ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీబీజీగా గడుపుతుంది.

  • By: Somu    latest    Jan 05, 2024 12:30 PM IST
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ
  • కేంద్ర మంత్రులతో వరుస భేటీలు


విధాత : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీబీజీగా గడుపుతుంది. రెండు రోజులుగా వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధనకు..విభజన హామీల అమలుకు..అభివృద్ధి కార్యక్రమాల మంజూరీకి వినతి పత్రాలు అందిస్తుంది. శుక్రవారం యూపీఎస్‌సీ చైర్మన్ మనోజ్ సోనీని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారిలు కలిశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్‌సీ తరహాలో వ్యవస్థీకృతం చేసే విషయమై ఆయనతో చర్చించారు.


అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరీ చేయాలని కోరారు. అనంతరం వారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపు వంటి వాటిపై కీలక చర్చలు జరిపారు. ముందురోజు గురువారం రేవంత్‌, ఉత్తమ్‌ల బృందం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుతం జాతీయ హోదా విధానం లేదని, ప్రాజెక్టు నిర్మాణంలో 60శాతం నిధులు అందించే ప్రయత్నం చేస్తామని షెకావత్ వారికి హామీ ఇచ్చారు.


హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీయైన రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌లు రాష్ట్రానికి పెరిగిన జిల్లాలను అనుసరించి ప్రస్తుతమున్న 79 మంది ఐపీఎస్ అధికారులకు తోడు మరో 29 మందిని కేటాయించాలని కోరారు. 2024 బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనపు అధికారులను కేటాయిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్ సంస్థల విభజన పూర్తి చేయాలని, పదవ షెడ్యూల్లోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర రాజ్‌భవన్ విభజన పూర్తి చేయాలని, తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు కేటాయించాలని కోరారు.