Congress | BRSకు షాక్.. చేతిలో చెయ్యేసిన జూపల్లి, కూచకుళ్ల ! త్వరలో రాహుల్ సమక్షంలో చేరిక
Congress | కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి, డెంటల్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్‌రెడ్డి ఇప్పటికే గుర్నాథరెడ్డి ఖరారు, త్వరలో ఎంఎల్సీ దామోదర్ రెడ్డి! త్వరలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక ఆహ్వానించిన పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి మారనున్న పాలమూరు రాజకీయం ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మాతబోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు ఫలిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ బహిష్కృత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎంఎల్సీ […]

Congress |
- కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి, డెంటల్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్‌రెడ్డి
- ఇప్పటికే గుర్నాథరెడ్డి ఖరారు, త్వరలో ఎంఎల్సీ దామోదర్ రెడ్డి!
- త్వరలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
- ఆహ్వానించిన పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి
- మారనున్న పాలమూరు రాజకీయం
ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మాతబోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు ఫలిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ బహిష్కృత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. త్వరలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
విధాత ప్రత్యేక ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ ముందుకు సాగుతుంది. గత ఎన్నికల్లో కొల్లాపూర్ మినహా మిగిలిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. అనంతరం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ గూటిలో చేరారు.
ఇటీవలే అలంపూర్ నేత వెంకట్రామిరెడ్డిని పార్టీలో చేర్చుకొని ఎంఎల్సీ కట్టబెట్టింది. దీంతో బీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా మారింది. కాగా పాలమూరులో పట్టు సాధించేందుకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పూర్తి శక్తియుక్తులు పన్నుతున్నారు. దీనికోసం బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు, బలమైన నాయకులను ఆహ్వానిస్తున్నారు. అయితే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ తో విభేదించి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి అడుగులు వేస్తున్నారు. కొంతకాలం బీజేపీ, కాంగ్రెస్ లో ఏ పార్టీలో చేరుతారోనన్న సందిగ్ధత నెలకొంది.
ఈ క్రమంలో ఏఐసీసీ, పీసీసీ హామీతో పొంగులేటితో పాటుగా కాంగ్రెస్ లో చేరేందుకు జూపల్లి అంగీకరిం చారు. ఇది పాలమూరు రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఇదే కోవలో తన నియోజకవర్గం కొడంగల్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని సైతం కాంగ్రెస్ లో చేరేలా రేవంత్ ఒప్పించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ.. ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డితో విభేదిస్తున్న ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ కుమారుడు రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నారు.
మంత్రులు, అధికార పార్టీ నేతలు చేసిన మంత్రాంగం ఫలించలేదు. తన కొడుకు రాజేష్ రెడ్డికి టిక్కెట్ హామీతో త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా ఇప్పటికే పార్టీలో ఉన్న మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డితో రేవంత్, ఇన్‌ఛార్జి ఠాక్రే జరిపిన చర్చలతో కూచకుళ్ల, నాగం మధ్య సయోధ్య కుదిరింది. ఇలా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకోగా ఈనెల 22న రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరనున్నారు.
తాజాగా జూపల్లి, రాజేష్ రెడ్డి, తదితరులను స్వయంగా కలిసిన రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దీంతో సదరు నేతలు తమ వెంట ముఖ్యమైన నాయకులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వీరి బాటలో మరికొందరు హస్తం గూటిలో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద జూపల్లి, కూచకుళ్ల రాజేష్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిల చేరికలు బీఆర్ఎస్ కు షాక్ ఇస్తుండగా కాంగ్రెస్ కు జోష్ ఇస్తోంది.