మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది జప్తు చేశారు.

- పరిహారం విషయంలో పట్టింపు లేదని సీరియస్
- ఆదేశాలిచ్చిన జిల్లా కోర్టు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది జప్తు చేశారు. ప్రభుత్వం పట్టా భూమిని సేకరించి నష్ట పరిహారం చెల్లించకుండా 40 సంవత్సరాల పాటు కార్యాలయం చుట్టూ రైతును తప్పించుకోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆర్డీఓ కార్యాలయం జప్తు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు కోర్టు సిబ్బంది మార్చి 20వ తేదీ బుధవారం ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా బేగం అనే మహిళ రైతుకు 478, 480 సర్వే నెంబర్లలో 23 ఎకరాల 27 సెంట్ల భూమి ఉన్నది. ఈ భూమికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారని బాధితురాలు ఆజ్మీరా బేగం కోర్టును ఆశ్రయించింది.
అజ్మీర బేగం సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఆర్డీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు తీర్పును అమలు చేయలేదు. ఫలితంగా బాధితురాలికి పరిహారం సొమ్ము అందలేదు. తిరిగి తనకు నష్టపరిహారం అధికారులు ఇవ్వడం లేదని బాధితురాలు కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం ఆర్డీఓ కార్యాలయం జప్తుకు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు.