టీఎస్ ఆర్టీసీకి దన్నుగా ఉంటాం..ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవంలో భట్టి
టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలబడి అవసరమైన అన్ని సహాహ సహకారాలను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు

విధాత, హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలబడి అవసరమైన అన్ని సహాహ సహకారాలను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణలో తొలిసారిగా అత్యాధునిక హంగులతో ప్రవేశపెట్టిన పర్యావరణహితమైన 25 ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మలు మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్., మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని, ఫ్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని స్పష్టం చేశారు. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి తిరిగి బలోపేతమవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100రోజుల్లోగా అమలు చేస్తున్నామని తెలిపారు.
అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులేనని, పాత మెట్రో ఎక్స్‌ప్రెస్ స్థానంలో వస్తున్న బస్సులని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు నడుస్తాయని, చార్జింగ్ కోసం బీహెచ్ఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోందని, ఇందులో 125 మెట్రో డీలక్సులున్నాయని వివరించారు. ఇవన్నీ జూన్‌లో అందుబాటులోకి వస్తాయని, మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ ప్రెస్ కాగా, 140 ఆర్టీనరి బస్సులని, ఈ బస్సులన్నిటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు.