అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

విధాత: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా, పదేళ్లు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేసీఆర్‌ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా పనిచేసి తనదైన పాత్ర పోషించారన్నారు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నామన్నారు.


ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.. తెలంగాణ పునః నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. దీంతో అసెంబ్లీకి వచ్చిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు.


స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ వేదికగా సభలో లేని ప్రతిపక్ష నాయకుడికి శుభాకాంక్షలు చెప్పడం శుభపరిణామమని కొనియాడారు. అంతకుముందు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌ కార్యాలయం ప్రతినిధి ద్వారా ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని కేసీఆర్‌కు పంపించారు. కేసీఆర్‌ తరఫున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆ లేఖను, పుష్పగుచ్ఛాన్ని అందుకున్నారు.