ప్రజల కోసమే మెట్టు దిగాం
గత ప్రభుత్వం తరహాలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అందుకే ఒక మెట్టు దిగి.. కేంద్రాన్ని ఒప్పించి, ప్రాజెక్టును సాధించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు

- కేంద్రాన్ని ఒప్పించి ఎలివేటెడ్ కారిడార్ సాధించాం
- కేంద్రంతో గత ప్రభుత్వ ఘర్షణ వల్లే జాప్యం
- కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించాం
- పదేళ్ల బీఆరెస్ విధానాలతో ప్రజలకు శిక్ష
- అల్వాల్ టిమ్స్ సమీపంలో భూమి పూజ
- 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల వెడల్పు
- ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు
- ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం
‘మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు? ట్విట్టర్లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు. ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి.. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు’ ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : గత ప్రభుత్వం తరహాలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అందుకే ఒక మెట్టు దిగి.. కేంద్రాన్ని ఒప్పించి, ప్రాజెక్టును సాధించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందని తెలిపారు. కేంద్ర, గత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి, గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు.
ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి.. ఈ ప్రాజెక్టు అవసరాన్ని వివరించి, సాధించామని చెప్పారు. భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారంలోకి రాగానే తక్షణమే అధికారులతో సమీక్షించి, రక్షణ శాఖకు భూములు అప్పగించామని వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు, హైదరాబాద్- రామగుండం రాజీవ్ రహదారిపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో గురువారం భూమి పూజ చేశారు. 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల వెడల్పుతో దీన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
పదేళ్ల బీఆరెస్ విధానాలతో ప్రజలకు శిక్ష
అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని, కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆరెస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలన్నారు. ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమని అభివర్ణించారు.
పదేళ్లలో శాశ్వత అభివృద్ధి ఏమైనా ఉందా?
పదేళ్ల బీఆరెస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే అని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆరెస్ పాలనలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏమీ రాలేదని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని, ఎన్నికలు ముగిశాక అభివృద్ధి తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఎలివేటెడ్ క్యారిడార్ తమ పోరాటానికి ప్రతిఫలమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు? ట్విట్టర్లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు.
ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి.. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.
ఎలివేటెడ్ కారిడార్‌లోని ముఖ్యాంశాలు..
కారిడార్ మార్గం: ప్యారడైజ్ జంక్షన్-వెస్ట్ మారేడ్‌పల్లి- కార్ఖానా- తిరుమలగిరి-బొల్లారం- అల్వాల్- హకీంపేట్- తూంకుంట- ఓఆర్ ఆర్ జంక్షన్ (శామీర్‌పేట్)
మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ.
ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.
అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
పియర్స్: 287
అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు
ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు
ప్రాజెక్టుతో ప్రయోజనాలు:
రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలకు చెల్లు
కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం ఇంధనం మిగులుతో వాహననదారులకు తగ్గనున్న వ్యయం నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వరకు చేరుకునే అవకాశం.