దేశంలో రైతుబంధు ప్రారంభించిందే బీఆర్ఎస్: సీఎం కేసీఆర్

దేశంలో రైతు సంక్షేమ కోసం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే రైతుబంధు పథకం ప్రారంభించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని సీఎం కేసీఆర్ అన్నారు

  • By: Somu    latest    Nov 26, 2023 10:21 AM IST
దేశంలో రైతుబంధు ప్రారంభించిందే బీఆర్ఎస్: సీఎం కేసీఆర్
  • 58 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యం
  • ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: దేశంలో రైతు సంక్షేమ కోసం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే రైతుబంధు పథకం ప్రారంభించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ప్రజల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.


ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. పదేళ్ల బీఅరెస్ పాలన అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉందని తెలిపారు. రాష్ట్ర సంపద పెంచామని, మళ్లీ మేము గెలిస్తే రూ.5వేల పింఛన్ ఇస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, అమ్మఒడి వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, ఇంకా పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు.


ఖానాపూర్ నియోజకవర్గంలో 7300 ఆదివాసి గిరిజనులకు పోడుభూమి పట్టాలను అందజేశామని, రైతుబంధు డబ్బులు కూడా ఇచ్చామని తెలిపారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా రూ.5 లక్షలు చెల్లిస్తున్నామని అన్నారు భూమిలేని నిరుపేదలకు కేసీఆర్ భరోసా కింద ఎన్నికల అనంతరం రూ.5 లక్షల బీమా కల్పిస్తామని తెలిపారు.


ఈసారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను రైతుబంధు ద్వారా దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు… రైతుబంధు దుర్వినియోగమా అని ప్రశ్నించారు. రైతు బంధు కావాలంటే బీఆరెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.


రైతులకు 24 గంటలు కరెంట్ కావాలంటే జాన్సన్ నాయక్ ను గెలిపించాలని అన్నారు. నా కొడుకు స్నేహితుడు జాన్సన్ నాయక్ కు ఓటు వేస్తే నాకు వేసినట్టే అని తెలిపారు. నాకొడుకు ఖానాపూర్ ను దత్తత తీసుకుంటే నేను తీసుకున్నట్టే… ఖానాపూర్ అభివృద్ధి నా బాధ్యత, నా కొడుకు బాధ్యత… మీరు తప్పకుండా నా కొడుకు లాంటి జాన్సన్ నాయక్ ను గెలిపించాలని కోరారు.