‘క‌రెంట్‌’ పాలిటిక్స్‌!

‘క‌రెంట్‌’ పాలిటిక్స్‌!
  • లైట్ వెలిగేదెవ‌రికి? షాక్ త‌గిలేదెవ‌రికి?
  • అన్ని పార్టీల‌కు ప్ర‌ధాన అస్త్రంగా విద్యుత్తు
  • పార్టీల నాయ‌కుల మ‌ధ్య హాట్ హాట్ స‌వాళ్లు
  • కాంగ్రెస్ వ‌స్తే 24 గంట‌ల క‌రెంటు బంద్‌
  • ప్ర‌చారంలో ప్ర‌స్తావిస్తున్న బీఆర్ఎస్ నేత‌లు
  • అస‌లు 24 గంట‌ల క‌రెంటు ఎక్క‌డ‌ ఉందో చూపండి
  • చూపిస్తే నామినేష‌న్లు వేయ‌నన్న రేవంత్‌
  • 3 గంట‌ల క‌రెంటు కామెంట్లపై బీఆర్ఎస్ ఫైర్‌
  • ఫ్రీ క‌రెంటు పేటెంట్ త‌మ‌దేన‌న్న రేవంత్‌
  • త‌ల‌స‌రి వినియోగంలో తెలంగాణ టాప్‌
  • ఎన్నిక‌ల ప్ర‌చారంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌
  • 10 వ స్థానంలో ఉన్న‌దంటున్న‌నివేదిక‌లు

విధాత‌, హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విద్యుత్తు కీల‌క అంశంగా మారింది. విద్యుత్తు స‌ర‌ఫ‌రాపై నేత‌ల స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు, ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ప్ర‌చారం వేడెక్కుతున్న‌ది. అయితే.. ఈ క‌రెంటు.. ఎవ‌రి పార్టీని వెలిగిస్తుంది? ఎవ‌రికి షాక్ ఇస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంటు కావాలా? 3 గంట‌ల క‌రెంటు కావాలా? అంటూ ప్ర‌తి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో సీఎం కేసీఆర్ ఓట‌ర్ల‌ను అడుగుతున్నాడు. కాంగ్రెస్ వ‌స్తే 3 గంట‌లే క‌రెంటు ఇస్తుంద‌ని, అంతా అంధ‌కారం నెల‌కొంటుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి అంతే ధీటుగా పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించాడు. 24 గంట‌లు క‌రెంటు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు నిరూపిస్తే తాను నామినేష‌న్ వేయ‌న‌ని స‌వాల్ విసిరారు. దీనికి సిద్ధ‌మా అని కేసీఆర్‌ను బ‌హిరంగంగా అడిగారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే 24 గంట‌ల క‌రెంటు ఇస్తామ‌ని తెలిపారు. ఉచిత క‌రెంటుకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేన‌ని అన్నారు.

క‌రెంటు అంశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్ర‌ధాన అంశంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే 3 గంటల క‌రెంటు కూడా స‌రిగా రాద‌ని బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన‌ర్లు ప్ర‌చారం చేస్తున్నారు. మంత్రి టీ హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి 3 గంట‌ల క‌రెంటు చాల‌ని మాట్లాడి, ఇప్పుడు నేనెక్క‌డ అన్నాన‌ని బుకాయిస్తున్నాడ‌ని ఆరోపించారు. నీవు అమెరికాలో అన్న విష‌యాలు గూగుల్‌లో ఉన్నాయి, చూసుకోవాల‌న్నారు. గూగుల్‌లో కొట్ట‌గానే వ‌స్తుంద‌న్నారు. ఇదే తీరుగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ‌స్తే మ‌ళ్లీ క‌రెంటు క‌ష్టాలు మొద‌ల‌వుతాయ‌ని అంటున్నారు. దేశంలో 24 గంట‌ల నిరంత‌ర క‌రెంటు స‌ర‌ఫ‌రా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ‌నే అని అంటున్నారు.

త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నామ‌ని సీఎం కేసీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. 24 గంట‌ల విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్ర‌క‌టించారు. అయితే దేశంలో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో తెలంగాణ ఉంద‌ని సెంట్ర‌ల్ ఎల‌క్ట్రిసిటీ అథారిటీ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని టీ జేఏసీ వెల్ల‌డించింది. పైగా ఉమ్మ‌డి రాష్ట్రం కంటే విద్యుత్ వినియోగ‌రేటు త‌గ్గింద‌ని నివేదిక తెలిపింది. ఇలా చూస్తే వాస్త‌వ లెక్క‌ల‌కు, బీఆర్ఎస్ స‌ర్కారు పెద్ద‌లు చేసుకుంటున్న ప్ర‌చారానికి చాలా వ్య‌త్యాసం ఉన్న‌ట్లు విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం. ఇక్క‌డ ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, బోరు బావులతోనే సాగు ఎక్కువ‌గా సాగుతున్న‌ది. వీటన్నింటికి విద్యుత్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారికంగా 27.54 ల‌క్ష‌ల అధికారిక విద్యుత్ క‌నెక్ష‌న్లు ఉండ‌గా, అన‌ధికారికంగా మ‌రో 10 ల‌క్ష‌ల విద్యుత్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. అత్య‌ధికంగా వ్య‌వ‌సాయం మోటార్ క‌నెక్ష‌న్ల ద్వారానే సాగుతోంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ అంశం రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా మారింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రం అంధ‌కారం అవుతుంద‌ని, బీఆర్ఎస్ ప్ర‌చారం చేస్తుండ‌గా, అస‌లు మీరు 24 గంట‌లు క‌రెంటు స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని కాంగ్రెస్ అంటోంది. మ‌రో వైపు స‌బ్ స్టేష‌న్లలోని లాగ్ బుక్‌లు ప‌రిశీలిస్తే క‌రెంటు ఎన్ని గంట‌లు ఇస్తున్నారో తెలుస్తుంద‌న్నారు.

తలసరి విద్యుత్తు వినియోగం నెంబర్ వన్..అబద్ధం !

తేల్చిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక !!

విధాత : తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్ అంటూ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మరో పెద్ద అబద్ధంగా తేలిపోతుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) 2023నివేదిక మేరకు తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలో తెలంగాణ 10వ‌ స్థానంలో ఉందని టీ జేఏసీ తెలిపింది. ప్రగతి సూచికలలో తరుచు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలకు కేంద్ర నివేదికలకు పొంతన లేద‌ని సీఈఏ నివేదిక రుజువు చేసినట్లయ్యింది. నిజానికి ఒక రాష్ట్ర అభివృద్ధికి తలసరి విద్యుత్తు వినియోగాన్ని కూడా సూచికగా భావిస్తారు. ప్రభుత్వ పెద్దలు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చెప్పుకునే క్రమంలోనే విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అన్న ప్రచారానికి దిగారని అవగతమవుతుంది. ఈ ప్రచారంలో నిజానిజాలను పరిశీలించేందుకు తాజా సీఈఏ నివేదిక లెక్కలను పరిశీలించగా తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న తలసరి విద్యుత్తు వినియోగంలో నెంబర్ వన్ అన్న ప్రచారం కాస్తా నెంబర్ వన్ అబద్ధంగా తేలిపోయిందని టీజేఏసీ వెల్లడించింది.

తెలంగాణ కంటే ముందంజలో తొమ్మిది రాష్ట్రాలు

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా వార్షిక నివేదిక (2023)లో టేబుల్ 9.9 లో 2021-22లో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా తలసరి విద్యుత్ వినియోగ వివరాలు పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తలసరి విద్యుత్ వినియోగపరంగా తెలంగాణ 10వ స్థానంలో ఉంది. అంటే అగ్రస్థానానికి తెలంగాణ ఆమడ దూరంలో ఉందన్న చేదు నిజం గ్రహించక తప్పదు. సీఈఏ నివేదిక మేరకు తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ కంటే తొమ్మిది రాష్ట్రాలు ముందుండగా వాటిలో మొదటి స్థానంలో గోవా రాష్ట్రం ఉంది. గోవాలో తలసరి విద్యుత్తు వినియోగం 3736 యూనిట్లుగా ఉంది. తదుపరి వరుసగా 2వ స్థానంలో పంజాబ్‌, 3వ స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్‌, 5వ స్థానంలో ఛ‌త్తీస్‌ఘడ్‌, 6వ స్థానంలో హర్యానా రాష్ట్రాలున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ, పుదుచ్చేరిలు వరుసగా 7, 8, 9వ స్థానాల్లో తెలంగాణ కంటే ముందున్నాయి. 10వ స్థానంలో తెలంగాణ ఉందని టీ జేఏసీ పేర్కోంది. తాజాగా మంత్రులు కేటీఆర్‌, కవితలు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2126గా పేర్కోన్నారు. జాతీయ తలసారి విద్యుత్తు వినియోగం 1255యూనిట్లతో పోల్చితే 69.40శాతం తెలంగాణ ఎక్కువగా ఉన్నట్లుగా వారు చెప్పడం గమనార్హం.

ఉమ్మడి రాష్ట్రం కంటే తగ్గిన విద్యుత్తు వినియోగ వృద్ధి రేటు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత‌ విద్యుత్ వినియోగ వృద్ధి రేటు పడిపోవడం ఆసక్తికరమని టీజేఏసీ వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడ విద్యుత్తు సరఫరా మెరుగైనట్లుగా ప్రభుత్వం చెబుతుంది. ఇందులో సైతం నిజం లేదని టీజేఏసీ పేర్కోంది. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా మెరుగుపడటంలో తెలంగాణ ప్రభుత్వ ఘనత కంటే 2015 తర్వాత‌ దేశం మొత్తం మీద విద్యుత్తు ఉత్పత్తి పెరగడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. దేశంలో గతంలో మొదలు పెట్టిన విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తి కావడం, బొగ్గు సరఫరా విధానం కలిసి రావడంతో విద్యుత్తు ఉత్పత్తి గతంలో కంటే గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు లేవని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు ఆందోళనకర స్థాయిలో లేకుండాపోయాయి. దీంతో పాటు ఆర్థిక స్థోమత ఉన్న రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలుకు కావాల్సినంత విద్యుత్తు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి పెరిగి రాత్రికి రాత్రి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగంలో నెంబర్ వన్ అయ్యిందన్న ప్రచారం గోబెల్స్ ప్రచారమని తేలిపోతుందని టీ జేఏసీ స్పష్టం చేస్తోంది.