Telangana | న‌లుగురు ఐఏఎస్‌ల‌పై ఈడీ, సీబీఐకి ఫిర్యాదు

మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ అక్రమాస్తులపై విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐ, ఈడీలకు శ్రీకాంత్ నేత అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు

Telangana | న‌లుగురు ఐఏఎస్‌ల‌పై ఈడీ, సీబీఐకి ఫిర్యాదు
  • జాబితాలో సోమేశ్‌, ర‌జ‌త్‌కుమార్‌,
  • అర‌వింద్‌కుమార్‌, న‌వీన్ మిట్ట‌ల్‌
  • అధికారం అండ‌తో అక్ర‌మాస్తులు
  • హర్యానా, ఢిల్లీ, నోయిడాలోనూ
  • బినామీల పేర్ల‌పై అక్ర‌మాస్తులు
  • వారి అక్ర‌మాల‌పై సిట్ వేయాలి
  • శ్రీ‌కాంత్ నేత అనే వ్య‌క్తి ఫిర్యాదు


Telangana | విధాత, హైదరాబాద్ : మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ అక్రమాస్తులపై విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐ, ఈడీలకు శ్రీకాంత్ నేత అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సోమేశ్‌కుమార్‌తో పాటు ఇరిగేషన్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ అక్రమాస్తులపైనా విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నలుగురు ఐఏఎస్‌ల అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేష‌న్‌ టీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.


అధికారాన్ని అడ్డం పెట్టుకుని సోమేశ్‌ కుమార్ భారీగా ఆక్రమాస్తులు సంపాదించారని, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఆయ‌న‌ ఆస్తులపై విచారణ చేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. సోమేశ్ తన పదవీ కాలంలో ప్రభుత్వ పెద్దల‌ను సంతృప్తి పరుస్తూ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, దీంతో పాటుగా అక్రమాస్తులను క్విడ్ ప్రో కో ప‌ద్ధ‌తిలో కూడబెట్టుకున్నారని ఆరోపించారు.


ధరణి పోర్ట‌ల్ త‌యారీలో కీల‌క పాత్ర పోషించిన సోమేశ్‌కుమార్‌ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భార్య, బంధువుల పేర్ల‌తో కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేశారని ఫిర్యాదులో వివరించారు. సోమేశ్‌కుమార్ యాచారం మండలం కొత్తపల్లిలో తన భార్య పేరిట 25ఎకరాల 19గుంటల భూములను కొనుగోలు చేయడంతో పాటు సాగుచేయని ఆ భూములకు 14 లక్షలకు పైగా రైతుబంధు తీసుకున్నార‌ని తెలిపారు. భూముల కొనుగోలు విష‌యంలో డీవోపీటీకి కూడా ఆయ‌న స‌మాచారం ఇవ్వ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజా ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై ఈడీ, సీబీఐలు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.


సోమేశ్‌కుమార్‌ను రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కేడర్‌కు కేటాయించగా, ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణలో అక్రమంగా కొనసాగారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమేశ్‌తో పాటు సదరు ముగ్గురు ఐఏఎస్‌లు ఢిల్లీ పక్కన ఉన్న గురుగ్రాం సిటీతో పాటు హర్యానా, న్యూఢిల్లీ, నోయిడాలో కూడా తమ బినామీల పేర్ల మీద పెద్ద ఎత్తున మ‌ల్టిపుల్‌ కమర్షియల్ కాంప్లెక్సులు కొనుగోలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. సోమేశ్‌కుమార్ పదవీ విరమణ చేసినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద అతడిని విచారించాలని డిమాండ్ చేశారు.