ఒక్క సీటు ఇవ్వండి: కాంగ్రేస్‌కు సీపీఐ నేత కూనంనేని వినతి

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్ధుబాటు కోసం తాము ఐదు సీట్లను ప్రతిపాదించామని, వాటిలో ఏదేని ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని పేర్కోన్నారు.

ఒక్క సీటు ఇవ్వండి: కాంగ్రేస్‌కు సీపీఐ నేత కూనంనేని వినతి
  • ఎన్డీఎస్‌ఏ నివేదిక నెలరోజుల్లోనే ఇవ్వాలి


విధాత: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్ధుబాటు కోసం తాము ఐదు సీట్లను ప్రతిపాదించామని, వాటిలో ఏదేని ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కోన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్‌సభ స్థానం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని ఆశిస్తున్నామని తెలిపారు. మిత్ర ధర్మానికి విరుద్ధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటం సరైంది కాదన్నారు.


గత ఎన్నికల్లోనూ సీపీఐపైనే రాహుల్ గెలిచారని గుర్తు చేశారు. రాజకీయాల కోణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనకు రావడం..అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం జరుగుతుందన్నారు. నరేంద్రమోదీ కనికరంలేని రాజకీయ నాయకుడని మండిపడ్డారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నారా? లేక రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్న కొనియాడితే.. మోదీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారన్నారు.


బీఆరెస్‌ను అసెంబ్లీ ఎన్నికల వరకు తిట్టిపోసిన ఆరెస్ ప్రవీణ్‌కుమార్‌కు అకస్మాత్తుగా ఆ పార్టీలో ఏమార్పు వచ్చిందో చెప్పాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆరెస్‌ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీఆరెస్‌ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదికను నెల రోజుల్లో ఇవ్వాలన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా లేదా ఎన్నికల ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.