వ‌రంగ‌ల్‌లో ఆ రైల్వే లైన్ మీద ఆరు బ్రిడ్జిల నిర్మాణం చేసే బాధ్య‌త నాది: సీఎం కేసీఆర్

వ‌రంగ‌ల్ న‌గ‌రం మ‌రింత అభివృద్ధి జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు

  • By: Somu    latest    Nov 28, 2023 10:00 AM IST
వ‌రంగ‌ల్‌లో ఆ రైల్వే లైన్ మీద ఆరు బ్రిడ్జిల నిర్మాణం చేసే బాధ్య‌త నాది: సీఎం కేసీఆర్

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ న‌గ‌రం మ‌రింత అభివృద్ధి జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో ప్ర‌ధాన స‌మ‌స్యగా ఉన్న రైల్వే లైన్‌పై క‌నీసం ఆరు బ్రిడ్జిల నిర్మాణం చేసే బాధ్య‌త నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు. వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


‘కాంగ్రెస్‌ అసమర్థ పాలనవల్ల వరంగల్‌ పట్టణంలో తాగు నీళ్లకు కరువు ఏర్పడింది. తెలంగాణ రాకముందు తాగు నీళ్లకు గోస ఉండె. ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నయ్‌. నిజాం కాలంలో పెట్టిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్‌ పార్టీ అమ్మేసింది. బీఆర్‌ఎస్‌ వచ్చినంక వరంగల్‌ దగ్గరలోనే బ్రహ్మాండమైన టెక్స్‌టైల్‌ పార్కును పెట్టుకున్నం. చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చినయ్‌. ఏడాది, రెండేండ్లలో ఆ టెక్స్‌టైల్‌ పార్కులో లక్షల మంది ఆడవాళ్లు, మగవాళ్లకు ఉద్యోగాలు రాబోతున్నయ్‌’ అని కేసీఆర్ తెలిపారు.


‘వరంగల్ పట్ణణం కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నది. దుమ్ముధూళి ఉండే వరంగల్‌ పట్టణంలో ఇయ్యాల బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నయ్‌. బ్రహ్మాండమైన సదుపాయాలతో నిర్మాణాలు జరుగుతున్నయ్‌. విద్యారంగంలో పేద పిల్లల కోసం రెసిడెన్షియల్‌ స్కూళ్లు పెట్టినం. వాటిని జూనియర్‌ కాలేజీలుగా మార్చినం. ఇకముందు డిగ్రీ కాలేజీలుగా కూడా చేసుకోబోతున్నం. వైద్య రంగంలో కూడా పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నం. వరంగల్‌ పట్టణంలో కాళోజీ పేరు మీద తెలంగాణ హెల్త్‌ యూనివర్సిటీ పెట్టుకున్నం’ అని సీఎం చెప్పారు.


‘వరంగల్‌ పట్టణానికి ప్రధాన సమస్య ఏందంటే రైల్వే లైన్‌ అడ్డం. ఆ రైల్వే లైన్‌ మీద కనీసం ఆరు బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ఈస్ట్‌, వెస్ట్‌ ప్రజలు అటు, ఇటు రాకపోకలు సాగించుడు సులువైతది. వచ్చే టర్మ్‌లో తప్పనిసరిగా ఆ ఆరు బ్రిడ్జిల నిర్మాణం చేసే బాధ్యత నాదని మనవి చేస్తున్నా. ఇప్పటికే ఒక పక్కన నేషనల్‌ హైవేలో భాగంగా బ్రహ్మాండమైన పెద్ద బైపాస్‌ రోడ్డు వచ్చింది. మరో పక్క రింగు రోడ్డును కూడా కంప్లీట్‌ చేస్తే.. అద్భుతమైన రింగు రోడ్డు వరంగల్‌ పట్టణానికి వస్తది. హుడా ఆధ్వర్యంలో గూడా అన్ని రకాలుగా వరంగల్ మాస్టర్‌ ప్లాన్‌ తయారైతున్నది. దాంతో ఈ నగరం బ్రహ్మాండంగా ఉంటది’ అని కేసీఆర్ తెలిపారు.