దమ్ముంటే ఒక్కటి గెలిపించు

సొల్లు వాగుడు వాగటం కాదని, దమ్ముంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీట్లోనైనా బీఆరెస్‌ను గెలిపించాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు

దమ్ముంటే ఒక్కటి గెలిపించు
  • లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపించు
  • కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌
  • హామీలు అమలు ఓర్వ­లేకే విమ­ర్శలు
  • త్వరలో మరిన్ని ఉద్యోగ నియా­మ­కాలు
  • సోని­యమ్మ హామీ­లన్నీ అమలు చేస్తాం
  • ప్రభుత్వం కూలు­తుం­ద­న్నో­డిని తన్నాలి
  • నీలా నాది అయ్య ఇచ్చిన కుర్చీ కాదు
  • ప్రజా దీవెన ఉన్నంత వరకూ కుర్చీ తాక­లేరు
  • పదేళ్లు అడవి పందుల్లా రాష్ట్రాన్ని మెక్కారు
  • తెలం­గా­ణలో గుజ­రాత్ మోడల్ నడ­వదు
  • చేవెళ్ల కాంగ్రెస్ సభలో రేవం­త్‌­రెడ్డి వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్‌: సొల్లు వాగుడు వాగటం కాదని, దమ్ముంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీట్లోనైనా బీఆరెస్‌ను గెలిపించాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. ‘హామీలు అమలు చేయడం లేదని, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాకపోతుండెనని సొల్లు వాగుడు వాగుతున్న కేటీఆర్‌కు చేవెళ్ల వేదిక నుంచి సవాల్ విసురుతున్నా.. ఇవ్వాళ నేనే సీఎంను, పీసీసీ చీఫ్‌ను. నీకు చేతనైతే, దమ్ముంటే.. నువ్వు మొగోడివైతే తెలంగాణ రాష్ట్రంలో బిడ్డా.. ఒక్క సీటు గెలిచి చూపించు.. నీవు వస్తావా.. నీ అయ్యా వస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. బీఆరెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘అల్లాటప్పగాడిననుకుంటున్నావా? నీలా అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూర్చోలేదు. కింద నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, నీ అక్రమ కేసులు ఎదుర్కొని, చర్లపల్లి, చంచల్‌గౌడ్ జైలులో మగ్గి, భయపడకుడా, లొంగిపోకుడా నిటారుగా నిలబడి.. నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందపెట్టి ఈ కుర్చీలో కూర్చున్నా.


ఈ కుర్చీ ఇనామ్‌తో వచ్చింది కాదు.. అయ్య పేరు చెప్పుకుంటే వచ్చింది కాదు. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ నీలాంటోడి నెత్తిమీద కాలుపెట్టి తొక్కితే ఈ కుర్చీలో మా కార్యకర్తలు నన్ను కూర్చోబెట్టారు. ఈ కుర్చీలో ఉన్నానంటే మా కార్యకర్తల పోరాటం, త్యాగం, కార్యకర్తల అండ. వారు నన్ను భూజాల మీద మోసినంతకాలం, ప్రజల దీవెన ఉన్నంతకాలం.. నీవు, నీ అయ్య మీ దేవుడొచ్చినా ఈ కుర్చీని తాకలేరు’ అంటూ నిప్పులు చెరిగారు.


ఉద్యోగాలిచ్చే హామీలు నెరవేరుస్తాం


ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, తాము ప్రమాణ స్వీకారం చేసిన ఎల్‌బీ స్టేడియంలోనే ఇప్పటిదాకా 25 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలిచ్చామని రేవంత్‌రెడ్డి అన్నారు. అది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజామాబాద్‌లో కవితను ప్రజలు బండకేసి కొడితే ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేశావు.


కరీంనగర్‌లో ఓడిన మీ చుట్టం వినోద్‌కుమార్‌ను ప్లానింగ్‌ కమిషన్ చైర్మన్ చేశావు. కోచింగ్‌ల కోసం వ్యయప్రయాసలతో తిప్పలుపడిన నిరుద్యోగుల గురించి ఏనాడైనా కేసీఆర్ ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ పేద బిడ్డలు పేపర్ల లీకేజీలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ల గూర్చి ఆలోచించలేని మానవ రూపంలో ఉన్న మృగానివా? అని ఘాటుగా నిలదీశారు. తాము తమ ఇందిరమ్మ రాజ్యం రాగానే 25 వేల ఉద్యోగాలిచ్చామని, మార్చి 2న 7వేల ఉద్యోగాలిస్తామని, ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు.


త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. నీ పాలనలో పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠాణీల్లా అమ్ముతుంటే ఒక్కడినీ బొక్క లేయలేదంటూ కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాము మాత్రం అలాంటివాళ్లను బొక్కలో వేస్తామని స్పష్టం చేశారు. పారదర్శక నియామకాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఫ్రక్షాళన చేశామన్నారు.


ప్రభుత్వం పడిపోతుందనేవాల్లను పట్టుకుని తన్నాలి


తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకోకపోగా.. పొద్దున లేస్తే ఎప్పుడు ఈ ప్రభుత్వం పడిపోతుందా? ఎప్పుడు కుర్చీలో కూర్చుందామా? అని బీఆరెస్‌ నేతలు ఎదురు చూస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతదని సోల్లు వాగుతున్నారన్నారు. అలాంటివారు గ్రామాల్లోకి వస్తే.. తమ కార్యకర్తలు పట్టుకుని వేప చెట్టుకు కట్టేసి.. లాగుల్ల తొండలిడిచి కొడుతారని హెచ్చరించారు.


అడవి పందుల్లాగా తెలంగాణను మెక్కారు


సోషల్ మీడియా ఉంటే గెలిచేవాళ్లమని కేటీఆర్‌ అంటున్నారన్న రేవంత్‌రెడ్డి.. ఉన్న టీవీలు, పేపర్లలన్నీ మీ సుట్టపోళ్లయే కదా! మా అయ్య మాకేమైనా టీవీలు, పేపర్లు ఇచ్చిండా? సొల్లు వాగడానికి మైక్‌లు ఇచ్చిండా? సాయంత్రం సేద తీరడానికి జూబ్లీహిల్స్ సినిమా వాళ్ల గెస్ట్‌హౌజ్‌లు ఇచ్చిండా? అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు కష్టపడి కొట్లాడితే తమకు అధికారం వచ్చిందన్నారు. తమకు ఏ ట్యూబ్‌లూ అక్కరలేదని, నీ ట్యూబ్ లైట్‌లు పడగొట్టే బాధ్యత తీసుకుంటామని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


అధికారం పోయినా కేటీఆర్‌కు ఇప్పటికీ సిగ్గురాలేదన్నారు. వాళ్ల కుటుంబం దోచుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పులు తీసుకుని కొట్టిండ్రని ఇంకా వారికి అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. పదేళ్లు తెలంగాణను చెరుకు తోటను, పల్లి చేనులను అడవి పందులులాగా తెగ మేసినట్లు మెక్కుతుంటుంటే, పంట కాపాడుకునేందుకు కరెంటు తీగలకు పందులను బలిచ్చినట్లుగా తెలంగాణ ప్రజలు బీఆరెస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు.

సోనియమ్మ మాటే మాకు శిలాసనం..


తమకు సోనియమ్మ మాట శిలాశాసనమని, ఆమె ఇచ్చిన మాటను తమ ఊపిరి పోసైనా, రక్తం ధారపోసైనా అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండింటిని డిసెంబర్ 9న అమలు చేశామని, పేద ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే ఇచ్చే గ్యారంటీని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పారు. చేవెళ్లలో ప్రియాంక గాంధీ ద్వారా ప్రారంభించాలనుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయంలో ప్రారంభించామని తెలిపారు.


అదే విధంగా 200 యూనిట్ల గృహజ్యోతి ఉచిత కరెంటు గ్యారంటీని అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పథకాలను ఆడబిడ్డలు గ్రామాల్లో ఇంటింటికీ చెప్పాలని కోరారు. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంకు 40లక్షల మంది అర్హులుగా ఉన్నారని, ఇంకా ఎవరైనా ఉంటే మండల కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.


ప్రతి గ్రామానికి ఇందిరమ్మ కమిటీలు వేయాలని, పథకాల లబ్ధిదారులను వారి ద్వారానే ఎంపిక చేస్తామని తెలిపారు. బీఆరెస్ చేసిన అప్పులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా.. పేదల పథకాలైన గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇందుకు మంత్రులు భట్టి విక్రమార్కకు, ఉత్తమ్‌రెడ్డికి చప్పట్లు కొట్టాలన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారిని మహాలక్ష్ములను చేస్తామన్నారు.


త్వరలోనే జిల్లాల పర్యటనలు


తాను పార్టీ కార్యకర్తల్లో ఒకడినని, రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నానని, అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. పాలన ఒత్తిడిలో కలవకపోతే బాధపడవద్దని, త్వరలోనే జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తానని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీకి 17మందిని తోలుతామని, ఇప్పుడే బీఆరెస్ వాళ్లకు ఒక్క సీటు రానివ్వనని సవాల్ విసిరానని చెప్పిన రేవంత్‌.. అసలైన బాధ్యత ఎంపీ ఎన్నికల్లో గెలుపుతో తీరదని, స్థానిక సంస్థలలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ నాయకులం అనిపించుకుంటామన్నారు. ఎవరైతే కష్టపడ్డారో, జెండా మోశారో వారిని స్థానిక సంస్థల్లో గెలిపించే బాధ్యత తమదేనని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు.


గుజరాత్ మోడల్ సాగదు


గుజరాత్ మోడల్ అని పదేపదే బీజెపీ వాళ్లు అంటున్నారన్న రేవంత్‌రెడ్డి.. గుజరాత్‌ మోడల్‌ అంటే ఉర్లలో ఉన్నోళ్లని తగులబెట్టుడా? లేక పెట్టుబడిదారులను బెదిరించి, వారి రాష్ట్రానికే తీసుకెళ్లడమా? ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వకపోవడమా? రైతులకు రెట్టింపు ధర ఇస్తామని, అడిగితే కాల్చి చంపడమా? అని ప్రశ్నించారు. అడిగేవాళ్లు లేరని రుబాబ్‌తో దబాయించి బతకాలని బీజేపీ వాళ్లు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పదేళ్ల నుంచి దేశానికి ప్రధాని మోదీనే ఉన్నారని, ఇప్పటిదాకా 20కోట్లు ఉద్యోగాలివ్వాల్సి ఉండేనని మరి ఎందుకివ్వలేదన్నారు. రైతులకు మద్ధతు ధర ఇచ్చి కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు. ప్రాణహిత చేవెళ్లలో శిలాఫలకం వేస్తే కేసీఆర్ పడావు పెట్టించారని, ఈ కేడీ కేసీఆర్‌, మోదీ ఇంతకాలం అలయ్ బలయ్ చేసుకున్నారని, ఇవాళ ఒకరంటే ఒకరు పడదని నాటకాలు వేస్తున్నారన్నారు. వారిద్దరి మధ్య పొత్తు లేకపోతే కేటీఆర్‌ను సీఎం చేయాలని మోదీని ఎందుకడిగారని ప్రశ్నించారు.


చీకట్లో కలిసి, పొద్దునపూట కొట్లాడే నాటకాలు వేస్తున్నారన్నారు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చీల్చడం.. ప్రభుత్వాలను పడగొడ్టడం.. పడనోళ్లను జైళ్లలో పెట్టడం.. ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీ, సీబీఐలను పంపించడమేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద మనిషి అయిపోయారని, ఆయనకు ఓటేసినా.. బీఆరెస్‌కు ఓటేసినా ప్రయోజనం ఉండదన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఈ ప్రాంంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని చెప్పారు. నియోజకవర్గ వాసులకు పట్నం సునీతా మహేందర్‌రెడ్డి అండగా ఉంటారన్నారు. అభయ హస్తం..ఆరు గ్యారంటీలను ఇంటింటికి ప్రచారం చేసి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మీరంతా సిద్ధమేనా.. సిద్ధమేనా? అంటూ సభికులను, కార్యకర్తలను ఏపీ సీఎం వైఎస్‌ జగన్ తరహాలో ప్రశ్నించారు. దీనికి సిద్ధమేనంటూ వారంతా చేతులు పైకెత్తి నినాదాలు చేశారు.