తున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమైనదని అభిప్రాయపడుతున్నారు.