CM KCR | తెలంగాణ కార్మిక సంక్షేమ ప్రగతి నమూనా.. దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేస్తాం

CM KCR కష్ట జీవులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌ విధాత: తెలంగాణాలో అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ ప్రగతి నమూనాను ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మిక సంక్షేమానికి, వారి గుణాత్మక జీవన అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. కార్మికుల దినోత్సవం ‘మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతున్న […]

  • By: krs    latest    May 01, 2023 8:43 AM IST
CM KCR | తెలంగాణ కార్మిక సంక్షేమ ప్రగతి నమూనా.. దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేస్తాం

CM KCR

కష్ట జీవులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

విధాత: తెలంగాణాలో అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ ప్రగతి నమూనాను ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మిక సంక్షేమానికి, వారి గుణాత్మక జీవన అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. కార్మికుల దినోత్సవం ‘మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్క కష్టజీవికి సీఎం కేసీఆర్‌ ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు.

తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లన్నారు. కార్మిక కర్షక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు.

కార్మికులకు ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే రూ.6 లక్షలను సంబంధిత కుటుంబానికి చెల్లించడం జరుగుతున్నదని సీఎం తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఇలా మరణించిన కార్మికులకు సంబంధించిన 4001 బాధిత కుటుంబాలకు రూ. 223 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైతే రూ. 5 లక్షల చొప్పున, వైకల్యానికి గురైన 504 మంది కార్మికులకు రూ. 8.9 కోట్లను నేటివరకు చెల్లించడం జరిగిందని తెలిపారు.

కార్మిక కుటుంబంలోని ఇద్దరు మహిళా కార్మికులు, వారి ఇద్దరు పిల్లల పెండ్లికి ఒక్కరికి రూ. 30,000 ల చొప్పున ‘వివాహ బహుమతి’ని రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్నదని, 2014 నుండి 2023 వరకు 46,638 మంది లబ్దిదారులకు రూ. 130 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.

మహిళా కార్మికులకు రెండు కాన్పుల వరకు కాన్పుకు రూ. 30,000 చొప్పున ప్రసూతి ప్రయోజనాలను అందిస్తున్నామని,2014 నుండి నేటి వరకు 1,01,983 మంది లబ్దిదారులకు రూ. 280 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు.

కార్మికులు ఏకారణం చేతనైనా మరణిస్తే రూ.1 లక్ష మొత్తాన్ని కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్నారనీ, 2014 నుండి 2023 వరకు మరణించిన 35,796 మంది కార్మికులకు రూ. 288 కోట్లను చెల్లించడం జరిగిందని సిఎం తెలిపారు. కార్మికులపై ఆధారపడిన 1,49,536 మంది లబ్దిదారులకు రూ. 94 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు.

మరణానంతరం నిర్వహించే అంతిమయాత్ర కార్యక్రమాల కోసం 39,797 మందికి రూ. 98 కోట్లను నేటివరకు చెల్లించామన్నారు. కోవిడ్ 19 మహమ్మారి విజృంభించిన కాలంలో రూ. 1,005 కోట్లను పలు కార్యక్రమాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.