Chandrayaan-3 | మూడు రోజుల్లో చంద్రునిపైకి.. మనం ఎలా చూడాలంటే!
Chandrayaan-3 | విక్రం ల్యాండింగ్ ప్రక్రియను ఇలా చూడొచ్చు.. జూలై 14న బయల్దేరిన చంద్రయాన్-3 సుదీర్ఘ ప్రయాణంతో చంద్రుని సమీపానికి 23 సాయంత్రం దిగనున్న విక్రం ల్యాండర్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న యావత్ దేశం చంద్రునిపై కాలు మోపేందుకు విక్రం ల్యాండర్ తహతహలాడుతున్నది. జూలై 14న శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బయల్దేరిన చంద్రయాన్-3.. సుదీర్ఘకాలం చంద్రుని చుట్టూ తిరిగి.. సమీప కక్ష్యలోకి చేరుకున్నది. అనంతరం ప్రొపల్షన్ మోడ్ నుంచి విడిపడి.. చంద్రుని […]

- విక్రం ల్యాండింగ్ ప్రక్రియను ఇలా చూడొచ్చు..
- జూలై 14న బయల్దేరిన చంద్రయాన్-3
- సుదీర్ఘ ప్రయాణంతో చంద్రుని సమీపానికి
- 23 సాయంత్రం దిగనున్న విక్రం ల్యాండర్
- ఉత్కంఠతో ఎదురు చూస్తున్న యావత్ దేశం
చంద్రునిపై కాలు మోపేందుకు విక్రం ల్యాండర్ తహతహలాడుతున్నది. జూలై 14న శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బయల్దేరిన చంద్రయాన్-3.. సుదీర్ఘకాలం చంద్రుని చుట్టూ తిరిగి.. సమీప కక్ష్యలోకి చేరుకున్నది. అనంతరం ప్రొపల్షన్ మోడ్ నుంచి విడిపడి.. చంద్రుని దిశగా సాగుతున్నది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రం ల్యాండర్ చంద్రునిపై దిగుతుందని ఇస్రో ఆదివారం వెల్లడించింది. విక్రం ల్యాండింగ్‌ను ఎలా చూడాలో కూడా వెల్లడించింది.
చంద్రునిపై దక్షిణ ధృవంలో ఇది ల్యాండ్ కానున్నది. విక్రం సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. అన్నీ అనుకున్నట్టు సాగితే.. అంటే.. కేవలం మూడు రోజుల్లో ఇస్రో కొత్త చరిత్ర సృష్టించనున్నది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపిన 4వ దేశంగా భారత్ నిలువనున్నది. ఇప్పటి వరకూ ఈ ఘనతను గతంలో అమెరికా, రష్యా, చైనా మాత్రమే సాధించాయి.
శనివారం మరో విడత సాఫ్ట్ ల్యాండింగ్‌కు రష్యా ప్రయత్నించినా విఫలమైంది. భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా భావించే విక్రం సారాభాయ్ పేరుతో చంద్రయాన్-3 ల్యాండర్‌కు విక్రం అని నామకరణం చేశారు.
ఇస్రో భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని ఉపయోగించి చంద్రయాన్-3ని అంతరిక్షంలోకి పంపారు. ఆగస్ట్ 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి పలు దఫాలుగా చంద్రుని చుట్టూ తిరుగుతూ.. దూరాన్ని తగ్గించుకుంటూ అత్యంత సమీప కక్ష్యలోకి చేరుకున్నది. ప్రొపల్షన్ మోడ్ నుంచి విడిపడి.. క్రమంగా చంద్రుడికి చేరువవుతున్నది.
ఇలా చూడొచ్చు..
చంద్రుడిపై విక్రం ల్యాండిగ్ ప్రక్రియ విశేషాలను ఇస్రో వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చూడవచ్చు. ప్రత్యక్ష ప్రసారం వెబ్‌సైట్‌తోపాటు.. ఇస్రో యూట్యూబ్ చానల్, ఫేస్‌బుక్, దూరదర్శన్‌లో బుధవారం సాయంత్రం 6.27 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.
చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం సుమారు 250 కోట్లు వెచ్చించారు. 2020 జనవరి నుంచి దీనిని అభివృద్ధి చేశారు. 2021లో ప్రయోగించాలని చూసినా.. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర జాప్యం జరిగింది. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో కూలిపోవడంతో ఆ ప్రయోగం విఫలమైంది. దానికి కొనసాగింపుగా చంద్రయాన్-3 ప్రయోగించారు.