ఓరుగల్లు: ‘గులాబీ’కి ప్రమాద ఘంటికలేనా..! కేసీఆర్‌పై నమ్మకం తగ్గుతుందా..?
నేతల గుండెల్లో దడ సంక్షేమ పథకాల పైనే ఆశ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత ప్రజావ్యతిరేకత పైనే కాంగ్రెస్ ఆశ బీజేపీ చూపు చేరికల పైనే.. విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పై గట్టి పట్టును సాధించిన గులాబీ పార్టీకి రానున్న ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే ముందున్న బ్యాలెట్ పరీక్ష అంత ఆషామాషీ వ్యవహారంగా మాత్రం లేదు. పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, […]

- నేతల గుండెల్లో దడ
- సంక్షేమ పథకాల పైనే ఆశ
- ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత
- ప్రజావ్యతిరేకత పైనే కాంగ్రెస్ ఆశ
- బీజేపీ చూపు చేరికల పైనే..
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పై గట్టి పట్టును సాధించిన గులాబీ పార్టీకి రానున్న ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే ముందున్న బ్యాలెట్ పరీక్ష అంత ఆషామాషీ వ్యవహారంగా మాత్రం లేదు. పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, గులాబీ ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యతిరేకత ముఖ్యంగా కబ్జాలు, అక్రమాల ఆరోపణలు, గులాబీ ఆధిపత్యం పైన వ్యతిరేకత తడిసి మోపెడైంది. దీనికి తోడు కొందరు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఉంటూనే ఇప్పటికీ కాంట్రాక్టర్లుగా ఉన్నారు. తమ స్వంత నియోజకవర్గాల్లో పనులు వీళ్లే చేస్తున్నారు. ఇక నాణ్యత గురించి మాట్లాడే వారు కరువయ్యారు. ఇక పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల పెత్తనం, ఏకపక్ష విధానాలతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
టీఆర్ఎస్ పట్టు నిలబెట్టుకుంటుందా..
2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గతం కంటే పట్టు బిగించినప్పటికీ రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ గత తన పట్టును నిలబెట్టుకోవడం మాత్రం కత్తిమీద సాములాంటిదే. పెరిగిన ప్రజావ్యతిరేకత విపక్షాలకు అనుకూలంగా మారే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
గులాబీ ఆశలు గల్లంతేనా..
ఇవన్నీ రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంపై తీవ్ర ప్రభావం కనుబరుస్తాయి. ఈ ప్రమాద ఘంటికల కారణంగానే టీఆర్‌ఎస్ నాయకత్వంలో తీవ్ర ఆందోళన నెలకొంది. రోజురోజుకు విపక్షాలకు సానుకూలత పెరుగుతోంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత పెరిగితే అధికార గులాబీ పార్టీ ఆశలు గల్లంతే. అయితే ప్రజానుకూలతను ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఏ మేరకు ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. ఇక ఇప్పటికిప్పుడు జిల్లాలో బీజేపీ ఆ స్థాయికి ఎదిగే స్థితి మాత్రం కన్పించడంలేదు.
కేసీఆర్ పై నమ్మకం సడలుతుందా..
రాష్ట్రప్రభుత్వం పై వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్ సర్కారు రెండు టర్మ్‌లు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తికాకపోడంతో ప్రభుత్వం పై ప్రధానంగా ఆ పార్టీ ముఖ్యనేత కేసీఆర్ మాట మీద నమ్మకం సడలిపోతోందీ. దీనికి తోడు ఉమ్మడి జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపే మంత్రులు కరువయ్యారు.
పూర్తిగా అధిష్ఠానం కనుసన్నల్లోనే కార్యకలాపాలు నిర్వహించడంతో విశ్వసనీయత తగ్గింది. ఇక ఎనిమిదేళ్లుగా అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లేక తీవ్రనిరాశతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీ నాయకులకు వడ్డించిన విస్తరిగా మారడంతో సామాన్య ప్రజల్లో ఆవేదన రగులుతున్నది.
దీనికి అదనంగా సిట్టింగులపై వ్యతిరేకత తోడైంది. ఇందులో ఇద్దరు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి మినహా మెజారిటీ ఎమ్మెల్యేలు రెండు పర్యాయాలుగా రెడ్యానాయక్, ఎర్రబెల్లి, రాజయ్య, రెండుకంటె ఎక్కువ సార్లు ఎన్నికయ్యారు. ఇది కూడా కొంత వ్యతిరేకతకు కారణం.
సమన్వయ లోపం
2018 ఎన్నికలకు ముందు సీనియర్ మంత్రిగా ఉన్న కడియానికి రెండవ దఫా చెక్‌పెట్టి ఆయన స్థానంలో ఎర్రబెల్లికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, సత్యవతి రాథోడ్‌కు గిరిజన శాఖను కేటాయించి తనదైన మార్క్‌ను కేసీఆర్ కనబరిచారు. అయితే గతంలో ఉమ్మడిగా ఉన్న జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించడమే కాకుండా మంత్రులకు గతంలో మాదిరిగా అధికారాలు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలను తలపిస్తున్నారు. పూర్తిగా అధిష్టానం కనుసన్నల్లోనే పనిచేయాల్సిరావడంతో పలుచనైపోతున్నారు. సమన్వయం చేయలేక పోతున్నారు. వారి మాట చెల్లుబాటు కావడంలేదు.
కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా?
ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అప్పుడప్పుడు తన పాత్ర పోషించేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నది. నాయకత్వ లేమి, అనుభవ రాహిత్యం, కేడర్‌లో విశ్వాసం సన్నగిల్లి ఆ పార్టీ తల్లడిల్లుతున్నది. కాంగ్రెస్ లో గ్రూపులకుతోడు సీనియర్ నేతల కొరత ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పైనే ఆ పార్టీ ఆధారపడి ఉంది.
గుంభనంగా వ్యవహరిస్తున్న ప్రజలు ఆ పార్టీని ఏ మేరకు గట్టెక్కిస్తారో వేచిచూడాల్సిందే. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాసమస్యల పరిష్కారంలో గులాబీ పార్టీ వైఫల్యాలను విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుని తమ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల జిల్లాలో జరిగిన భారీ సభ విజయవంతమైంది. దీనికి రాహూల్ గాంధీ సైతం హాజరయ్యారు.
చేరికలే బీజేపీకి ఆధారం
కేంద్ర బలగంతో మంచి ఊపులో ఉన్న బీజేపీ ఇక్కడ ఏ మేరకు పాదులు వేస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో ఆ పార్టీ ప్రాతినిథ్యం వహించిన పరకాల, హన్మకొండ సెగ్మెంట్లలో తిరిగి పుంజు కుంటుందా అనేది కొంత అనుమానమే. ఇతర పార్టీల నుంచి జరిగే చేరికల పైనే ఆ పార్టీ ఆధారపడి ఉంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలం లేకపోవడం సమస్యగా మారింది. మోడీ చరిష్మాపై ఆధారపడుతోంది. ఇక వామపక్షాలు బలం తగ్గి చెదిరిపోయిన గూడు సదురుకోవడంలో ఇప్పడిప్పుడే నిమగ్నమయ్యారు.
గులాబీ ప్రజాప్రాతినిథ్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిని చూద్దాం. 2018లో రెండవ పర్యాయం అసెంబ్లీ ఎన్నికలే కాకుండా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలతో పాటూ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రతిహత విజయాలు టీఆర్‌ఎస్ నమోదు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకుగానూ 10 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్‌లలో వరుసగా ముత్తిరెడ్డి, డాక్టర్ రాజయ్య, ఎర్రబెల్లి, దాస్యం, నన్నపునేని నరేందర్, ఆరూరి, ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్ గెలచి విజయదుంధుబి మోగించారు. భూపాల్పల్లి, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ధనసరి అనసూయ అలియాస్ సీతక్క విజయం సాధించారు. టీడీపీ పూర్తి కనుమరుగైంది.
ఫిరాయింపులు షరామాములు
2014లో కొత్త రాష్టంలో తొలి ఎన్నికల అనంతరం విలువలకు తిలోదకాలిస్తూ అధికార టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రెడ్యానాయక్, టీడీపీలో ప్రధాన నాయకునిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలినిన ధర్మారెడ్డి గులాబీ గూటికి చేరుకున్నారు. దీంతో ఒకే ఒక్కడుగా నర్సంపేట నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరి ప్రతిపక్ష సభ్యునిగా మిగిలిపోయారు.
2018లోనూ ఈ ఫిరాయింపులకు టీఆర్ఎస్ తెరలేపి రంగుల రాజకీయాలను కొనసాగించింది. భూపాలపల్లి నుంచి గెలిచిన గండ్ర కాంగ్రెసుకు చెయ్యిచ్చి గులాబీ గూటికి చేరుకున్నారు. మళ్లీ ఒకే ఒక స్థానంలో సీతక్క ప్రతిపక్షానికి ప్రాతినిథ్యం వహించడం గమనార్హం
ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఇంత బలం, బలగం ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన ప్రజావ్యతిరేకతను తట్టుకొని రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువైన విషయం మాత్రం కాదు. ఏమైనా ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ మాత్రం ముమ్మరంగా జరుగుతోంది.