Chandrayan-3 | చంద్రుడిపై ఆశల బండి!
Chandrayan-3 | ఊసులు మోసుకెళ్లిన బండి ఇది కదిలితేనే మిషన్ సక్సెస్ ఆరు చిన్ని చక్రాల ‘ప్రజ్ఞాన్’ రోవర్ ‘చంద్రయాన్-3’లో హీరో ఇదే విధాత: ‘ప్రజ్ఞాన్’ రోవర్… జాబిలి నేలపై ఒంటరి సంచారి. చంద్రుడిపై పగటిపూట అంటే… భూమ్మీద 14 రోజుల వ్యవధిలో దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించనున్న రోవర్. ‘విక్రమ్’ ల్యాండర్ తాను దిగిన చోటనే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. ల్యాండరులోంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ ర్యాంపు మీదుగా కిందికి దొర్లుతుంది. సౌరఫలకాల రేకు […]

Chandrayan-3 |
- ఊసులు మోసుకెళ్లిన బండి
- ఇది కదిలితేనే మిషన్ సక్సెస్
- ఆరు చిన్ని చక్రాల ‘ప్రజ్ఞాన్’ రోవర్
- ‘చంద్రయాన్-3’లో హీరో ఇదే
విధాత: ‘ప్రజ్ఞాన్’ రోవర్… జాబిలి నేలపై ఒంటరి సంచారి. చంద్రుడిపై పగటిపూట అంటే… భూమ్మీద 14 రోజుల వ్యవధిలో దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించనున్న రోవర్. ‘విక్రమ్’ ల్యాండర్ తాను దిగిన చోటనే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. ల్యాండరులోంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ ర్యాంపు మీదుగా కిందికి దొర్లుతుంది. సౌరఫలకాల రేకు విచ్చుకుంటుంది.
రోవర్ ముందుభాగంలో ఎడమపక్క ఒకటి, కుడిపక్క మరొకటి వంతున 2 నేవిగేషన్ కెమెరాలు ఉంటాయి. ఇవి పరిసరాలను గమనిస్తాయి. రోవర్ ముందు భాగంలోనే ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) పరికరం ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై సేకరించిన మట్టి, రాళ్ల శాంపిల్స్ మీద ఆల్ఫా కణాలు, ఎక్స్ కిరణాలను ఈ APXS సాయంతో ప్రయోగిస్తారు.
చంద్ర నమూనాలను రసాయనికంగా పరిశీలించి, మూలకాల కూర్పును విశ్లేషించడం ఈ స్పెక్ట్రోమీటర్ పని. ‘ప్రజ్ఞాన్’ రోవర్ మాటామంతీ అంతా ల్యాండర్ ‘విక్రమ్’తో మాత్రమే! అంటే… ల్యాండరుతో మాత్రమే ‘ప్రజ్ఞాన్’ రోవర్ ‘టచ్’లో ఉంటుంది. ల్యాండరుతో మాత్రమే రోవర్ కమ్యూనికేషన్స్ (సమాచార సంబంధాలు) నెరపుతుంది.
మనం (మిషన్ కంట్రోల్) పంపే ఆజ్ఞలు, సూచనల సంకేతాలను ల్యాండర్ సాయంతో రోవర్ స్వీకరిస్తుంది. తాను కనుగొన్న విశేషాలను ల్యాండరుకు ప్రసారం చేస్తుంది. ఇందుకు రోవర్లో యాంటెనా ఉంది. రోవర్ ‘ప్రజ్ఞాన్’లోని ముఖ్యాంశం… ‘రాకర్- బోగీ’ మెకానిజం. చందమామ ఉపరితలంపై బుల్లి చక్రాల రోవర్ సంచారం అనుకున్నంత సులభం కాదు. అక్కడ రాళ్లూరప్పలు ఉంటాయి.
దారిలో రోవర్ చక్రాలకు చంద్రశిలలు అడ్డుపడితే వాటిని ఎక్కే క్రమంలో రోవర్ అదుపుతప్పి పడిపోవచ్చు. మార్గమధ్యంలో ఈ అవరోధాలను అధిగమించేందుకు ‘రాకర్-బోగీ’ వ్యవస్థ దోహదపడుతుంది. ‘రాకర్-బోగీ’ అనేది… రోవర్ స్థిరత్వం కోల్పోకుండా, కింద పడిపోకుండా చేసే ఒక విధమైన సస్పెన్షన్ ఏర్పాటు. ఎగుడుదిగుళ్ల అంగారక గ్రహపు ఉపరితలంపై తమ ‘సోజర్నర్’ రోవర్ బోల్తా కొట్టకుండా సాఫీగా తిరిగేందుకు ‘నాసా’ 1980ల్లో ఈ సురక్షిత ఏర్పాటు చేసింది.
దీన్ని ‘నాసా’ తమ తదుపరి అంగారక రోవర్లు స్పిరిట్, ఆపర్చూనిటీ, క్యూరియాసిటీ, పెర్సవరన్స్ రోవర్లకూ వర్తింపజేసింది. మన ‘ప్రజ్ఞాన్’ రోవర్ కూడా ఆ బాటలోనే వెళుతోంది. ‘రాకర్-బోగీ’ సిస్టమ్ ఏమిటంటే… రోవర్లో ఎడమవైపు లేదా కుడివైపు మూడు చక్రాల్ని కలుపుతూ పూర్తిగా ఒకే ఇరుసు ఉండదు. ఒక ఇరుసుకు బదులు చక్రాలపై వేర్వేరుగా 2 యాక్సిల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేస్తాయి.
ఫలితంగా రోవర్లోని అన్ని చక్రాలపై బరువు సమానంగా పడుతుంది. దీంతో ఎత్తుపల్లాల ప్రాంతంలో చక్రం వ్యాసానికి రెట్టింపు సైజున్న ప్రతిబంధక శిలలనూ ‘ప్రజ్ఞాన్’ రోవర్ కిందపడిపోకుండా అవలీలగా ఎక్కి దిగగలదు. సురక్షితంగా దిగే ల్యాండర్, అందులోంచి వెలుపలికొచ్చి షికారు చేసే రోవర్… వీటిపై ‘చంద్రయాన్-3’ మిషన్ జాతకం ఆధారపడివుంది.