అధికారంలోకి రాగానే రెండు నెలల్లో 111 జీవో క్లియర్ చేస్తాం : సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 111 జీవో సమస్యను రెండు నెలల్లో క్లియర్ చేయించే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు

చేవెళ్ల : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 111 జీవో సమస్యను రెండు నెలల్లో క్లియర్ చేయించే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నేను ఆల్రెడీ చేశాను అందులో ఏం లేదు. కొద్దిగంత పని మిగిలింది అది అయిపోతది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్ పక్కకే ఉంటరు మీరు. మీ భూములు అమ్మకుండా 111 జీవో పెట్టారు. కానీ దాన్ని ఎత్తేసే ప్రయత్నం ఎవడూ చేయలేదు. ఎయిర్‌పోర్టుకు దగ్గర ఉంటరు. ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. షాబాద్‌లో వెల్‌స్పన్ కంపెనీ, కైటెక్స్ కంపెనీ వచ్చింది. వీటి ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే చందన్‌వెల్లిలో అమెజాన్, కటేరా, కుందానా, ఈస్టర్ కంపెనీలు వచ్చాయి.
సీతారాంపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నిర్మాణం జరుగుతంది. అదే విధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టినా.. కేటీఆర్, యాదయ్య కలిసి బ్రహ్మాండంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో పెట్టుకుంటే నేనే ప్రారంభించాను ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని. ఇవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో యాదయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వచ్చాయి అని కేసీఆర్ తెలిపారు.
మీకు ప్రధానంగా రెండు, మూడు సమస్యలు ఉన్నాయి. నంబర్ వన్.. 111 జీవో మీకు కంప్లీట్ క్లియర్ కావాలి. పోయిన ఎలక్షన్‌లో మాట ఇచ్చిన ప్రకారం ఎత్తేసినం. హైదరాబాద్‌కు అంటుకుని ఉండే ఏరియా కాబట్టి, హైదరాబాద్‌లో మళ్ల కలుస్తది కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. రేపు నగరానికి ఇబ్బంది రావొద్దని చెప్పి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారవుతుంది. అది కొద్ది రోజుల్లో నెల పదిహేను రోజుల్లో క్లియర్ అయిపోతది. దాని గురించి మీకు అనుమానం అవసరం లేదు. అది చేయించే బాధ్యత నాది.. తప్పకుండా అయిపోతది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
రెండోది మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు రావాలి. పదేండ్లు కాంగ్రెసోళ్లు కేసులు పెట్టి ఆపారు. మొన్న క్లియర్ అయిపోయింది. నేనే పోయి స్విచ్ఛాన్ చేసి ప్రారంభించాను. దాని పేరే రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాటా మీకే ఉన్నది రందీ పడే అవసరం లేదు. కాంగ్రెసోళ్లు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైంది తప్ప వేరే లేదు.
పాలమూరు నుంచి ఫస్ట్ చేవెళ్లకే నీళ్లు వస్తాయి. ఇక్కడ ఉద్ధండపూర్ రిజర్వాయర్ నుంచి కాల్వలు తవ్వేస్తే నీళ్లు వస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగాయి. ఇప్పుడు ఆ బాధలు కూడా పోయాయి. కాబట్టి కొన్ని నెలల్లో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయి అని కేసీఆర్ హామీ ఇచ్చారు.