Congress | నాడు ప్రత్యర్థులు-నేడు ఒకే పార్టీ గూటి పక్షులు! సంచలనం రేపిన రేవంత్, గుర్నాథ్‌రెడ్డి కలయిక
Congress ఆదివారం కాంగ్రెస్‌లో చేరనున్న గుర్నాథ్‌రెడ్డి! విధాత : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి- బీఆర్ ఎస్ నేత రావులపల్లి గుర్నాథ్‌రెడ్డి తాజా కలయిక దీన్ని మరోసారి రుజువు చేసింది. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి గుర్నాథ్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. అదే స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి బరిలోకి దిగారు. కొడంగల్ మండలం హస్నాబాద్ […]

Congress
- ఆదివారం కాంగ్రెస్‌లో చేరనున్న గుర్నాథ్‌రెడ్డి!
విధాత : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి- బీఆర్ ఎస్ నేత రావులపల్లి గుర్నాథ్‌రెడ్డి తాజా కలయిక దీన్ని మరోసారి రుజువు చేసింది. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి గుర్నాథ్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. అదే స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి బరిలోకి దిగారు.
కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త కాల్పుల వరకు వెళ్లింది. గుర్నాథ్‌రెడ్డి అనుచరులు రేవంత్‌రెడ్డిపై కాల్పులు జరపడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిలో రేవంత్‌రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయని కేసులు కూడా పెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డికి ఓటు వేయవద్దని కాంగ్రెస్ అభ్యర్థి, అతని అనుచరులు స్థానిక ఓటర్లను బెదిరించి, పట్టించుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డిపై కాల్పులు జరిపారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
గుర్నాథ్‌రెడ్డి నుంచి రేవంత్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు భద్రత పెంచాలని డీజీపీని కోరారు. గుర్నాథ్‌రెడ్డి, ఆయన అనుచరులు లైసెన్స్ లేని ఆయుధాలను ఉపయోగించి ఓటర్లను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటినుంచి నిన్నమొన్నటి వరకూ రేవంత్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో రాజకీయ వైరం నెలకొంది.
2018లో ఈ స్థానం నుంచి రేవంత్‌రెడ్డిపై బీఆర్ ఎస్ తరఫున పట్నం నరేందర్‌రెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోవడం మొదలైంది.
గుర్నాథ్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్
రాజకీయ వైరంతో ఢీ అంటే ఢీ అనుకుంటూ ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఉన్న గుర్నాథ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదిరింది. హైదరాబాద్‌లోని గుర్నాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, ఆయన్ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టిన గుర్నాథ్‌రెడ్డి అందుకు అంగీకరించారు.
ఆదివారంనాడు గాంధీభవన్‌లో గుర్నాథ్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. గత కొంతకాలంగా బీఆర్ ఎస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న గుర్నాథ్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిన్నటివరకు రాజకీయంగా కత్తులు దూసుకున్న రేవంత్-గుర్నాథ్‌రెడ్డిలు నేడు కాంగ్రెస్ గూటిపక్షులుగా మారిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కొడంగల్‌పై గుర్నాథ్‌రెడ్డి పట్టు
ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం సాగిందనే చెప్పాలి. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఈ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. టీఆర్ ఎస్ పోటీలో నిలబడటంతో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికలలో 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, తెలుగుదేశం రెండు సార్లు విజయం సాధించింది.
2018లో ఈ స్థానం టిఆర్ ఎస్ వశమైంది. ఈ నియోజకవర్గం నుంచి గురునాథ్ రెడ్డి ఐదోసార్లు విజయం సాధించాడు. మొదటిసారి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలవగా ఆ తరువాత 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు.
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు ఆర్.గురునాథ్ రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ అయిన రేవంత్ రెడ్డి పోటీచేశాడు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, గురునాథరెడ్డిపై 6989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో గుర్నాథ్‌రెడ్డి గెలిచివుంటే హ్యాట్రిక్ విజయం సొంతమయ్యేది.
మహబూబ్ నగర్ జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలలో రావులపల్లి గురునాథ్ రెడ్డి ఒకరు. ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. మధ్యలో తెలుగుదేశం పార్టీ గెలిచినా గుర్నాథ్‌రెడ్డి నియోజకవర్గంలో పట్టు కోల్పోలేదు. గుర్నాథ్‌రెడ్డి కుమారుడు ముద్దయ్య దేశ్‌ముఖ్ కొడంగల్ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక, గుర్నాథ్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్ లోకి జంప్ అయ్యారు.
కొండంగల్ సీటు ఆఫర్ చేసిన రేవంత్?
గుర్నాథ్‌రెడ్డికి బాగా పట్టున్న కొడంగల్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్‌ను ఈసారి ఆయనకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రేవంత్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారని సమాచారం. గుర్నాథ్‌రెడ్డి-రేవంత్‌రెడ్డి భేటీలో ఈ విషయంపైనే స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కొత్తగా రెండు నియోజకవర్గాలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని… ఈ రెండింటిలో ఒక దగ్గర నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి స్వస్థలం ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లె గ్రామం. ఇది అచ్చంపేట నియోజకవర్గంలోకి వస్తుంది. అయితే, ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు.
2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి విజయం సాధించి ఇక్కడ బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే, కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టడం, అన్ని శక్తులూ ప్రదర్శించడంతో 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డిపైన రేవంత్ రెడ్డి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. టిపిసిసి అధ్యక్షుడు అయిన తరువాత కొడంగల్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని బరిలోకి దింపి బీఆర్ ఎస్ విజయావకాశాలను దెబ్బకొట్టాలని ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు.