కంచెర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నతెలంగాణ ప్రజలు
తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

- కేసీఆర్ను తెలంగాణ సమాజం బహిష్కరించింది
- ప్రజలు బండకేసి కొట్టారు
- కేసీఆర్ పని అయిపోయింది.. ఖేల్ ఖతం దుకాణం బంద్
- తెలంగాణకు గుదిబండగా కేసీఆర్ సంతకం
- కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్
- కానిస్టేబుల్స్ నియామక పత్రాలు అందించే సభలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత: తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం నిన్ను బహిష్కరించిందని ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా కేసీఆర్ అని అడిగారు. తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని ఇప్పటికైనా తెలుసుకోండన్నారు. మంగళవారం నల్లగొండ వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతూ…పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని అనడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పంధించారు. ఏ రేసుకు వెళ్లినా గుర్రాలదే గెలుపు అని అన్నారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు.
నన్ను చంపుతారా అని కేసీఆర్ అంటుండు… చచ్చిన పామును ఎవరైనా చంపుతారా.. అని అన్నారు. కేసీఆర్ నీ పని అయిపోయింది.. ఖేల్ ఖతం దుఖాన్ బంద్.. అని అన్నారు
రేవంతన్నగా నిరుద్యోగులకు అండగా ఉంటా..
నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రయత్నం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలని తెలిపారు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామక పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. 13,444 మంది ఉద్యోగులకు ఇవాళ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. ఈ వేదికగా చెబుతున్నా.. మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు నేను అండగా ఉంటా… నని ప్రకటించారు. ఈ ప్రభుత్వం మీది.. ఇది పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అని అన్నారు.
చిక్కుముడులిప్పి నియామకాలు పూర్తి చేస్తాం
నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేసామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. మాట ఇచ్చినట్టుగానే 15 రోజుల్లో కానిస్టేబుల్స్ కు నియామకపత్రాలు అందిస్తున్నామన్నారు. కేసీఆర్ తన బంధువులకు, కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగలేకపోయారన్నారు. కానీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి ఆలోచించలేదన్నారు.
ఎవరికీ నష్టం లేకుండా 2 లక్షల ఉద్యోగాల భర్తీ
ఏ తప్పు లేకుండా.. ఎవరికి నష్టం జరగకుండా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పదేళ్లు నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని వయసు 44 నుంచి 46 ఏళ్లకు పెంచామన్నారు. మీ ఆశీర్వాదం ఉంటే పదేళ్లు కాదు 20ఏళ్లు ప్రజా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్.. అని అన్నారు.
గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మనకు రావాల్సిన నీటిని రాకుండా చేశారన్నారు.
మరణ శాసనం రాసిన కేసీఆర్
కేసీఆర్ సంతకం తెలంగాణ రైతులకు గుదిబండగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క సంతకంతో కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారన్నారు. అది మేడిగడ్డ కాదు.. మేడిపండు అని వ్యాఖ్యానించారు. పొట్ట విప్పితే పురుగులు బయటపడతాయనే నల్లగొండలో సభ పెట్టారన్నారు. తెలంగాణను కబలించడానికి గంజాయి , డ్రగ్స్ ముఠాలు తిరుగుతున్నాయన్నారు. గంజాయి ముఠాను కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాష్ట్రంలో ఉండకూడదన్నారు.