విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.. గత ముప్పయ్యేళ్లుగా విశాఖను ఏలుతున్నది మాత్రం స్దానికేతరులే. సుబ్బరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి.. పురంధేశ్వరి.. హరిబాబు.. చివరికి ప్రస్తుత ఎంపీ సత్యనారాయణ కూడా వ్యాపార రీత్యా వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారే. అయితే ఈసారి పలువురు సెలబ్రిటీలు విశాఖ మీద కన్నేసినట్లు తెలుస్తోంది.
విశాఖ ఎవరికి సొంతమవునో…
గత 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన జెడి లక్ష్మీనారాయణ మళ్ళీ విశాఖ నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. ఆయన ఏపార్టీ నుంచి పోటీ అన్నది తెలియదు కానీ పోటీకి మాత్రం సిద్ధం అవుతున్నారు. ఇక బిజెపి రాజ్యసభ సభ్యుడు జెవిల్ నరసింహ రావు సైతం ఈసారి విశాఖలో పోటీ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి 2014 లో హరిబాబు (ప్రస్తుత మిజోరాం గవర్నర్) BJP నుంచి ఎంపీగా గెలిచారు.
కాబట్టి ఇక్కడ బిజెపికి మంచి పట్టు ఉందనే నమ్మకంతో జెవిల్ ఈసారి గెలుపు మీద గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధం అవుతున్నారు. అర్బన్, విద్యావంతుల ఓట్లు మోడీ ఖాతాలోకి వస్తాయి కాబట్టి తన గెలుపు సులువేనని ఆయన నమ్మకం. ఇక 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచి కేంద్రంలో విద్యామంత్రిగా పని చేసిన పురంధేశ్వరి ఈసారి టిడిపిలో చేరి, విశాఖ బరిలో నిలుస్తారని అంటున్నారు.
మరి 2019లో టిడిపి తరఫున పోటీ చేసిన గీతం కాలేజి చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీ భారత్ ను చంద్రబాబు ఈసారి ఎక్కడ, ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. వైఎస్సార్సీపీ ప్రస్తుత ఎంపీ సత్యనారాయణ ఈసారి ఈస్ట్ నియోజకవర్గంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో తలపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి విశాఖ నుంచి వైసీపీకి కొత్తగా ఎంపీ అభ్యర్థి రావచ్చని అంటున్నారు.