మార్చి 17 లోపు రుణమాఫీ, మహిళలకు 2500 ఇవ్వాలి: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 17లోపు మహిళలకు గృహ లక్ష్మి పథకం అమలు చేసి రూ.2500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని

– రేవంత్ కు సీఎం కుర్చీ.. కేసీఆర్ పెట్టిన భిక్ష
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 17లోపు మహిళలకు గృహ లక్ష్మి పథకం అమలు చేసి రూ.2500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ వైస్రాయి గార్డెన్స్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ లో దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయాం.. పద్మమ్మ ఉండగా ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్లుందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. అంతా మన మంచికే జరిగింది… భయపడకుండా ముందుకుసాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు అన్నీ ఆలోచన చేస్తున్నారని, పాలు ఏందో.. నీళ్లు ఏందో తెలిసిపోయిందని అన్నారు.
‘కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోయింది. కర్ణాటకలో ఏఒక్క హామీ నెరవేర్చలేదు. తెలంగాణలో సైతం అదేవిధంగా అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం రైతుబంధు వేయలేదు. రుణమాఫీ చేయలేదు. వ్యవసాయానికి విద్యుత్తు సరిగా అందడం లేదు’ అని హరీష్ రావు ఆరోపించారు. కరెంట్ 14 గంటల కంటే ఎక్కువ ఇస్తలేరు.. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలుతున్నాయని ఆరోపించారు. రేవంత్ మాటలు సీఎం కుర్చీ హుందాతనాన్ని పోగొడుతున్నాయని విమర్శించారు. డిసెంబర్ 9 న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు వస్తే ఓట్లు వేస్తారా? రైతు బంధు వేస్తామంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండ్రు. పింఛన్ రూ.4 వేలు ఇస్తామన్నారు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. హామీల మీద అడిగితే దాడి చేస్తున్నారని, పాలన చేతకాక ప్రతిపక్షాల మీద కోపానికి వస్తున్నారంటూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెడితే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. మంచి నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగం అన్న దమ్మున్న లీడర్ మన కేసీఆర్ అని అన్నారు. మనం సన్న బియ్యం ఇవ్వాలనుకుంటే.. కాంగ్రెసోళ్లు ఉన్న బియ్యం ఇవ్వరని విమర్శించారు. లంకె బిందెలు లేవు అని పార్లమెంట్ ఎన్నికలు కాగానే చేతులు ఎత్తేస్తారు.. సెక్రటేరియట్‌లో ఫైళ్లు, కంప్యూటర్‌లు ఉంటాయి.. కానీ లంకె బిందెలు ఉండవని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కర్రు కాల్చి వాత పెడతారంటూ హెచ్చరించారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.
భవిష్యత్ బీఆరెస్ దే…
ఎంపీ ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థికి మెజార్టీ తేవాలని కార్యకర్తలను హరీశ్‌రావు కోరారు. చార్ సౌ బీస్ హామీలను ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాక ప్రభుత్వం మెడలు వంచుతామని.. అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడుతాం అన్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చాకే రేవంత్ సీఎం అయ్యారు.. రేవంత్ కు సీఎం కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్య రెడ్డి, పుట్టి విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మామిళ్ళ ఆంజనేయులు, పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.