CPM: జనాధారణకు తిప్పలు.. పొత్తు పొడుపులో ఉభయ కమ్యూనిస్టుల ఐక్యతారాగం
ఎల్లుండి నుంచి సీపీఎం జనచైతన్య యాత్రలు బీఆర్ఎస్‌తో పొత్తుపై కేడర్‌లో నిర్లిప్తత విధాత: ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మక భూమిక పోషించిన వామపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో ప్రాతినిధ్యం సైతం లేకుండా పోగా జనంలో తిరిగి పట్టు సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టే పేరుతో ఈనెల 17 నుండి 29 వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జన చైతన్య యాత్రల […]

- ఎల్లుండి నుంచి సీపీఎం జనచైతన్య యాత్రలు
- బీఆర్ఎస్‌తో పొత్తుపై కేడర్‌లో నిర్లిప్తత
విధాత: ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మక భూమిక పోషించిన వామపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో ప్రాతినిధ్యం సైతం లేకుండా పోగా జనంలో తిరిగి పట్టు సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టే పేరుతో ఈనెల 17 నుండి 29 వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జన చైతన్య యాత్రల నిర్వహణకు తెలంగాణ సిపిఎం నాయకత్వం సిద్ధమైంది. అటు సిపిఐ సైతం ఏప్రిల్ 14 నుంచి ఇంటింటికి సీపీఐ కార్యక్రమం చేపట్టనుంది.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్‌తో పొత్తుతో దగ్గరైన సీపీఎం, సీపీఐ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు పరస్పరం సహకరించుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని నిర్ణయించుకొని ఐక్యతరాగం వినిపించడం తెలంగాణ వామపక్ష రాజకీయ ప్రస్థానంలో ఆసక్తికర పరిణామం.
గతంలో మాదిరిగా విడివిడిగా పోటీ చేసి నష్టపోకుండా రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం, ఇందుకు తమ పార్టీల శ్రేణులను ఏకం చేసేందుకు ఏప్రిల్ 9న ఉమ్మడి సమావేశం నిర్వహించుకోనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు తమ ప్రజాదరణ కార్యక్రమాల జోరు పెంచిన నేపథ్యంలో సిపిఎం కూడా తనవంతుగా ఈనెల 17 నుండి జనచైతన్య యాత్రతో జనంలోకి వెళ్తుంది.
యూటర్న్ పయనం అసెంబ్లీకి చేరేనా..?
సైద్ధాంతిక రాజకీయ ప్రత్యర్థిగా వామపక్షాలు ప్రకటించుకున్న బిజెపి పార్టీ సైతం తెలంగాణ రాజకీయాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుగుతున్నప్పటికీ వామపక్షాలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉనికి కోసం తంటాలు పడుతున్న విచిత్ర స్థితి నెలకొంది.
రాష్ట్రంలో కోల్పోయిన ప్రజా బలాన్ని, చట్టసభల ప్రాతినిధ్యాన్ని తిరిగి సాధించే కసరత్తులో అటు కేంద్రంలోని బిజెపికి, ఇటు రాష్ట్రంలోని బిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల పంథాలో.. అకస్మాత్తుగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యూటర్న్ తీసుకున్న సీపీఎం, సీపీఐలు మునుముందు కూడా బీఆర్ఎస్‌తో పొత్తు రాజకీయాలతోనే ముందుకెళ్లేందుకు నిశ్చయించుకున్నాయి.
రాష్ట్రంలో సిపిఎం, సిపిఐలు గతంలో విజయం సాధించినటువంటి, 20వేలకు పైగా ఓట్లున్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీల బలోపేతం లక్ష్యంగా పనిచేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. తద్వారా బీఆర్ఎస్‌పై సీట్ల పంపకం దిశగా ఒత్తిడి కూడా పెంచినట్లు అయింది. బీఆర్ఎస్‌తో పొత్తు కొనసాగి ఆశించిన సీట్లు దక్కకపోతే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిపి నిర్దేశిత స్థానాల్లో గెలిచేందుకు ఇప్పటి నుండే తగిన ఉమ్మడి కార్యాచరణతో, వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి.
పొత్తు బాటలో ముందుకెళ్లాలని…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులొడ్డినప్పటికీ వామపక్షాల పొత్తు ఓట్లతో సాంకేతికంగా గెలిచామన్నట్లుగా అత్తెసరు విజయమే దక్కింది. అయితే ఈ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలుపుకు వామపక్షాల ఓట్లు కీలకమయ్యాయన్న భావనతో అదే రీతిలో వచ్చే ఎన్నికల్లో పొత్తు బాటలో ముందుకెళ్లాలని వామపక్షాలు తలపోస్తున్నాయి.
ఉమ్మడి రాజకీయ శత్రువు బీజేపీని ఓడించే లక్ష్యసాధనలో మునుగోడు ఉప ఎన్నికల్లో పొత్తు సాంకేతికంగా సఫలమైనప్పటికీ, ఆ తర్వాత బిఆర్ఎస్, వామపక్షాల మధ్య ఆశించిన సాన్నిహిత్యం కనబడలేదు. గతంలో వామపక్షాలను తోక పార్టీలు.. సూది దబ్బడం పార్టీలంటూ అవమానించిన సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పట్ల వామపక్ష కేడర్లో, ప్రజల్లో భిన్న అభిప్రాయాల రచ్చ కొనసాగుతూనే ఉంది.
పార్టీ కేడర్లో కనిపిస్తున్న అంతర్మథనం
ముఖ్యంగా సిపిఎం, సిపిఐ పార్టీల నాయకత్వం మారినంత వేగంగా బిఆర్ఎస్ కు అనుకూలంగా వామపక్ష కేడర్ లో మార్పు రావడం లేదు. మెజార్టీ వామపక్ష శ్రేణులు పార్టీ నిర్ణయానికి కట్టుబడినప్పటికీ బిఆర్ఎస్ తో పొత్తు పట్ల అయిష్టత చూపుతున్నారు. తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలన పట్ల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు వామపక్షాల మద్దతు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా.. బీఆర్ఎస్ కు మేలు చేసేలా ఉందన్న అంతర్మథనం ఆ పార్టీ కేడర్లో బాహటంగానే వినిపిస్తుంది.
మరోసారి ప్రజా పోరాట మార్గాల ద్వారా బలోపేతమవ్వాలన్న కార్యాచరణ కంటే పొత్తుల ఎత్తుల పైనే ఆధారపడాల్సిన అనివార్యతలోకి వెళ్లామన్న వాదన కూడా కమ్యూనిస్టు కేడర్ ను కలిచివేస్తుంది. అసలు తెలంగాణ ఏర్పాటు దాకా చూస్తే రాష్ట్రంలో వామపక్షాల కంటే బీజేపీనే బలహీనంగా ఉండేదని…. ఇప్పుడు ఆ పార్టీ ఒంటరి రాజకీయంతోనే రాష్ట్రంలో బలోపేతమవుతుండగా, బీజేపీ కంటే ముందుండాల్సిన మనం పొత్తులతో ఎన్నికల్లో ఆశించిన సీట్ల సంఖ్యను సాధించినా… పార్టీ బలోపేతం దిశగా మాత్రం ఆశించిన లక్ష్యాలు అందుకుంటామా అన్న మీమాంస కమ్యూనిస్టుల్లో వ్యక్తం అవుతుంది.
ఆశించిన సీట్లు దక్కేనా?
బిఆర్ఎస్‌తో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు దక్కుతాయి..? దక్కిన సీట్లలో గెలిచేది ఎన్ని? అసెంబ్లీలో తమ పార్టీలకు ప్రాతినిధ్యం దక్కుతుందో లేదో నన్న చర్చలు వామపక్ష శ్రేణులను టెన్షన్ పెడుతున్నాయి. బిఆర్ఎస్ కోరిన సీట్లు ఇస్తుందో లేదో గాని ప్రజావ్యతిరేకతతో కదలనంటున్న కారు పార్టీకి వామపక్షాలు ఇంధనంగా ఉపయోగపడుతున్నాయన్న చర్చలు వామపక్ష కేడర్‌లో సాగుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను వదులుకోవాల్సి వస్తుందన్న ఆలోచనలతోనో లేక మునుగోడులో గెలవాలన్న తన రాజకీయ అవసరం తీరిపోయిందనోగాని, ఉప ఎన్నికల ఫలితాల సందర్భంగా మినహా మళ్లీ ఎక్కడ కూడా వామపక్షాల పొత్తు ఉసెత్తలేదు.
బీఆర్ఎస్‌తో పొత్తుపై వామపక్షాల కేడర్‌లో విముఖత
లిక్కర్ కేసు డైవర్ట్ చేసేందుకు అన్నట్లుగా ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన దీక్ష సందర్భంగా ఆమె వామపక్ష జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే వామపక్షాల కేడర్ ఆపద్దర్మ రాజకీయంగానే చూసింది. వామపక్షాల పట్ల కేసీఆర్ ప్రదర్శిస్తున్న అవకాశవాద వైఖరి కూడా బీఆర్ఎస్‌తో పొత్తు పట్ల వామపక్షాల కేడర్‌లో విముఖతను రేకెత్తిస్తుంది.
ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొన్న తీరు కూడా వామపక్షాల పొత్తు బీఆర్ఎస్‌తో కంటే కాంగ్రెస్‌తో ఉంటే బాగుండేదన్న ఆసక్తికర చర్చలకు ఆజ్యం పోసింది. ప్రస్తుతానికి ఉమ్మడి రాజకీయ శత్రువు బీజేపీని దెబ్బ తీయాలన్న ఉమ్మడి లక్ష్యంతో ఏకమైన బీఆర్ఎస్-వామపక్షాల పొత్తు భవిష్యత్తులో ఎన్నికల సందర్భంగా సీట్ల పంపకాల వరకు ప్రశ్నార్థకంగానే కొనసాగనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలను అనుసరించి మునుముందు కాంగ్రెస్ వైపు ఎర్రజెండాలు మొగ్గు చూపుతాయా అన్న అంశం కూడా తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.