నాలుగు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం..కాంగ్రెస్‌, బీజేపీకి పెను స‌వాళ్లు

నాలుగు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం..కాంగ్రెస్‌, బీజేపీకి పెను స‌వాళ్లు
  • ఆ రాష్ట్రాల్లో 93 లోక్‌స‌భ సీట్లు
  • లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో అవి కీల‌కం
  • ఇవి గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ సేఫ్‌
  • ఇండియా కూట‌మిపైనా ప‌ట్టు!

విధాత : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీలకు సవాల్‌గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో జెండా ఎగురవేయాలనే కృత నిశ్చయంతో ఉన్నది. దీనికి కారణం రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండగా, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో ఉంటుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిస్తే బీజేపీని, ఆ పార్టీ బీ టీమ్‌ పార్టీలను నైతికంగా దెబ్బతీయవచ్చు అనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 93 (మధ్యప్రదేశ్‌ 39, రాజస్థాన్‌ 26, తెలంగాణ17, ఛత్తీస్‌గఢ్‌11) లోక్‌సభ స్థానాలున్నాయి. దాదాపు వంద స్థానాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీతో పాటు ఆ పార్టీ బీ టీమ్‌లకు ఇప్పుడే చెక్‌ పెడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని, రెట్టించి పనిచేస్తారన్నది ఆ పార్టీ పెద్దలు ఆలోచన.

ఇండియా కూట‌మిపై ఆధిప‌త్యానికీ అవ‌స‌ర‌మే

ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలను లోక్‌సభ ఎన్నికలకు ముందే దారికి తెచ్చుకోవాలని నుకుంటున్నది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మినహా ఆ పార్టీ కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఇప్పటికే అధికారంలో ఉన్నది. జార్ఖండ్‌, బీహార్‌, తమిళనాడులో కాంగ్రెస్‌ మిత్రపక్షాల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నది. వీళ్లు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉన్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌ కూటమితోనే కొనసాగుతారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్‌ లాంటి పార్టీలు కూడా చీటికిమాటికి కాంగ్రెస్‌ పార్టీపై చేసే విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎంపిక కావడం, ఆయనను ఎన్నికలకు ముందు తెరమీదికి తేవడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత వ్యూహం ఉన్నది. పార్టీ సిద్ధాంతాలు, నియమావళి విషయంలో రాజీ లేదని నేతలతో ఆయన కరాఖండిగా చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు వాటతంటే అవే వస్తాయి త‌ప్ప‌.. అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తేనో, ప్రభుత్వాన్ని కూలుస్తామనే బెదిరింపులకు పార్టీ లొంగదని స్పష్టమైన సంకేతాలు పంపారు. దాని ఫలితంగానే రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌, తెలంగాణలో రేవంత్‌కు వ్యతిరేకంగా నిరసన గళం విప్పిన సీనియర్లు సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు.

ప్రియాంక తెర‌పైకి

కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీలో రాహుల్‌గాంధీకి ప్రాధాన్యం ఇస్తూనే ప్రచార కమిటీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించింది. మోడీ వర్సెస్‌ రాహుల్‌పై ప్రజల్లో అబద్ధాలు ప్రచారం బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ఎన్నికల సమయంలో ప్రియాంక, రాహుల్‌లతో పాటు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ద్వారానే బీజేపీ జాతీయ నాయకుల విమర్శలు, వ్యాఖ్యలను తిప్పికొడుతున్నది. కర్ణాటకలో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అలాగే బీజేపీ చేసే కుటుంబ పార్టీ అనే వాదనను ఖర్గే నిపార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయడం ద్వారా తిప్పికొట్టింది. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మధ్యలో కొంతకాలం దూరమైనా ఆయావర్గాలను తనవైపు మళ్లించుకోగలిగింది. ఖర్గే వచ్చాక పార్టీలో నేతల మధ్య విభేదాలు చాలా వరకు సమసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో మఖ్యమంత్రి ఎవరు అన్న అంశాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగించి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఏడాదిలోనే ఆ పార్టీలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నెగ్గితే సార్వత్రిక ఎన్నికల్లో కషాయపార్టీకి కష్టాలు మొదలైనట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీదీ అదే ప‌రిస్థితి

గ‌తంలో ఏక‌ప‌క్ష విజ‌యాలు సాధించుకుంటూ వ‌చ్చిన బీజేపీ.. కొన్నేళ్లుగా క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కొంటున్న‌ది. దీనికితోడు విప‌క్షాలు అన్నీ క‌లిసి.. ఇండియా కూట‌మిగా ఏర్ప‌డి.. స‌వాలు విసురుతున్నాయి. కూట‌మిని నిలువ‌రించాలంటే.. క‌చ్చితంగా ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌కుండా అడ్డుప‌డాలి. లేనిప‌క్షంలో కాంగ్రెస్ వ్యూహం ఫ‌లించి.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తారుమార‌య్యే అవ‌కాశం ఉన్న‌ది.