CAA | కేంద్రం సంచలన నిర్ణయం.. అమలులోకి పౌరసత్వ సవరణ చట్టం..!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది

  • Publish Date - March 11, 2024 / 01:24 PM IST

CAA | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చినట్లయ్యింది. సీఏఏ చట్టం 2019లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందగా.. రాష్ట్రపతి సైతం ఆమోదించారు. అయితే, నిబంధనలు పూర్తికాకపోవడంతో చట్టం అమలులోకి రాలేదు. తాజాగా కేంద్రం హోంమంత్రిత్వ శాఖ నిబంధనలను నోటిఫై చేసింది. దాంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం దక్కనున్నది. ఈ మూడు దేశాలకు చెందిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం భారత పౌరసత్వం దక్కనున్నది. అయితే, డిసెంబర్‌ 31, 2014 లేదంటే అంతకన్నా ముందు భారత్‌కు వచ్చిన శరణార్థులకే పౌరసత్వం లభించనున్నది.

అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. గత సార్వత్రిక ఎన్నికకు ముందే సీసీఏ చట్టం తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలో అమలు నిలిచిపోయింది. తాజాగా మరోసారి మోదీ సర్కారు పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు సీఏఏ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి గతంలో భారతీయ పౌరసత్వం పొందాలంటే ఒక వ్యక్తి కనీసం 11 సంవత్సరాలు భారతదేశంలో నివసించాల్సి ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం నిబంధనలను సరళీకృతం చేశారు. పౌరసత్వం పొందేందుకు ఏడాది నుంచి ఆరేళ్లకు పరిమితం చేశారు. సీఏఏపై దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పలు రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.