25వేల కేజీల డ్రగ్స్ పట్టివేత.. విశాఖ పోర్టుకు భారీ కంటెయినర్
ఆపరేషన్ గరుడలో భాగంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను సీబీఐ అధికారులు పకడ్బందీ సమాచారంతో పట్టుకున్నారు.

- బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ బస్తాలు
- బీరు తయారీ గింజల పేరిట కన్సైన్మెంట్
- వాటితోపాటే బస్తాల్లో మాదక ద్రవ్యాలు
- సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’తో గుట్టు రట్టు
విశాఖపట్నం: ఆపరేషన్ గరుడలో భాగంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను సీబీఐ అధికారులు పకడ్బందీ సమాచారంతో పట్టుకున్నారు. అయితే.. పట్టుబడి మాదక ద్రవ్యాలు 26వేల కేజీలు ఉండటంతో అధికారులు నివ్వెరబోయారు. బ్రెజిల్ నుంచి జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈనెల 16న ఈ కంటెయినర్ విశాఖ వచ్చినట్లు గుర్తించారు. వీటిని విశాఖనుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు ఉద్దేశించినట్టు తెలుస్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
విశాఖ పోర్టులోనూ గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నా.. ఇంత స్థాయిలో పట్టుబడటం ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ డ్రగ్స్ బస్తాలు ఉన్న కంటెయినర్‌ను బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టులో బుక్ చేసినట్టు తెలుస్తోంది. విశాఖలోని ఒక ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ఈ కన్సైన్మెంట్ను తీసుకోవాల్సి ఉన్నది. బీర్ల తయారీలో వాడే కొన్ని రకాల గింజలను ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు పత్రాలు ఉన్నాయి. మొత్తం వెయ్యి బ్యాగులు ఉండగా.. అందులో ఒక్కో బ్యాగులో ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేశారు. కన్సైన్మెంట్లో పేర్కొన్న గింజల సంచులతోపాటు వీటిని కలిపేశారు.
ఇంటర్‌పోల్ నుంచి పక్కా సమాచారంతో ఉన్న సీబీఐ అధికారులు.. విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. 2024, మార్చి 21న నార్కొటిక్స్ ప్రత్యేక పరికరాలు, నిపుణులతో విశాఖ వచ్చిన సీబీఐ అధికారులు.. డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించుకుని కంటెయినర్‌ను సీజ్ చేశారు. సరుకు తెప్పించుకున్న చిరునామాలో ఉన్నవారిపైన, గుర్తు తెలియని వ్యక్తులుగా స్మగ్లర్లపైనా కేసులు నమోదు చేశారు.