Kaleshwaram | ఏటా ఆదాయం 14,709 కోట్లు.. ఖర్చు 28,081 కోట్లు.. ఇదీ కాళేశ్వరం కథ!
కాళేశ్వరం ఆయకట్టు అంతా కనికట్టేనని కాగ్ నివేదిక నిగ్గు తేల్చింది. 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మార్చి 2022 నాటికి కేవలం 40,888 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చినట్లు కాగ్ స్పష్టం చేసింది.

- వినియోగంలోకి వచ్చింది 40,888 ఎకరాలే
- 2019లోనే బరాజ్‌లు దెబ్బతిన్నా పట్టించుకోని గత సర్కార్
- కాళేశ్వరం కథల నిగ్గు తేల్చిన కాగ్ నివేదిక
విధాత: కాళేశ్వరం ఆయకట్టు అంతా కనికట్టేనని కాగ్ నివేదిక నిగ్గు తేల్చింది. 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మార్చి 2022 నాటికి కేవలం 40,888 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చినట్లు కాగ్ స్పష్టం చేసింది. దీనిని బట్టి పరిశీలిస్తే కాళేశ్వరంలో లక్ష కోట్ల నిధులు పారాయి కానీ లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని స్పష్టం అవుతుంది.
సాగులోకి వచ్చింది 40,888 ఎకరాలే
వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 180 టీఎంసీల నీటితో 18.26 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేశారు. 2016 మే 2వ తేదీన శంకుస్థాపన చేసి, 2019 జూన్ 21వ తేదీన ప్రారంభించారు. 2019లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌నుంచి 2022 మార్చి నాటికి కూడా 40,888 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చిందని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది.
2022 మార్చి నాటికి 14.83 లక్షల ఎకరాల సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధికి పనులను చేపట్టాలని నిర్ణయించింది కానీ ఇందులో 56 ప్రాజెక్ట్ పనులకు 12 పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 పనులు కొనసాగుతుండగా, నాలుగు పనులు ప్రారంభం కానేలేదు. మరో నాలుగు లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ అభివృద్ది పనులు చేపట్టలేదని నివేదిక పేర్కొన్నది. మరోవైపు 32 పనుల్లో తొలి ఒప్పందం గడువు ముగిసినా భూసేకరణ ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేసింది.

తెల్ల ఏనుగులా కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెల్ల ఏనుగులా మారింది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తికాకముందే కుంగిపోయి ప్రశార్థకంగా మారింది. ప్రాజెక్ట్‌లో నీళ్లు నిల్వ ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.83 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు.. మరో 4.71 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం. అయితే.. కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టులో పండే పంటలకు ఎత్తిపోసే నీళ్లు, తాగునీరు, పరిశ్రమలకు అందించే నీటికి అయ్యే ఖర్చుతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపు కలిపి రూ.28,081.54 కోట్లుగా ఉంటే.. వాటన్నింటి ద్వారా ఆదాయం మాత్రం రూ.14,709.84 కోట్లుగా ఉన్నదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.
ఇందులో ఎత్తిపోతలకు అయ్యే విద్యుత్తు చార్జీలు రూ.10,374.56 కోట్లు, నిర్వహణ ఖర్చులు రూ.272.70 కోట్లు కలిపి రూ.10647.26 కోట్లు అవుతుందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అయితే సుమారు లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ.64.204.13 కోట్లుగా ఉన్నది.
వడ్డీలు సకాలంలో చెల్లించకుండా వాయిదా వేయడంతో అదనంగా మరో రూ.19,556.4 కోట్ల వడ్డీ అసలులో కలిసింది. దీంతో అసలు రూ.87,369.89 కోట్లు అయింది. దీనికి వాయిదాలుగా ప్రతి ఏటా వడ్డీ, అసలు కింద రూ.10 వేల కోట్ల నుంచి 14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని కాగ్ తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారనున్నది. పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని కాగ్ హెచ్చరించింది.
2019లోనే డ్యామేజీ
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆనాటి సీఎం కేసీఆర్ 2019 జూన్ 21న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలను ఆహ్వానించారు. అట్టహాసంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ బరాజ్‌లు అదే ఏడాది నవంబర్‌లో వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయి. ఆర్‌సీసీ వేసిన కోట్, సీసీ కర్టెన్ గోడలలో కొంత బాగం, దిగువ భాగంలో నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకు పోయాయి. దీనివల్ల మేడిగడ్డ బరాజ్‌కు రూ.83.83 కోట్లు, అన్నారం 65.32 కోట్లు, సుందిళ్ల బరాజ్‌కు రూ.31.24 కోట్లు మొత్తంగా రూ.180.39 కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం డిజైన్ లోపం, లోపభూయిష్టంగా చేపట్టిన పనుల కారణంగానే నష్టం జరిగిందని కాగ్ భావించింది.
నష్టంతో తమకు సంబంధం లేదంటున్న కాంట్రాక్టర్లు
జరిగిన నష్టానికి తమకు సంబందం లేదని 2019 లోనే కాంట్రాక్టర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కాగ్ బట్టబయలు చేసింది. తమకు ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము పనులు చేశామని, అలాంటప్పుడు జరిగిన నష్టానికి తామెలా బాధ్యులమవుతామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిధులు ఇస్తే పనులు చేయడానికి గుత్తేదార్లు ముందుకు వచ్చారు. దీంతో సాగునీటి శాఖనే ఈ పనులు చేపట్టడానికి రూ. 470.03 కోట్లతో అంచనాలు రూపొందించింది. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు చేపట్టలేదు.
నిర్వహణ లోపమేనన్న జలశక్తి నిపుణుల కమిటీ
ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తరువాత నిర్వహణ లోపం కారణంగానే మేడిగడ్డ కుంగినట్లు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ తేల్చి చెప్పిందని కాగ్ తెలిపింది. 2019-20లలో మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచీ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్‌లను, లాంచింగ్ అప్రాస్‌లను తనిఖీ చేయలేదని, నిర్వహించలేదని కమిటీ గుర్తించిందని కాగ్ తన నివేదికలో పొందుపర్చింది. నిర్వహణ లోపం కారణంగానే బరాజ్ కుంగిందని కమిటీ అభిప్రాయ పడినట్లు నివేదించింది. బరాజ్‌ను పునరుద్ధరించే వరకు ఇది నిరుపయోగంగానే ఉంటుందని తెలిపింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.