అక్రమ ఖాకీలపై.. CP రంగనాథ్ ఉక్కుపాదం!
వరుస సస్పెన్షన్‌లతో గట్టి చర్యలు ఇద్దరు సీఐలు సహా ఇద్దరు ఎస్సైల సస్పెండ్, ఒక ఆర్ఐ అరెస్ట్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కలకలం విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై వరంగల్ కొత్త సీ.పీ రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరోపణల పై ఆరా తీస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. మొన్నటి వరకు సిపిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ తరుణ్ జోషి ఇటీవల ట్రాన్‌స్ఫర్ […]

- వరుస సస్పెన్షన్‌లతో గట్టి చర్యలు
- ఇద్దరు సీఐలు సహా ఇద్దరు ఎస్సైల సస్పెండ్, ఒక ఆర్ఐ అరెస్ట్
- పోలీసు కమిషనరేట్ పరిధిలో కలకలం
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై వరంగల్ కొత్త సీ.పీ రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరోపణల పై ఆరా తీస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించారు.
మొన్నటి వరకు సిపిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ తరుణ్ జోషి ఇటీవల ట్రాన్‌స్ఫర్ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రంగనాథ్ సిపిగా తాజాగా బాధ్యతలు చేపట్టారు. గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన అనుభవం రంగనాథకు ఉంది. తాను బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే క్రైమ్, ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలతో పాటు తనదైన ప్రత్యేక మార్కు వేసేందుకు కొత్త పోలీస్ బాస్ ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే శాఖాపరమైన లోటుపాట్లు, ఆరోపణలపై కూడా గట్టిగా కన్నేసినట్లు ఆయన తీసుకుంటున్న చర్యలను బట్టి అర్థమవుతోంది. ఈ కొద్ది కాలంలోనే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. మరో రిజర్వ్ ఇన్స్పెక్టర్ అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రేపోమాపో సస్పెండ్ చేసే అవకాశం ఉంది. తాజాగా మరో సీఐని సోమవారం సిపి సస్పెండ్ చేశారు. ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులపై వేటుపడగా ఈ సంఖ్య ఐదుకు చేరింది.
నలుగురు అధికారుల సస్పెన్షన్
కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వెంకటేశ్వర్లు, దామెర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎ. హరిప్రియ, సుబేదారి ఎస్.ఐ పి.పున్నం చందర్ ను సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్.ఐ హరిప్రియ ఇరువురు గత కొద్ది రోజులుగా హద్దులు మీరి వ్యవహరించడంతో మహిళ ఎస్.ఐ భర్త ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం పోలీస్ కమిషనర్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు, మహిళ ఎస్.ఐ హరిప్రియ ఇరువురిని సస్పెండ్ చేసారు.
మరో సంఘటనలో సుబేదారిలో నివాసం వుంటున్న ఓ యువతి గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు గురై రక్షణ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పి. పున్నంచందర్ ఆశ్రయించగా సదరు ఎస్.ఐ. నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిందితుడితో రాజీపడాల్సిందిగా బాధితురాలికి ఎస్.ఐ సూచినట్లుగా వచ్చిన ఫిర్యాదుపై సుబేదారి ఎస్.ఐ సస్పెండ్ చేశారు.
మూడు నాలుగు రోజుల క్రితమే ఒక సీఐ సహా ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేసిన సిపి రంగనాథ్ తాజాగా మరో రిజర్వ్ ఇన్స్పెక్టర్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సిపి ఆదేశాలతో ఆర్ఐని అరెస్టు చేసినట్లు సమాచారం.
బెదిరించిన సంఘటనలో ఆర్ఐ
గోల్డ్ స్టోన్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ ను పోలీస్ ఉన్నతాధికారుల అదేశాలతో శుక్రవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సమాచారం. వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి, అరెస్టుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సతీష్ ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్.ఐ సతీష్ సస్పెండయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
వరంగల్‌లో మరో సీఐ, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్
కమిషనరేట్ పరిధిలో పనిచేసే టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె సోమలింగం మరియు ఒక కానిస్టేబుల్ బి సృజన్ ను సస్పెండ్ చేశారు.
పిడిఎస్ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి నిందితుల పై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారి నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కారణంగా పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర విషయాల్లో కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
గట్టి వార్నింగ్ జారీ చేసిన సీపీ
కమిషనరేట్ పరిధిలో చేపట్టిన వరుస చర్యలతో పోలీస్ శాఖలో అక్రమాలకు పాల్పడేవారు, సెటిల్మెంట్లు చేసేవారు, రాజకీయ అండదండలతో చెలరేగేవారూ, ఉన్నతాధికారులను లక్షపెట్టని వారు ఆందోళనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది.
వరుస చర్యలతో శాఖలోని వారికి, బయటివారికి కలిపి గట్టిహెచ్చరికలు జారీ చేసినట్లుగా.చర్చ జరుగుతోంది. కొత్తగా బాధ్యతలు తీసుకున్నందున శాఖ పై పట్టు కోసం సిపి ప్రయత్నిస్తున్నారని డిపార్ట్మెంట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే తరహాలో సిపి పని విధానం ఉంటుందా? తర్వాత ఏమైనా ఒత్తిళ్లకు తలొగ్గుతారా? అనేది రానున్న రోజులు తేలనున్నది.