టార్గెట్ 14.. మూడంచెలుగా సమన్వయ కమిటీలు
రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో అనుసరించిన విధానాన్ని రాష్ట్ర మంతటా అమలు చేయాలని భావించింది

- బూత్ కమిటీలో అయిదుగురు కీలక సభ్యులు
- పనితీరు ఆధారంగా పార్టీలో గుర్తింపు
- బూత్ కమిటీ సభ్యలుకు ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యత
- లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
- రాష్ట్ర మంతా మల్కాజిగిరి ఎన్నికల మోడల్
- అందుబాటులో ఉన్న నేతలతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ
విధాత: రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో అనుసరించిన విధానాన్ని రాష్ట్ర మంతటా అమలు చేయాలని భావించింది. ఈ మేరకు మూడంచెలుగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని, కార్యకర్తలకు వెన్నంటి ఉండాలని సీఎం సూచించారు.
గతంలో తమకు విజయం తెచ్చిపెట్టిన మల్కాజ్ గిరి ఎన్నికల మోడల్ ను రాష్ట్రమంతటా అనుసరించాలని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అందులో భాగంగా ఒకటీ రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లోనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమిస్తారు.
పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇంచార్జీతో పాటు ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉంటారు. బూత్ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు అయిదుగురికి అవకాశం కల్పిస్తారు. బూత్ కమిటీలో ఉండే అయిదుగురే ఈ సారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడుతారని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
పార్టీ అభ్యర్థికి ఆ బూత్ లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పని తీరుకు ప్రాతిపదికగా ఉంటుందని అన్నారు. బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పనితీరును బట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు.