ఫిబ్రవరి చివరికల్లా పోడు పట్టాలు : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఈ నెల చివరి వారానికల్లా పోడు భూములు పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాల్కీకి బోయ, పెద్దబోయలు, తలయారి, ఖాయితి లంబాడాలు తదితర కులాల షెడ్యూల్ జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు జరిగిన పోడు భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్‌తో విపత్కర పరిస్థితులు వస్తున్నాయి. కార్బన్ గ్యాస్‌లను తగ్గించుకునేందుకు అంతర్జాతీయ […]

హైదరాబాద్ : ఈ నెల చివరి వారానికల్లా పోడు భూములు పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాల్కీకి బోయ, పెద్దబోయలు, తలయారి, ఖాయితి లంబాడాలు తదితర కులాల షెడ్యూల్ జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు జరిగిన పోడు భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్‌తో విపత్కర పరిస్థితులు వస్తున్నాయి. కార్బన్ గ్యాస్‌లను తగ్గించుకునేందుకు అంతర్జాతీయ ప్రత్యేక ఫండ్‌ను పెట్టిన రేడియేషన్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అందరికి గిరిజనుల గురించి మాట్లాడడం తేలిగ్గా, తమషాగా ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే వీరయ్య భద్రాచలంలో కలిసిన సమయంలో మాట్లాడాను. పోడు భూములు గిరిజనుల హక్కులా మాట్లాడుతున్నారు.. హక్కు కాదు అది దురాక్రమణ అని చెప్పాను. మేం అడవి బిడ్డలం కాబట్టి మాకు ఇవ్వాలంటే.. మొత్తం అడవులను నరికేస్తే పీడపోతుంది కదా. మొత్తం నరికేసి పంచేద్దాం..! గతంలో ఉన్న ప్రభుత్వం సరైన పంథాలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పెద్ద సమస్యగా మారింది. కొన్ని పార్టీలకు ఆటవస్తువులా తయారైంది. మాట్లాడితే కొందరిని వెంటేసుకొని జెండాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తూ హీరోలుగా ప్రవర్తిస్తున్నారు.
పోడుకు ముగింపు పలకాలి..
‘గిరిజనులు అడవి బిడ్డలు. వారి హక్కులను కాపాడాల్సిందే. వారిపై ఎవరూ దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. కానీ, రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? కనుమరుగ కావాలా? అన్నదే పాయింట్. బ్రెజిల్, చైనా తర్వాత చాలాకష్టపడి నిబంధనలు పెట్టి, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు పోతాయని చెప్పే స్థాయిలో చట్టం చేసి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులకు ప్రొబేషన్ పెడితే తప్ప మొక్కలు నాటే పరిస్థితి ఏర్పడింది. మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమయ్యాయో.. మనం ప్రయాణం చేసే నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఎలాంటి సినిమాలు షూటింగ్‌లు జరుగుతుండెనే.. మన అందరి కండ్ల ముందే ఇప్పుడు ఎడారి అయ్యిందో చూశాం. మళ్లీ అడవిని సృష్టించేందుకు రాష్ట్రం అద్భుతమైన కృషి చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి, పేరు ప్రతిష్టలు పెరిగాయి. నేషనల్ ఫారెస్ట్ శాఖ, అంతర్జాతీయ స్థాయిలో 7.8శాతం గ్రీన్ కవర్ తెలంగాణలో పెరిగిందని ప్రశంసిస్తున్నది. పోడు భూముల విషయంలో మాకు స్పష్ట ఉంది. గిరిజనులకు తప్పకుండా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో తప్పకుండా పట్టాలు ఇస్తాం. సర్వేలు పూర్తయ్యాయి’ అని చెప్పారు.
వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండాలా..?
‘పోడు వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండాలా? దీనికి ముగింపు రావాలా? ఇటీవల మంత్రుల బృందం నిర్వహించిన సమావేశంలో స్పష్టంగా చెప్పాం. పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా భూమి, భుక్తి లేకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామని చెప్పాం. 66లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ భూమిని కాపాడాలంటే అధికారులకు నేను చెప్పింది ఒకటే. భేషజాలకు వెళ్లి గిల్లికజ్జాలు పెట్టుకొని.. వారిని ఇబ్బందులకు గురి చేయడం.. వారంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలంతా మంత్రుల వద్దకు.. మంత్రులు మామీదపడడం ఇంతా బాగుండదని చెప్పాం. సీఎస్ ఆధ్వర్యంలో సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా కమిటీల సమావేశాలపై పూర్తయ్యాయి. అటవీ భూములు గిరిజనులకు ఇప్పుడే ఇవ్వం. సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ, గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష రాజకీయ నేతలు సంతకాలు చేసి.. ఇక అడవుల నరికివేత ఉండదని ఒప్పుకుంటే ఈ 11లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు.
గుత్తికోయలను తెచ్చి అడవులను నరికివేయిస్తున్నారు
‘కొందరు పనిగట్టుకొని ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తికోయలను తీసుకువచ్చి రాత్రికి రాత్రి అడవులను నరికివేయిస్తున్నారు. వారంతా దుర్మార్గంగా అటవీ అధికారులపై దాడులు చేస్తున్నారు. అటవీ అధికారి శ్రీనివాసరావును ఎవరు చంపారు?.. దీన్ని సమర్థిస్తామా?. గిరిజనుల డిమాండ్ చట్టవ్యతిరేకం. ప్రభుత్వం దయతలచి ఇస్తే తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో వారికి ఆర్‌ఓఎఫ్ పట్టాలు ఇచ్చారు.. రైతుబంధు ఇవ్వాలంటే ఇచ్చి ఆదుకుంటున్నాం. రూ.400కోట్లు మంజూరు చేసి భద్రాచలం నియోజకవర్గం, గిరిజన ఆవాసాల్లో థర్డ్ ఫేస్ కరెంటు ఇప్పిస్తున్నాం. సర్వే చేయబడ్డ 11లక్షల ఎకరాల పోడు భూములు అందరి సమక్షంలోనే పంచిపెడుతాం. ఫిబ్రవరి చివరి వారంలో పంపిణీ చేస్తాం. అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఓట్ల కోసం మాటలు చెప్పం. ఫిబ్రవరి నెలాఖరులో పోడు భూముల పంపిణీని ప్రారంభిస్తాం. పోడు భూములకు రైతుబంధు, ఉచిత కరెంటు ఇస్తాం. కానీ, పోడు భూములు తీసుకునే గిరిజనులే.. అటవీ భూములను కాపాడే కాపలాదారులు కావాలి. వారి నుంచి రాతపూర్వకంగా తీసుకుంటాం. అడవులను నరికివేస్తే పట్టాలను రద్దు చేస్తాం’ అన్నారు.
ఇకపై గజం భూమి ఆక్రమించడానికి వీల్లేదు..
‘పోడు భూముల వ్యవహారానికి ముగింపు పలకాలి. ఇకపై గజం అటవీ భూములను ఆక్రమించడానికి వీల్లేదు. దాన్ని ప్రభుత్వం అంగీకరించదు. వాతావరణం సమతుల్యం దెబ్బతింటే వర్షాలు పడకపోతే, గ్రీన్ కవర్ లేకపోతే.. వన్యప్రాణులన్నీ నశిస్తే మొత్తం సమాజానికే ప్రమాదం. పట్టాల పంపిణీ తర్వాత పోడు భూములు అనే ఉండవు.. పంపిణీ ఉండదు. ఇంచు ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటూం. అటవీ ప్రాంతానికి సంబంధించి హద్దులు నిర్ణయించి సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తాం. చెట్టును నరకకుండా చర్యలు తీసుకుటాం. కొందరు దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పట్టాలు దొరుకుతయ్ కాబట్టి.. కొందరు అగ్రకులాల వాళ్లు గిరిజన అమ్మాయిల పెళ్లి చేసుకొని వారి పేరుతో కబ్జాలు చేస్తారు. 20, 30 ఎకరాలు పోడు కొట్టుకోవడం. ఖమ్మం, భద్రాచలం జిల్లాలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయ్. పోడు పేరుతో జరిగే దోపిడీని అరికట్టాలి’ అన్నారు.