సమన్వయ లోపమే కాంగ్రెస్ బలహీనత..
ప్రజా పునాదిగా కష్టిస్తే… కాంగ్రెస్‌కు విజయ ద్వారాలు విధాత: గుజరాత్‌లో కాంగ్రెస్ ఓడిపోయినా.. హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించటం దేశ వ్యాప్తంగా లౌకిక వాదులకు ఆత్మ స్థైర్యాన్నిచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందా.. గెలుస్తుందా? ప్రతిపక్షాలు బీజేపీని ఓడించ గలుగుతాయా? కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? మొదలైన సందేహాలకు గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల ద్వారా కొంత వరకు సమాధానం లభించింది. గ్రామగ్రామాన పాతుకుపోయిన ఏకైక పార్టీ.. దేశ వ్యాప్తంగా బీజేపీ కన్నాకూడా […]

- ప్రజా పునాదిగా కష్టిస్తే… కాంగ్రెస్‌కు విజయ ద్వారాలు
విధాత: గుజరాత్‌లో కాంగ్రెస్ ఓడిపోయినా.. హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించటం దేశ వ్యాప్తంగా లౌకిక వాదులకు ఆత్మ స్థైర్యాన్నిచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందా.. గెలుస్తుందా? ప్రతిపక్షాలు బీజేపీని ఓడించ గలుగుతాయా? కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? మొదలైన సందేహాలకు గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల ద్వారా కొంత వరకు సమాధానం లభించింది.
గ్రామగ్రామాన పాతుకుపోయిన ఏకైక పార్టీ..
దేశ వ్యాప్తంగా బీజేపీ కన్నాకూడా గ్రామ గ్రామాన పాతుకుపోయి ఉన్న ఏకైక రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో గెలుపుకోసం మోదీ ఎంతగా చెమటలు కక్కారనేది చూశాం. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థి మాదిరిగా తిరగటం చూశాం.
భారీగా ఎన్నికల నిధులు కలిగి, ప్రచార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని గెలవటం బీజేపీ విధానం. దేశంలో ఏమూల ఎన్నిక జరిగినా… మోదీ, అమిత్‌షా వంటి పెద్దలు స్వయంగా పట్టించుకుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ స్థాయి నాయకుడు ఒకరు దీనిని వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్నారు. ఇదీ బీజేపీ పరిస్థితి.
పెద్దల అండ.. ఆదెరువు లేని పార్టీ
ఇక కాంగ్రెస్ సంగతి… ఎన్నికల నిధులు అంతగా లేవు. అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ అరవై రోజులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నారు. అక్కడ స్టార్ క్యాంపె యినర్లుగా ప్రచారం చేసిన వారు కాంగ్రెస్ తరపున ఎవరూ లేరు. ఒక రకంగా కాంగ్రెస్ పెద్దల అండ ఆదెరువు లేనిదిగా మారింది.
ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్త పరిస్థితి చూస్తే.. చండీగఢ్ కూడా లెక్కించుకుంటే, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్ తదితర పశ్చిమ, ఉత్తర రాష్ట్రాలలోని వంద స్థానాల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఓడిపోతే ఆపార్టీ పని ముగిసినట్లే.
నాయకత్వ వైఫల్యాలు..
అయితే, ఇంతకాలం ఈ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకోవాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దగా శ్రమపడకుండానే బీజేపీ ఓడిపోయింది. (అయితే.. కాంగ్రెస్ పార్టీలో చీలిక సృష్టించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని మోదీ కూలదోశాడు.. ఇది వేరే సంగతి) దీనిని బట్టి బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనేది ధ్రువ పడింది.
గత గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం శ్రద్ధ పెట్టింది. కానీ మరికొంత వ్యూహాత్మకంగా వ్యవహరిం చాల్సింది. దీంతో దాదాపు 20 సీట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నప్పటికీ… దీనికి నాయకత్వ వ్యూహాత్మక వైఫల్యాలు తోడయ్యాయి.
గతం కంటే ఇదే పెద్ద దెబ్బ
తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్ఠానం అసలు పట్టించుకున్నట్లు లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపిన హార్దిక్ పటేల్‌ను కాంగ్రెస్‌లో నిలబెట్టుకోలేక పోయారు. గతంతో పోలిస్తే ఇదే కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ అయ్యింది. దీంతో కార్యకర్తలు ఎన్నికలకు ముందే ఆత్మస్థైర్యం కోల్పోయారు. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చింది.
మరోవైపు మోదీ నాయకత్వంలో ప్రచారం పకడ్బందీగా సాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ గత బలాన్ని కూడా నిలబెట్టుకోలేక పోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన పునాదిని కాపాడుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతో సమానంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా డబుల్ డిజిట్ రాలేదు. కాంగ్రెస్ ఈ మాత్రం గెలుపులోనూ కాంగ్రెస్ పునాది పదిలంగా ఉన్నదని తేటతెల్లం అవుతున్నది.
స్థానిక నాయకత్వ బలం అనుకూలం..
ఇక, చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానిక నాయకులు అంతా మీదేసుకొని తామే ప్రచారం సాగించారు. ప్రియాంకా గాంధీ కొన్ని సార్లు హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఇది కొంత అనుకూలాంశమే. అయితే, పార్టీకి బలమైన నాయకుడు, ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ మరణం పార్టీకి పెద్ద దెబ్బ అయ్యింది.
ఈ నేపథ్యంలో కూడా హిమాచల్ ప్రదేశ్ స్థానిక నాయకత్వం బలంగా నిలబడి బీజేపీ శ్రేణులకు ఎదురొడ్డి పోరాడటం విశేషం. చివరకు బీజేపీని దెబ్బకొట్టిందంతా స్థానిక నాయకత్వమే అనటంలో సందేహం లేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ పార్టీ నిశ్శేషం కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కూడా కాంగ్రెస్ తన పునాదిని కోల్పోలేదు.
బీజేపీకి ఎదురు గాలి ఉన్నది.
కాంగ్రెస్ స్థానిక నాయకత్వం సమైక్యంగా ఉండి, పోరాడితే గెలుస్తుంది. అధిష్ఠానం పట్టించుకోకున్నా సరే, తమ ప్రజా పునాదిని, కార్యకర్తల బలాన్ని చానలైజ్ చేసుకోగలిగితే ఆ పార్టీ బలమైందిగా దేశ వ్యాప్తంగా అవతరిస్తుంది. పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌తో పాటు, చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ ఘటనలే ఇందుకు ఉదాహరణ.