Maruti Cars recall | బాలెనో, వ్యాగన్‌ఆర్‌ కార్లలో లోపం.. 16 వేలకుపైగా కార్లు వెనక్కి..!

Maruti Cars recall | బాలెనో, వ్యాగన్‌ఆర్‌ కార్లలో లోపం.. 16 వేలకుపైగా కార్లు వెనక్కి..!

Maruti Cars recall : మారుతీ సుజుకీ సంస్థ తయారు చేసిన బాలెనో, వ్యాగన్‌ఆర్‌ మోడల్‌ కార్ల ఫ్యూయెల్‌ పంప్‌ మోటార్‌లోని విడి భాగాల్లో లోపాలు బయటపడ్డాయి. దాంతో ఫ్యూయెల్‌ పంప్‌ మోటార్‌లోని ఏ విడి భాగంలో లోపం ఉంటే దాన్ని ఉచితంగా మార్చి ఇవ్వాలని మారుతీ సుజుకీ నిర్ణయించింది. లోపం ఉన్న విడి భాగాలను సరిచేయడం కోసం 16 వేలకు పైగా బాలెనో, వ్యాగన్‌ఆర్‌ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్‌) మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది.

2019 జులై 30 నుంచి నవంబర్‌ 1 మధ్య తయారైన 11,851 బాలెనో కార్లు, 4,190 వ్యాగన్‌ఆర్‌ కార్లలో ఈ లోపాలు తలెత్తినట్లు వెల్లడించింది. అందువల్ల వాటిని రీకాల్‌ చేస్తున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంప్‌ మోటార్‌ భాగంలో లోపం ఉంటే అప్పుడప్పుడూ ఇంజిన్‌ నిలిచిపోవడం లేదంటే స్టార్టింగ్‌ సమస్య తలెత్తడం లాంటివి జరగవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ మేరకు మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన అధీకృత డీలర్‌ వర్క్‌షాప్‌ల నుంచి లోపాలు ఉన్న కార్ల యజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు తలెత్తే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది.