ఆ ఇద్ద‌రు టైగ‌ర్ల‌ను గెలిపించ‌డానికి.. ఆ 24 అంత‌స్తుల హాస్పిట‌ల్ చాల‌దా..? : సీఎం కేసీఆర్

వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీసీ వ‌ర్గాల‌కు చెందిన ఇద్ద‌రు టైగ‌ర్లు బ‌రిలో ఉన్నారు.. వారిద్ద‌రిని గెలిపించ‌డానికి వ‌రంగ‌ల్‌లో నిర్మాణం అవుతున్న 24 అంత‌స్తుల హాస్పిట‌ల్ బిల్డింగ్ చాల‌దా..? అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు

  • By: Somu    latest    Nov 28, 2023 10:06 AM IST
ఆ ఇద్ద‌రు టైగ‌ర్ల‌ను గెలిపించ‌డానికి.. ఆ 24 అంత‌స్తుల హాస్పిట‌ల్ చాల‌దా..? : సీఎం కేసీఆర్

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీసీ వ‌ర్గాల‌కు చెందిన ఇద్ద‌రు టైగ‌ర్లు బ‌రిలో ఉన్నారు.. వారిద్ద‌రిని గెలిపించ‌డానికి వ‌రంగ‌ల్‌లో నిర్మాణం అవుతున్న 24 అంత‌స్తుల హాస్పిట‌ల్ బిల్డింగ్ చాల‌దా..? అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌లిపి ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


హైద‌రాబాద్ న‌గ‌రంలా వ‌రంగ‌ల్ త‌యారు కావాల‌ని విన‌య్ భాస్క‌ర్ అంటున్నాడు. తెలంగాణ‌లో రెండో అతిపెద్ద న‌గ‌రం వ‌రంగ‌ల్ కాబ‌ట్టి.. ఐటీ ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. భ‌విష్య‌త్‌లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌రంగ‌ల్ ఆల‌వాలం కాబోతుంది. వ‌రంగ‌ల్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభ‌మైంది. ఇది ఆగ‌దు. ఈ ఇద్ద‌రిని గెలిపించ‌డానికి ఈ వ‌రంగ‌ల్‌లో ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటా అని లేస్తున్న 24 అంత‌స్తుల బిల్డింగ్ చాల‌దా..? ఆ ఒక్క హాస్పిట‌ల్ బిల్డింగ్ చాల‌దా.. ఇద్ద‌రిని గెలిపించ‌డానికి. ఇంత‌కుముందు ఆ ముక్కిపోయిన ఎంజీఎంలో ప‌డి ఏడ్సినం.


ఎంజీఎం ఎంజీఎం అది త‌ప్ప ఇంకోటి లేకుండే. ఇవాళ ఈ హాస్పిట‌ల్ బిల్డింగ్ ఎవ‌రి కోసం వ‌స్తుంది. కేవ‌లం ప్ర‌జ‌ల కోస‌మే. ఇంత మంచి హాస్పిట‌ల్ హైద‌రాబాద్‌లో కూడా లేదు. రేపు హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్‌కు వ‌చ్చి చికిత్స చేయించుకునే ప‌ద్ధ‌తిలో, దాంట్లో అన్ని ఫ్యాక‌ల్టీస్ ఉంటాయి. కిడ్నీ బీమారి కావొచ్చు, గుండె బీమారి కావొచ్చు, లివ‌ర్ మార్పిడి కావొచ్చు. 14 ర‌కాల మ‌ల్టీ స్పెషాలిటీస్‌తో భార‌త‌దేశంలోనే ఇలాంటి హాస్పిట‌ల్ ఎక్క‌డా లేదు. 24 అంత‌స్తుల‌తోని బ్ర‌హ్మాండ‌మైన నిర్మాణం జ‌రుగుతోంది.


ఆ ర‌కంగా మీకు మంచి హాస్పిట‌ల్ వ‌స్తుంది. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణ అభివృద్ధి మీద ఏ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి అనే దానికి ఆ ఒక్క హాస్పిట‌ల్‌తోనే తెలుసుకోవ‌చ్చు. వ‌రంగ‌ల్‌కే కాదు తూర్పు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం ప‌డే విధంగా త‌యారవుతోంది హాస్పిట‌ల్. ఒక‌సారి స్టార్ట్ అయిందంటే వేల మంది ఇక్క‌డికి వ‌స్త‌రు. న‌గ‌రం ఇంకా అభివృద్ధి జ‌రుగుత‌ది. కొత్త పార్కులు, కొత్త రోడ్లు వ‌చ్చాయి. మంచి నీరు కడుపు నిండా ఉన్నాయి అని కేసీఆర్ తెలిపారు.


ఆటో రిక్షాల మీద దాస్యం మా ధైర్యం అని రాసుకున్న‌ట్లు చెప్పారు. కార్మికుల‌తో, సామాన్య ప్ర‌జ‌ల‌తో మ‌మేకమై పోతారు. ఆటో రిక్షా కార్మికుల క‌ష్టం గుర్తించి జీరో ట్యాక్స్ చేశాం. కానీ మీకు ఒక స‌మ‌స్య ఉంది. ఏడాదికి ఒక‌సారి ఫిట్‌నెస్, ప‌ర్మిట్ స‌ర్టిఫికెట్‌కు రూ. 1200 భారం ప‌డుతోంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే దాన్ని ర‌ద్దు చేస్తామ‌ని మ‌న‌వి చేస్తున్నా. ఈ ర‌కంగా ఆటో కార్మికుల‌కు మేలు జ‌రుగుత‌ద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.


విన‌య్ భాస్క‌ర్, న‌రేంద‌ర్ వీళ్లిద్ద‌రూ కూడా బీసీ బిడ్డ‌లు. మీ కాళ్ల‌లో చేతుల్లో పెరిగిన సొంత బిడ్డ‌లు. వీళ్లు ఎక్క‌డ్నుంచో వ‌చ్చిన‌వారు కాదు. మీరు పెంచిన‌వ‌టువంటి వాళ్లు. మీ సేవ‌లో ఉంటారు. విన‌య్ భాస్క‌ర్ ప్ర‌భుత్వ చీఫ్ విప్.. అయిన‌ప్ప‌టికీ ఒక రోజు కూడా హైద‌రాబాద్‌లో ఉండ‌డు. పొద్దున లేస్తే వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌లో ప్ర‌జ‌ల మ‌ధ్యన తిరుగుతారు. న‌రేంద‌ర్ కూడా లారీ డ్రైవ‌ర్ బిడ్డ‌. చిన్న‌త‌నం నుంచి క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాను అని చెప్పారు.


బీసీ బిడ్డ‌, సామ‌న్య కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి. వ‌రంగ‌ల్‌లో ఉండే బీసీ మేధావులు, ప్రొఫెస‌ర్లు, టీచ‌ర్లు, అంద‌ర్నీ అప్పీల్ చేస్తున్నా.. ఈ ఇద్ద‌రు బీసీ బిడ్డ‌ల‌ను గెలిపించే బాధ్య‌త బీసీల‌దే. అంద‌రూ ఏకమై ఇద్ద‌రికి విజ‌యం చేకూర్చాలి. ఇద్ద‌రు టైగ‌ర్ల‌కు అవ‌కాశం వ‌చ్చింది.. వారిని గెలిపించాలి మౌనంగా ఉండ‌కూడ‌దు అని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.


కాంగ్రెస్ పార్టీవ‌ల్లే వ‌రంగ‌ల్ అభివృద్ధి కుంటు ప‌డింది. మ‌ళ్లీ ఇప్పుడు అభివృద్ధి జ‌రుగుతుంది. ఈ వేగం ఆగొద్దు. అయితే త‌ప్ప‌కుండా వ‌రంగ‌ల్‌కు ఐటీ ప‌రిశ్ర‌మ‌లు, విద్యుత్ సంస్థ‌లు, యూనివ‌ర్సిటీలు వ‌స్తాయి. అవ‌న్నీ తెచ్చే ప్లాన్‌లో ఉన్నాను. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాన్ని అతి సుంద‌రంగా తీర్చిదిద్దుతా అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.