వీరభద్ర స్వామిని దర్శించుకున్న కామ్రేడ్ చాడ

కమ్యూనిస్టులు దేవున్ని నమ్మరనేది అబద్ధం ఎవరి విశ్వాసాలు వారి వ్యక్తిగతం అప్పుడు నారాయణ.. ఇప్పుడు చాడ విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అసలే ఆయన కామ్రేడ్‌. కమ్యూనిస్టు పార్టీ నేత. ఏదో గల్లీ కేడరో.. జిల్లా లీడరో అనుకుంటే గుడిలో కాలుబెట్టినట్లే. మొన్నటివరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అదే భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రస్తుతం అదే పార్టీలో జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు. కింది స్థాయి నాయకులు, కేడర్‌కు మార్గదర్శనం చేసే స్థాయి అన్నమాట. […]

  • By: krs    latest    Jan 14, 2023 3:05 PM IST
వీరభద్ర స్వామిని దర్శించుకున్న కామ్రేడ్ చాడ
  • కమ్యూనిస్టులు దేవున్ని నమ్మరనేది అబద్ధం
  • ఎవరి విశ్వాసాలు వారి వ్యక్తిగతం
  • అప్పుడు నారాయణ.. ఇప్పుడు చాడ

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అసలే ఆయన కామ్రేడ్‌. కమ్యూనిస్టు పార్టీ నేత. ఏదో గల్లీ కేడరో.. జిల్లా లీడరో అనుకుంటే గుడిలో కాలుబెట్టినట్లే. మొన్నటివరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అదే భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రస్తుతం అదే పార్టీలో జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు. కింది స్థాయి నాయకులు, కేడర్‌కు మార్గదర్శనం చేసే స్థాయి అన్నమాట. అన్నమాటేందీ ఉన్నమాటే. ఇంతకూ ఈయనెవరనేదే గదా! మీ డౌటు.. ఆయనే కామ్రేడ్ చాడా వెంకట్‌రెడ్డి. సీపీఐ జాతీయనేత.

అయితేందీ.. ఆయనకూ వ్యక్తిగత విశ్వాసం. అభిప్రాయం ఉండదంటరా? పరిస్థితి ప్రభావం పడదంటరా? పాపమో.. దోషమో.. ప్రస్తుతానికైతే అదే విషయాన్ని ఆ కామ్రేడూ ప్రవచిస్తున్నారూ.

వీరభద్ర స్వామిని దర్శించుకున్న చాడ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ప్రారంభమైన జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి శనివారం వీరభద్రున్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

అప్పుడు నారాయణ.. ఇప్పుడు చాడ

ఇదే పార్టీకే చెందిన మరో సీనియర్ నేత అప్పట్లో ఏడుకొండల ఎంకన్నను దర్శించుకున్నారు. గుర్తుందిగా గాంధీ జయంతి రోజు చికెన్ తిన్న డాక్టర్. కే. నారాయణ. సీపీఐ సీనియర్ నేత. ఆ పార్టీ జాతీయ‌ కార్యదర్శి. మరి ఆయనకన్నా నేనేమి తక్కువా అనుకున్నారో ఏమో? నారాయణ బాటలో ఈయన‌ సైతం కొత్తకొండ వీరన్నను సకుటుంబ సమేతంగా సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. పనిలోపని ఆలయ పూజారి ఆశీస్సులు తీసుకుని చాడ తరించారు.

కమ్యూనిస్టులు దేవున్ని నమ్మరనేది అబద్ధం: చాడా

అనంతరం చాడ ఈ క్రింది విధంగా ప్రవచించారు. ఒక చర్చ ఉంది. కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరనే దుష్ప్రచారం ఉంది. సమాజంలో ఆస్తికులు, నాస్తికులు అంటే దేవున్ని నమ్మేవారు, న‌మ్మ‌నివారు ఉంటారు. అది వ్యక్తుల విశ్వాసాలను బట్టి ఉంటుంది. వ్యక్తిని బట్టి వారి వారి వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది.

సీపీఐ నాయకులు కొందరు దేవున్ని నమ్ముతున్నారని రకరకాల విమర్శలు చేస్తున్నారని అన్నారు. మతం అనేది విశ్వాసం. అది ఉన్మాదానికి దారితీస్తెనే అభ్యంతరకరమన్నారు. కమ్యూనిస్టు పార్టీ వర్గరహితం కోసం పనిచేస్తుందన్నారు. మానవీయత ముఖ్యమన్నారు. ఏమైనా కొందరు చాటుగా చేస్తే చాడా నేటుగా చేశారు. కడుపులో దాచుకోకుండా బయటికి చెప్పేశారంతే.

ఇదిలా ఉండగా చాడా వెంకట్‌రెడ్డి గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, సీపీఐ శాసనసభాపక్షనేతగా కూడా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో కొత్త‌కొండ వీరభధ్రుడిని ఈ ప్రాంతవాసులు ఇలవేల్పుగా కొలుస్తారు.