Conservatism | వివక్ష నిర్మూలనే ‘సనాతన’ నిర్మూలన

Conservatism | విధాత‌: సనాతనం అనేది ఒక ధర్మం. అది కాలానుగుణంగా మారుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో నాటి మనుధర్మం చెప్పినవే నడవాలి అన్న వాదన అర్థరహితం. సనాతన ధర్మం పేర్కొన్న విధంగా మహిళలపై వివక్ష, సతీసహగమనం, బాల్యవివాహాలు, అంటరానితనం, కొన్ని కులాల వారికి చదువుకొనే హక్కు లేకపోవవడం, కొన్ని కులాల వాళ్లు ఈ పనులే చేయాలి, ఇలాగే ఉండాలన్నవాటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న వివక్షను నిర్మూలించడానికి చట్టాలు వచ్చాయి. […]

  • By: Somu    latest    Sep 07, 2023 10:35 AM IST
Conservatism | వివక్ష నిర్మూలనే ‘సనాతన’ నిర్మూలన

Conservatism |

విధాత‌: సనాతనం అనేది ఒక ధర్మం. అది కాలానుగుణంగా మారుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో నాటి మనుధర్మం చెప్పినవే నడవాలి అన్న వాదన అర్థరహితం. సనాతన ధర్మం పేర్కొన్న విధంగా మహిళలపై వివక్ష, సతీసహగమనం, బాల్యవివాహాలు, అంటరానితనం, కొన్ని కులాల వారికి చదువుకొనే హక్కు లేకపోవవడం, కొన్ని కులాల వాళ్లు ఈ పనులే చేయాలి, ఇలాగే ఉండాలన్నవాటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న వివక్షను నిర్మూలించడానికి చట్టాలు వచ్చాయి. బ్రిటిష్‌ కాలంలోనే రాజా రాంమోహన్‌ రాయ్‌ సతీసహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన సూచనల మేరకు నాటి ఆంగ్లేయ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.

బాల్య వివాహలను అరికట్టడానికి నిర్దిష్ట వయసు వచ్చే వరకు పెండ్లి చేయడం నేరమని, నిబంధనలకు విరుద్ధంగా అలాంటి వివాహాలు చేస్తే శిక్షార్హులని చట్టాలు చెబుతున్నాయి. అంటరానితనం రూపుమాపడానికి అనేక చట్టాలు వచ్చాయి. ఇంకా ఈ జాడ్యం తొలగకపోవడంతో చట్టాలకు మరింత పదును పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజంలో అన్నివర్గాల పిల్లలు చదువుకోవాలని, దాన్ని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇలా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ జరుపుకుంటున్న ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో అనేక మార్పులకు నాంది పలికింది.

సనాతన ధర్మం కుల వివక్షను, లింగ వివక్షను ప్రోత్సహిస్తున్నదని, అసమానతలను, అణచివేతలను ప్రోత్సహించేది దేన్నైనా అంగీకరించకూడదన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మం రోగం లాంటిదేనని దాన్నినిర్మూలించాలని ఇటీవల ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, ఆ పార్టీకి అనుబంధంగా ఉండే కొన్ని సంస్థలు, కొంతమంది స్వాములు మండిపడ్డారు. భారతదేశం అంటే భిన్నమతాల సంగమం. ఇక్కడ అన్నిమతాల, కులాల వాళ్లు జీవిస్తున్నారు. అన్నిమతాల సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ గౌరవించబడుతాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. మరి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై హిందూత్వ వాదులు తప్ప.. మిగిలిన ఏ మతాల వాళ్లూ స్పందించలేదు.

ఎన్నికల ఏడాది కాబట్టి దీన్ని ఒక ఓటు బ్యాంకు అంశంగా మలుచుకోవాలన్న వ్యూహంగా కనిపిస్తున్నది. వీరి వాదన ప్రకారం ఒకప్పుడు మనుధర్మ శాస్త్రం చెప్పిన ప్రకారం నేటి ఆధునిక భారతదేశం నడుచుకోవాలా? నాడు చెప్పిన విధంగానే మహిళలపై వివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు కొనసాగాలని, కొన్ని కులాల వాళ్లు మాత్రమే చదువుకోవాలని, అట్టడుగువర్గాల వాళ్లు నిచ్చెన మెట్లపైన ఉన్న కులాల వారికి సేవ చేయాలని కోరుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. లేదు సనాతనం అనేది ఒక ధర్మమని, కాలంతో పాటు అది మారుతున్నదని, దాని పేరు చెప్పుకుని సమాజంలో విభజన, విద్వేషాలు రెచ్చగొడితే దానికి తమకు సంబంధం లేదని అంటారా? లేక సమర్థిస్తారా? అన్నది చెప్పాలని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు.

సనాతనం పేరుతో ప్రజల మధ్య విభజన తెస్తున్న వాటిని ప్రశ్నించే వారిని తలలు తీసేయాలని ఆ ధర్మం చెప్పిందా? అన్నది కూడా ఆలోచించాలి. కాలంతో పాటు మనమూ మారాలని అంటే దానిపై ఆలోచించాల్సింది పోయి మనుషుల తలలకు వెల కట్టడం అన్నది ఏ మతం సమర్థిస్తున్నది? క్రీస్తు పుట్టాకే క్రైస్తవం, మహమ్మద్‌ ప్రవక్త పుట్టాకే ఇస్లాం, మహావీరుని జననం తర్వాతే జైనం, బుద్ధుడు పుట్టిన తర్వాతే బౌద్ధం వంటివి ఆవిర్భవించాయిని, కానీ సనాతనం అనేది అనాదిగా వస్తున్నదని, దాన్ని ఎవరూ పుట్టించ లేదంటున్న వాదిస్తున్న వాళ్లు నాటి ఆచార వ్యవహారాలు ఆచరిస్తున్నారా? వాళ్లు ఆధునిక కాలానికి అనుగుణంగా మారలేదా? వాళ్ల ఆహార అలవాట్లు మార్చుకోలేదా? మను ధర్మం ప్రకారం బ్రాహ్మణులు అందరికంటే గొప్పవారు, క్షత్రియులు పరిపాలకులు, వైశ్యులు వ్యాపారులుగా ఉండాలని మిగిలిన వారంతా వీళ్లకు సేవ చేయాలని చెబుతున్నది.

సనాతన ధర్మం ఇదే కోరుతున్నదా? ఇవాళ ఉదయనిధి వేసిన ప్రశ్న కూడా ఇదే. దీనికి నేరుగా సమాధానం చెప్పలేక వితండవాదం చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ముర్మును పిలకపోవడమేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వివక్ష ఏ మతంలో ఉన్నా దాన్ని నిర్మూలించాలన్నది ఉదయనిధి మాటల ఉద్దేశం. దీన్నిఓట్ల కోసం ఒక మతానికి ముడిపెట్టి రాజకీయం చేస్తున్న వాళ్లు దేశాన్నిమళ్లీ మధ్యయుగాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా? మిగిలిన మతాల్లో అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయి. మరి ఈ మతంలో మాత్రం అది ఎందుకు అమలుకావడం లేదంటే ఏం సమాధానం చెబుతారు?

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజంలో అశాంతిని పెంచిపోషించాలని ఏ మతం చెప్పింది? ఒక వర్గం ఓట్లు మాకు అక్కరలేదు.. ఒక మతం వాళ్లు భారతదేశాన్ని వదిలి వెళ్లాలని కొందరు ప్రశ్నించే దుస్సాహసం ఎందుకు చేస్తున్నారు? రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక విధానానికి వ్యతిరేకంగా దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా వివిధ సంస్థలు ఇచ్చే సూచీల్లో భారత్‌ 40కి పైగా సూచీల్లో ఏటా దిగజారిపోతున్నది.

రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తూ.. భరోసా కల్పించాల్సింది పోయి ఒక వర్గం వారికే వత్తాసు పలుకుతామని కొందరు ముఖ్యమంత్రులు బహిరంగంగా చెప్పడం ఏ రాజనీతి? దేశం ఎటు పోతున్నది? ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇండియా పేరును భారత్‌గా మార్చినంత మాత్రాన ప్రజల జీవన స్థితిగతులు మారుతాయా? సమానత్వాన్ని బోధించని ఏ సిద్ధాంతమైనా, ఏ మతమైనా ప్రజల కడుపు నింపుతుందా? వాళ్ల కష్టాలు తీర్చుతుందా? అన్నది ఆలోచించాలి.