తుక్కుగూడ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడ నుంచి ఏప్రిల్ 1న ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది

  • By: Somu    latest    Mar 23, 2024 10:59 AM IST
తుక్కుగూడ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం
  • ఏప్రిల్ 1న ఖర్గే, రాహుల్‌లతో సభ
  • తొలిసారి తెలుగులో లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో


విధాత : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడ నుంచి ఏప్రిల్ 1న ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలలో కలిసొచ్చిన సెంటిమెంట్ తుక్కుగూడ నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించుకుంది. ఏప్రిల్ 1న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలను ఆహ్వానించారు. ఈ సభలోనే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల తెలంగాణ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను తెలుగులో విడుదల చేయడం గమనార్హం.


ఇదే రీతిలో ప్రాంతీయ భాషాల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇందుకు పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో కనీసం 12ఎంపీ సీట్లను గెలువాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహారచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వలసలను కూడా ప్రొత్సహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఇచ్చిన హామీల్లో ఇప్పటికే పలు హామీల అమలుతో దూకుడుమీదున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటి తమ ప్రభుత్వ పాలనను మరింత సుస్థిరం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.