వికారాబాద్‌కు కృష్ణా నది నీళ్లు తీసుకొస్తా : సీఎం కేసీఆర్
వికారాబాద్‌కు కృష్ణా నది నీళ్లు ఏడాది లోపు తీసుకొస్తామని వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు.

విధాత: వికారాబాద్‌కు కృష్ణా నది నీళ్లు ఏడాది లోపు తీసుకొస్తామని వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నరు. ఆ ప్రాజెక్టు మీద 196 కేసులు వేసి పదేండ్లు ఆలస్యం చేశారు. అయినా ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేవలం వికారాబాద్‌కు కాల్వ తవ్వాల్సిన పని ఉంది. పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలకు కృష్ణా నది నీళ్లు తీసుకొస్తాం. ఈ నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతలలో వాటా ఉంది.
మీకు డెఫినెట్‌గా ఏడాది కాలంలో నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. వికారాబాద్ భూములు ప్రత్యేక భూములు, ఆ నీళ్లు వచ్చాయంటే మంచి పంటలు పండుతాయి. కమర్షియల్ క్రాప్స్ పండుతాయి. బంగారాన్ని పండిస్తారు. చాలా అద్భుతంగా ఎదుగుతారు. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు పంపు కూడా ఇటీవలే ఆన్ చేశాను. అందులో మీ వాటా ఉంది తప్పకుండా నీళ్లు వస్తాయి అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కృష్ణా, గోదారి మధ్య ఉండే ఈ ప్రాంతానికి మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదు. మిషన్ భగీరథ రాకముందు మంచి నీళ్ల బాధలు ఎట్ల ఉండే. ఒకసారి యాది చేసుకోండి. ఎన్ని అవస్థలు పడేది ఆడబిడ్డలు. మహిళలంతా ప్లాస్టిక్ బిందెలు తీసుకొని నీళ్లు మోసేది. బోరింగ్‌లు కొట్టి కొట్టి అలసిపోయేది. మిషన్ భగీరథ పుణ్యమా అని మారుమూల తండాల్లో నీళ్లు పరిశుభ్రంగా వస్తున్నాయి. ఇవన్నీ మీ కండ్ల ముందే ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఇతర ఆఫీసులు హైదరాబాద్‌లో ఉండే. మీకు బలమైన కోరిక ఉండే వికారాబాద్ జిల్లా కావాలని. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ కోరిక నెరవేరింది. ఇక్కడ డిగ్రీ, మెడికల్ కాలేజీ లేకుండే. మెతుకు ఆనంద్ పట్టుబట్టి చేయించాడు. ఒక మెడికల్ కాలేజే కాదు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు, కోర్సులు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 450 పడకల ఆస్పత్రి వస్తది. చిన్న చిన్న జబ్బులకు హైదరాబాద్ పోవాల్సిన అసవరమే ఉండదు. ఆ రకంగా మెడికల్ కాలేజీ వచ్చింది.
హైదరాబాద్‌కు సమీప ప్రాంతం వికారాబాద్. రాబోయే రోజుల్లో వికారాబాద్‌లో ఐటీ కార్యకలాపాలు విస్తరిస్తాయి. చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాలుష్యం లేని పరిశ్రమలు రాబోతున్నాయి. ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆనంద్ కోరినట్టు అన్ని చేద్దాం. అనంత పద్మనాభ ఆలయాన్ని డెవలప్ చేద్దాం. అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం. ఒక ప్రాజెక్టు కూడా రెడీ చేశారు టూరిజం డిపార్ట్‌మెంట్ వారు.
కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. చాలా బాధలు పడ్డాం. మళ్ల పొరపాటు జరిగతే పదేండ్ల నుంచి మేం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతది. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అందర్నీ కడుపులో పెట్టుకుని పోతున్నాం. అందర్నీ సమానంగా చూస్తూ అన్ని పండుగలను గౌరవిస్తున్నాం. ఉన్నంతలో అందరికి కానుకలు ఇస్తున్నాం. ఇదంతా మీ కండ్ల ముందర జరగుతుంది. ఉత్తమమైన సమాజాన్ని నిర్మించుకున్నాం.
మెతుకు ఆనంద్ ఇక్కడే ధరూర్ మండలంలో పుట్టిన వ్యక్తి. సామాన్య కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకుని డాక్టర్ అయిన వ్యక్తి. మీ అందరికి తెలుసు. ఆయన భార్య సబిత కూడా డాక్టరే. ఇద్దరు ఇక్కడే ఉండి ప్రజా సేవలో ఉంటారు. వాళ్లు ఎవరి తెరుగు పోరు. నిగర్వి, గర్వం లేని మనిషి. అందరిలో కలిసి ఉండి గ్రామాలు తిరిగి వీలైనంత వరకు తనకు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి. వికారాబాద్ బాగుపడతది ఆయన గెలిస్తే. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో హైదరాబాద్‌లో అదే గవర్నమెంట్ వస్తది. ఎవరి చేతిలో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటది. ధరణి ఊడగొడుతాం. రైతుబంధు తప్పు, 3 గంటల కరెంట్ ఇస్తం అనేటోళ్లు కరెక్టా..? లేదు అన్ని విధాలా మీ వెంట ఉంటాం అని చెప్పెటోళ్లు కరెక్టా..? మీరు ఆలోచించాలి.
10 హెచ్‌పీ మోటారు పెడుతామని, బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారు కాంగ్రెసోళ్లు. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టి, అందరూ ఒకటేసారి వత్తుతే ట్రాన్స్ ఫార్మలు ఉంటాయా..? పటాకులు పేలినట్లు పేలిపోతాయి. సబ్ స్టేషన్లు కూడా పేలిపోతాయి. కాంగ్రెస్ గెలిస్తే గ్యారెంటీగా మళ్ల చీకటి రాజ్యమే వస్తది. కర్ణాటక మీకు దగ్గరనే ఉంటది. అక్కడ కరెంట్ 20 గంటలు ఇస్తమని నరికారు.. కానీ ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నరు. హైదరాబాద్‌కు వచ్చి వాళ్లు ధర్నా చేస్తున్నారు. మేం కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం. మీరు కూడా మోసపోవద్దని కర్ణాటక రైతులు చెబుతున్నారు. కాబట్టి దచయేసి విద్యావంతుడు, బుద్ధిమంతుడు, నాకు దగ్గరి మనిషి ఆనంద్‌ను గెలిపించాలని కోరతున్నా.
తరతరాలుగా దోపిడీకి గురయ్యారు దళిత సమాజం. అణిచివేతకు వివక్షకు గురైన సమాజం. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంకా పేదరికం ఎందుకు ఉండేది దళితుల్లో. ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎందుకు ఉండేది. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. అమ్మను చూడు.. మాకు ఓటు గుద్దు అని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప సంక్షేమానికి పాటు పడలేదు. భారతదేశంలో ఎక్కడ.. ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ, ఏ ప్రధాని ఆలోచించని పద్ధతుల్లో మేం ఆలోచించి దళితబంధు పెట్టినం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
వికారాబాద్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. హుజురాబాద్‌లో మొత్తం ఒకేసారి పెట్టం. అక్కడ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కడుపు నిండినట్టు ఉంది. అది దళితవాడలాగా లేదు.. దొరలవాడలాగా తయారైంది. ఎవరికి వారు బిజినెస్‌లు పెట్టి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఆనంద్‌ను గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళిత బంధు పెడుతా.
ఈ దెబ్బతో దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలు అయితయ్. ఎవడో ఎల్లయ్య గెలిస్తే వచ్చేది ఏం లేదు. ఆనంద్ గెలిస్తే ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబం అయితది కాబట్టి నా మేసేజ్‌ను ప్రతి గడపకు తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిపించండి. నేనే స్వయంగా వచ్చి దళితబంధు ప్రారంభిస్తా. అన్ని కుటుంబాలకు దళితబంధు ఇచ్చి వికారాబాద్ దరిద్రాన్ని తీసి అవతల పడేద్దాం.