గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) నేత, గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది

Lakhbir Singh Landa | బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) నేత, గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. లాండా పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లా నివాసి. లఖ్‌బీర్ ప్రస్తుతం కెనడాలోని అల్బెర్టాలోని ఎండ్మోంటన్‌లో నివాసం ఉంటున్నాడు. లాండా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి అక్రమంగా ఆయుధాలను, ఐఈడీలను రవాణా చేస్తున్నాడు. మే 9, 2022న పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) దాడికి సూత్రధారి కూడా లాండానేనని నోటిఫికేషన్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
ఈ కేసులో పంజాబ్ పోలీసులు, ఎన్‌ఐఏ అతనిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం దేశం నుంచి పారిపోయి కెనడాలో తలదాచుకుంటున్నాడు. కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల అంశాలతో (PKE) లాండాకు సంబంధాలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం లాండా సరిహద్దు ఆవల నుంచి పేలుడు పరికరాలు (IEDలు), అధునాతన ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నాడు. పంజాబ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెర్రర్ మాడ్యూల్స్ తయారు చేశాడు. దోపిడీలు, హత్యలు, పేలుళ్లు, మాదక ద్రవ్యాల రవాణా, ఆయుధాల స్మగ్లింగ్ పాల్పడుతున్నాడు. 2021లో లాండాపై లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ అయ్యింది. ఎన్‌ఐఏ అతనిపై రివార్డును సైతం ప్రకటించింది.
ఈ ఏడాది జూన్‌లో కెనడాకు చెందిన ప్రముఖ ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కెనడాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా సమీపంలో నిజ్జర్‌పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్‌ఐఏ నిజ్జార్‌ను పరారీలో ఉన్న ఉగ్రవాదిగా ప్రకటించింది. నిజ్జర్ గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడని, కెనడాలోని సిక్ ఫర్ జస్టిస్ (SFJ) అనే తీవ్రవాద సంస్థ కీలక నేత. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు నిజ్జర్ చీఫ్‌గా కూడా ఉన్నాడు. నిజ్జార్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ఆరోపించగా.. భారత్ ఆ వ్యాఖ్యలను కొట్టిపడేసింది.