కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర: సీఎం కేసీఆర్
కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర అని మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు.

విధాత: కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర అని మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. అది మీ తలరాతను రాస్తది. వచ్చే ఐదేండ్లకు ఈ రాష్ట్ర భవితవ్యాన్ని, మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తది. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఓటు వాడాలి. చెప్పుడు మాటలు వింటే మనం దెబ్బతింటాం. న్యాయం తక్కువ జరుగుతది. నష్టం ఎక్కువ జరుగుతది. ఈ విషయాలన్నీ చర్చించాలి.
కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా ఈ విషయాన్ని. కాంగ్రెస్ పాలనలో ఏం ఉండే. ఈ పదేండ్ల నుంచి ఏం జరుగుతుంది. దీన్ని బేరిజు వేయాలి. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలు, దళితుల బతుకు ఎలా ఉండే. రైతుల సమస్యలు ఎలా ఉండేనో ఆలోచించాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోడేపుడి వెంకటేశ్వర్ రావు మధిర ఎమ్మెల్యేగా ఉండే. వరి కంకులు తీసుకొచ్చి చూపించేవారు.
మధిరకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని నిరసన వ్యక్తం చేసేవారు. కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీలో కందీళ్లు, కిరోసిన్ బుడ్లు కరెంట్ వస్తలేదని, ఎండిపోయిన వరి కంకులు పట్టుకుని రావడం. ఇదంతా మీరు చూశారు. కానీ పదేండ్లలో ఎక్కడ కూడా ఎకర పొలం ఎండలేదు. 24 గంటల కరెంట్ వస్తుంది. ఆయకట్టుకు నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రమంతా వ్యవసాయం పండుగలా మారింది. ఈ విషయాలను ఆలోచించాలి.
14 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ వస్తే ఆషామాషీగా పని చేయలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం. ఆర్థిక నిపుణులతో చర్చించి రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు లోతుగా విచారించి కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ఈ స్వల్ప కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు ఏందంటే.. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా వెనక్కి పోయిందా..? ముందుకు పోయిందా..? డెవలప్ అయిందా..? చెడిపోయిందా..? అని చూడటానికి కొన్ని గీటురాళ్లు ఉంటాయి. అందులో ప్రధానమైనది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చూస్తరు. తలసరి ఆదాయంలో 2014లో మన ర్యాంకు 18 ఉండే. ఇవాళ తెలంగాణ ర్యాంకు తలసరి ఆదాయంలో నంబర్ వన్‌గా ఉంది. ఇది మేం ప్రకటించం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంలో మనకు వ్యతిరేక ప్రభుత్వం ఉంది.
ధాన్యం ఉత్పత్తిలో పంజాన్‌ను మించిపోయాం. తెలంగాణకు వ్యవసాయం చేయడం రాదని అవహేళన చేశారు. ఎగతాళి చేశారు. మీరు జోన్నలే పండించుకోవాలి.. వడ్లు పండవు అని అన్నారు. అట్ల మాట్లాడిన ఆంధ్రా ఎక్కడుంది..? ఇవాళ తెలంగాణ ఎక్కడుంది..? మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి పోతాం. మన దేశంలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి.. కులం, మతం, బస్తీ, ఊరు అనే తేడా లేకుండా శుద్ధమైన మంచినీళ్లు సరఫరా చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా టాప్ ర్యాంకులో ఉన్నాం. ఇవన్నీ సాధించిన విజయాలు. ఇవి ఆషామాఫీగా రావు. మాయ చేస్తేనో, ఉపన్యాసం చెప్తేనో రావు. చాలా చిత్తశుద్ధితో, ఒళ్లు దగ్గర పెట్టుకుని కమిట్‌మెంట్‌తో పని చేస్తేనే వస్తాయి. ఊరికే సొల్లు పురాణాలు చెప్తే రావు.
మధిర చైతన్యంవంతమైన ప్రాంతం.. మీరంతా ఆలోచించాలి. గతంలో మధిరలో బీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు గెలిపించలేదు. అయినా మీ మీద అలగలేదు. ఎందుకంటే ఈ మధిర నాది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్‌దే. ప్రతి ఇంచు బాగు పడాల్సిందే. ఎక్కడ ధాన్యం పెరిగినా, ఎక్కడ పది మంది ముఖాలు తెల్లవడ్డ నాకు గర్వమే కదా..? రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన సోయి కదా..?.
ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అట్ల అని పక్షపాతం వహించలేదు. దళితబంధు ద్వారా మీరు సత్యాన్ని గమనించాలి. రాష్ట్రమంతా అమలు చేస్తున్నాం. ఒక మండలంలో అన్ని కుటుంబాలకు ఇస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటది అని చెప్పి ప్రయోగత్మకంగా నాలుగు మండలాలు తీసుకున్నాం. ఇక్కడ భట్టి విక్రమార్క ఉన్నడు. ఆయన కాంగ్రెస్ అని పక్షపాతం పట్టలేదు. చింతకాని నుంచి నాకు ఎవరూ దరఖాస్తు పెట్టలేదు. భట్టి నన్ను అడగలేదు. దాని కోసం ధర్నా చేయలేదు. నన్నెవరూ డిమాండ్ చేయుకున్నా నాకు నేను రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలు తీసుకున్న. దాంట్లో చింతకాని ఒకటి. 400కు పైగా ఇండ్లు ఉంటే అందరికి ఈ కార్యక్రమం అమలు చేశాం.
మధిరలో దళిత జనాభా ఎక్కువ. దళిత సమాజం, మేధావులు దళిత బిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఈ విషయాన్ని దృష్టి పెట్టి ఆలోచన చేయాలి. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి ఉంటే ఇంతకాలం దళితుల దరిద్రం ఇట్లనే ఉండేదా? దళిత సమాజం దోపిడికి గురైన సమాజం. తరతరాలుగా అణచివేయబడ్డ సమాజం. వెలివాడలలో నివసించిన సమాజం. వాళ్లు సాటి మనషులు కారా..? వాళ్లు పైకి రాకూడదా..? వాళ్లు మనలాగా తయారు కాకూడదా..? ఎంతకాలం దళితుల దరిద్రం ఉంటదో.. ఈ దేశం ముఖం మీద ఒక మచ్చనే ఉంటది తప్ప ఈ దేశానికి క్షేమం కాదు. అది పోవాలి.
ఉత్తర భారతదేశంలో దళితుల మీద భయంకరమైన దాడులు. మోదీ రాష్ట్రంలో కూడా దాడులు. భయంకరమైన దాడులు మనం అసలు భరించలేం. అతి తీవ్రమైన వివక్ష. ఇది పోవాలి. తెలంగాణ దళిత బంధు భారతదేశ దళితజాతికి ఒక మార్గదర్శనం చేయాలని పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికీ ఇవ్వలేకపోయినా, కనీసం దఫదఫాలుగా అయినా సరే వారి పేదరికం పోవాలి. దళిత యువకులు, యువతుల్లో వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. వాళ్లకు అవకాశం లేక ఉంటున్నారు. ఉట్టిగ పదిలక్షలు ఇచ్చి ఊరుకోవడం లేదు. దళితబంధులో మేం జేసింది ఏందంటే రిజర్వేషన్లు పెట్టినం. వైన్, బార్ షాపులు బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం.
ఒక్క దళితుడికి అన్న ఉండేన ఈ రాష్ట్రంలో. రిజర్వేషన్లు పెట్టి 260 మందికి ఇచ్చాం. మెడికల్ షాపుల్లు, ఫర్టిలైజర్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టినం. ఎవ్వళ్లు ఇవన్నీ నాకు చెప్పలేదు. ఇవన్నీ నాకంతట నాకు పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం ఇవాళ బాగుపడ్దది. మరి దళితబిడ్డలు మళ్లా కాంగ్రెస్‌కు ఎందుకు గుద్దాలి ఓటు. ఈ పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంది..? పట్టులేనటువంటి, పట్టించుకోనటువంటి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏంది..? ఆయన నియోజకవర్గానికే ఆరు నెలలకు ఒకసారి వస్తడు. చుట్టపు చూపులా వచ్చే మనిషి. అంతే కదా..? నేను వాస్తవం చెబుతున్నా .
ఇవాళ కాంగ్రెసోళ్లు కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు. కాంగ్రెస్‌లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాడు గెలిచేది లేదు సచ్చేది లేదు. గ్యారెంటీగా చెబుతున్నా.. మళ్ల గదే 20 సీట్లు. 20 లోపే ఇంకా. ఇవాళ మధిర పర్యటనతో 70 నియోజకవర్గంలో మాట్లాడుతున్నా. నేను ఇంకా 30 నియోజకవర్గాలు వెళ్లాల్సి ఉంది. అయింతా 30 పోతే ఇంకా ఊడ్సుకపోతది కాంగ్రెస్. నేను ఎట్లేట్ల పోతనో.. అట్ల ఊడ్సుకోని పోతున్నది కాంగ్రెస్. ఏం లేదు అంత వట్టిదే డంబాచారం.
చాలా బ్రహ్మాండంగా పాత మెజార్టీ కంటే రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజ్‌ను గెలిపిస్తే లాభం జరగుదది కానీ.. ఈ భట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది..? వట్టిగనే మిమ్మల్ని మాయమశ్చీంద్ర చేసి, నాకు ముఖ్యమంత్రి అని చెబుతుండు. ఆ పార్టీ గెలిస్తే కదా ముఖ్యమంత్రి. అదంతా అయ్యే పనికాదు. దళితవర్గం ఒక్క ఓటు కూడా భట్టి విక్రమార్కకు వేయొద్దు.
50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నరు తప్ప దళితుల కోసం ఒక్క పని చేసిండ్రా..? దళితబంధు లాంటి పథకం తెచ్చిండ్రా..? తెస్తరా వాళ్ల జీవితంల..? తెచ్చే ఆలోచన వాళ్లకు ఉన్నదా..? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇదివరకే అమ్మను జూడు, బొమ్మను జూడు అని మస్తుగ ఓట్లు గుద్దుకున్నరు. ఇందిరమ్మ రాజ్యంల ఎవరు బాగుపడ్డరు..? ఎవరికి ఏం ఒరిగింది..? ఇందిరమ్మ రాజ్యంల ఎమర్జెన్సీ పెట్టి అందర్ని తీస్కపోయ్ జైళ్లల్ల పడేసిండ్రు. దళితులు దళితుల లెక్కనే ఉన్నరు. గిరిజనులు గిరిజనుల లెక్కనే ఉన్నరు. ఏం అభివృద్ధి లేదు, మన్ను గూడా లేదు. కరెంటు రాలేదు. నీళ్లు రాలేదు. తెలంగాణకైతే మరీ అన్యాయం జరిగింది’.
‘కాంగ్రెసోళ్లు ఏదో ఒకటి చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నరు. మార్పు కావాల్నట.. ఏం మార్పు నాకు అర్థం కాదు. మరె మార్పు గావాల్నంటె ఈడ భట్టి విక్రమార్కను కూడా మార్పు జెయ్యాలె గదా..? ఇట్ల ఒట్టి కథలు చెప్పి మిమ్మల్ని ఏమారుస్తరు. జాగ్రత్తగా ఉండాలె. నేను బోనకల్ మండలానికి వచ్చి మక్క చేలు చూస్తందుకు పోయిన. వర్షం పడి కరాబ్ అయినయ్. ఆన్ ది స్పాట్ ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రకటించిన. తిరిగొస్తుంటే 20, 25 మంది దళిత ఆడబిడ్డలు కారు ఆపిండ్రు. నేను దిగి ఏందమ్మా అని అడిగిన. సార్ బోనకల్లుకు కూడా దళితబంధు పెట్టుండ్రి, మేం మారిపోయినమ్ అన్నరు. దాంతో బోనకల్ మండలానికి కూడా దళితబంధు ప్రకటించిన’.
‘ఇప్పుడు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్న మీరు మధిర నియోజకవర్గంలో కమల్‌రాజ్‌ను గెలిపించండి. నేను నియోజకవర్గం అంతటికీ ఒకేసారి దళితబంధు ప్రకటిస్తనని హామీ ఇస్తున్నా. కరీంనగర్, హుజూరాబాద్‌లో 20 వేల కుటుంబాల చొప్పున ఇచ్చినట్టే మధిరలో కూడా ప్రతి కుటుంబానికి దళితబంధు ఇప్పిస్తనని నేను మనవి చేస్తున్నా’.
కాంగ్రెస్ నాయకులు రైతుబంధు వేస్ట్, దాన్ని తీసి బంగాళాఖాతంలో పడేస్తమని అంటున్నరు. మరె రైతుబంధు వేస్టా..? రైతుబంధు కావాలె గదా..? మరె రైతుబంధు ఉండాల్నంటే ఇక్కడ కమల్‌రాజ్‌ను గెలిపించాలె. బీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే రైతుబంధు ఉండుడే కాదు, ఎకరానికి రూ.10 వేలు ఉన్న రైతుబంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచబోతున్నం. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడని అంటున్నరు. మూడు గంటలే చాలు అంటున్నరు. మరె మూడు గంటల కరెంటు చాలా..? చాలదు గదా..? మరె 24 గంటల కరెంటు ఉండాలె గదా..? మరె 24 గంటల కరెంటు ఉండాల్నంటే ఏం జెయ్యాలె..? మధిరల కమల్‌రాజ్‌ను గెలిపించాలె. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాట గలుస్తది’ .
‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నమని గొప్పగ జెప్పిండు. అరె సన్నాసి మాది 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం రా.. నువ్వేం మాట్లాడుతున్నవ్ అని అడిగిన. కాంగ్రెస్ హయాంల మధిరల కరెంటు ఎట్లుండె..? చిల్లకల్లు కాడ వచ్చేది. చిల్లకల్లు కాడ వస్తే రోజూ బ్రేక్ డౌనే. దాన్ని నేనొచ్చినంక ఖమ్మానికి మార్చిన. దాంతోటి మధిరకు శాశ్వతంగ పీడపోయింది. ఇయ్యాల నాణ్యమైన కరెంటు వస్తున్నది.
కాబట్టి మీరు ఆలోచన చేసి ఓటెయ్యాలె. పార్టీ వైఖరి, చరిత్రను చూడాలె. మేం అధికారంలోకి రాగానే కాంగ్రెసోళ్లు ఇస్తున్న రూ.200 పెన్షన్‌ను రూ.1000 చేసినం. తర్వాత రూ.2 వేలకు పెంచినం. భవిష్యత్తులో దాన్ని రూ.5 వేలకు పెంచబోతున్నం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినం. 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినం. ఈ 80 లక్షల అద్దాలు మాయి ఉండంగ కాంగ్రెస్ ఎట్ల గెలుస్తదండి..?’
బీఆర్‌ఎస్ గెలిస్తే ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతది. అద్భుతాలు జరుగుతయ్. కాంగ్రెస్ గెలిస్తే కథ మొదటికొస్తది. వాళ్లకు అసలు రాష్ట్రం గురించి అవగాహనేలేదు. మధిర ఆయకట్టుకు కృష్ణా నీళ్లు తక్కువ పడుతున్నయ్. పెద్దపెద్ద నాయకులున్నరు కాంగ్రెస్‌ల. ఒక్కడన్నా ఆలోచించిండా..? ఖమ్మం జిల్లాను ఒరుసుకుని గోదావరి పారుతది, లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజూ పోతుంటయ్ దుమ్ముగూడెం దగ్గర. ఆ నీళ్లను ఎత్తుకోవాలె, ఖమ్మంల పోసుకోవాలె అని ఎవడన్నా ఆలోచించిండా..? మేం ఆలోచించి సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నం.
దాదాపు అయిపోవచ్చింది. ఏడెనిమిది నెలల్లో పూర్తయితది. ఒక్కసారి 37 టీఎంసీ నీళ్ల సీతమ్మ సాగర్ పూర్తయితే మధిరలో కరువు అనేదే ఉండదు. మన దిక్కు మళ్లి గూడా చూడదు. 365 రోజులు నిండ నీళ్లే ఉంటయ్. అద్భుతాలు జరుగుతయ్. కాబట్టి దయచేసి మంచి ప్రణాళికలతో ముందుకు పోయే బీఆర్‌ఎస్‌ను పోడగొట్టుకోవద్దు. ఈ పట్టిలేని భట్టి విక్రమార్కను గెలిపిస్తే వచ్చేదేమీ లేదు.
ఈసారి ఓడగొడితే మాత్రం మధిర వాళ్లతో నేను పంచాయతీ పెట్టుకుంటా. రాష్ట్రంలో ఎలాగూ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తది కాబట్టి ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మీకు లాభం. నా మాటను గౌరవించి మీరు కమల్‌రాజ్ గారిని గెలిపించండి. ఆయన సౌమ్యుడు, విద్యాధికుడు, మీ మధ్యనే ఉంటడు. మీకందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనను గెలిపిస్తే మధిరను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా.