11 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే లోక్‌సభ ఎన్నికలపైకి మళ్లింది

- బీఆరెస్‌కు 4, బీజేపీ, ఎంఐఎంలకు చెరొకటి
- అసెంబ్లీ ఫలితాలు చెపుతున్న లెక్కలివే..
- బీజేపీ విస్తరణ ఆకాంక్షలపై ముందే నీళ్లు!
విధాత, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే లోక్‌సభ ఎన్నికలపైకి మళ్లింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి.. అవి ఇమిడి ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆధిపత్యం ఎవరిదో అంచనా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కొన్ని సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.
ఇక్కడ సాధించిన ఓట్లను లోక్‌సభ నియోజకవర్గాలవారీగా లెక్కగట్టి చూస్తే.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నదని తేలుతున్నది. బీఆరెస్ 4 నియోజకవర్గాలలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎంఐఎం తనకున్న ఒక్క స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద దెబ్బనే ఎదుర్కొనే అవకాశాలు ప్రస్తుత ఓట్ల లెక్కలను బట్టి కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలను కోల్పోయి ఒక్క అదిలాబాద్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాగా లోక్‌సభలో తెలంగాణ నుంచి అత్యధికంగా 9 సీట్లు ఉన్న బీఆరెస్ ఐదింటిని కోల్పోయి, నాలుగుకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పార్లమెంటులో తెలంగాణ నుంచి కేవలం 3 స్థానాలను కలిగి ఉన్న కాంగ్రెస్.. అనూహ్యంగా పుంజుకొని 11 స్థానాలకు పెరిగే అవకాశం ఉన్నట్లు అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్‌కు అవకాశాలు ఇలా..
భువనగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనగామ సెగ్మెంట్ మినహా మిగిలిన అరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్క సూర్యాపేట మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కరీంనగర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో బీఆరెస్ గెలిచింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిఅసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది.
వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్ మినహా మిగిలిన సెగ్మెంట్లన్నింట్లో కాంగ్రెస్ గెలిచింది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అని సెగ్మెంట్లూ కాంగ్రెస్‌కే లభించాయి. ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని కొత్తగూడెం తన మిత్రపక్షమైన సీపీఐ గెలుచుకోగా, మిగిలిన అన్ని సీట్లలో కాంగ్రెస్ గెలిచింది.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అలంపూర్, గద్వాల సెగ్మెంట్లు మినహా అన్నీ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకున్నది. జహీరాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 4, బీఆరెస్ 2, బీజేపీ 1 స్థానాల్లో గెలుపొందింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ 3, బీజేపీ 2, బీఆరెస్ 2 స్థానాలలో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆరెస్ కంటే 55 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
బీఆరెస్ ఆధిక్యం ఉన్నవి ఇవే
చేవెళ్ల పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 సెగ్మెంట్లలో బీఆరెస్ నాలుగు, కాంగ్రెస్ మూడింట్లో గెలిచింది. కాంగ్రెస్ కంటే బీఆరెస్‌కు లక్ష ఓట్ల మెజార్టీ ఈ నియోజకవర్గంలో ఉన్నది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో బీఆరెస్ గెలుపొందింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్ మినహా అన్ని స్థానాలు బీఆరెస్‌కే దక్కాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నాంపల్లి ఎంఐఎం గెలుపొందగా మిగిలిన అన్ని స్థానాలను బీఆరెస్ గెలుచుకున్నది.
అదిలాబాద్ అలా…
అదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలువగా, బీఆరెస్ 2 కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమయ్యాయి. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకే ఉన్నాయి.
హైదరాబాద్ ఇలా..
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాలలో గోషామహల్‌లో బీజేపీ, మిగిలిన ఆరు స్థానాల్లో ఎంఐఎం గెలిచాయి. సహజంగానే ఎంఐఎం ఇక్కడ ఆధిక్యంలో ఉంటుంది