నిజాయితీ అధికారులకు పౌర సన్మానం.. అశ్వాలపై ఊరేగింపు
వరంగల్‌లో 'జ్వాలా సంస్థ' వినూత్న కార్యక్రమం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం లంచం వద్దన్నందుకు వేధింపులు IAS, IPSలపై ప్రభుత్వం దృష్టి సారించాలి లోక్ సత్తా రాష్ట్ర సలహాదారుడు ప్రొఫెసర్ కోదండ రామారావు విధాత, వరంగల్: లంచాల రుచి మరిగిన ప్రభుత్వంలోని అవినీతి అధికారులను శిక్షించడం ఎంత అవసరమో.. అత్యంత నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సన్మానించడం అంతే అవసరం. ఈ దిశగా వరంగల్ కేంద్రంగా ఉన్న అవినీతి వ్యతిరేక సంస్థ "జ్వాల" వినూత్న […]

- వరంగల్‌లో ‘జ్వాలా సంస్థ’ వినూత్న కార్యక్రమం
- అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
- లంచం వద్దన్నందుకు వేధింపులు
- IAS, IPSలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
- లోక్ సత్తా రాష్ట్ర సలహాదారుడు ప్రొఫెసర్ కోదండ రామారావు
విధాత, వరంగల్: లంచాల రుచి మరిగిన ప్రభుత్వంలోని అవినీతి అధికారులను శిక్షించడం ఎంత అవసరమో.. అత్యంత నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సన్మానించడం అంతే అవసరం. ఈ దిశగా వరంగల్ కేంద్రంగా ఉన్న అవినీతి వ్యతిరేక సంస్థ “జ్వాల” వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజాయితీ అధికారులకు పౌర సన్మానం పేరుతో శుక్రవారం హనుమకొండ లోని వేయి స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించింది.
హనుమకొండలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పోడేటి అశోక్, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం రెవెన్యూ శాఖలో ఏఆర్ఐగా పని చేస్తున్న ch. నరసయ్యలను డప్పు వాయిద్యాల మధ్య అశ్వాలపై ఊరేగించి, పూల వర్షం కురిపిస్తూ ఘనంగా సన్మానించారు. జ్వాలా, లోక్ సత్తా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లోక్ సత్తా సంస్థ రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ కోదండ రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ అధికారులను సన్మానించారు.
నిజాయితీపరులు భయపడాల్సిన పరిస్థితి..
ఈ సందర్భంగా సన్మానం అందుకున్న ఉద్యోగులు అశోక్, నరసయ్య మాట్లాడుతూ తప్పు చేసిన ఉద్యోగులు భయపడాల్సింది పోయి, నిజాయితీగా ఉన్న ఉద్యోగులం భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీ అధికారులకు ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా పోయిందని, ఉన్నతాధికారుల సహకారం కూడా కొరవడిందని పేర్కొన్నారు. సహచర ఉద్యోగులు, ఉన్నత అధికారులు కక్ష సాధింపు చర్యలకు గురవడం బాధ కలిగిస్తుందన్నారు. ప్రజలలో, సమాజంలో మాత్రం ప్రత్యేక గుర్తింపు లభిస్తుండడంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..
ఈ సందర్భంగా ప్రొఫెసర్ పరచా కోదండ రామారావు, జ్వాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ డిసెంబర్ 9న ప్రపంచం అంతా అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతూ ఉండగా రాష్ట్రంలో మాత్రం అవినీతి నిరోధక శాఖ (ACB), ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచే విధంగా ACB ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. IAS, IPS, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల అవినీతిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని జిల్లాల్లో ఏసీబీ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.