పీపుల్స్ ప్రిన్సెస్‌ రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం.. ఎవ‌రీ దియా కుమారి..?

ఓ వారం రోజుల పాటు దియాకుమారి పేరు రాజ‌స్థాన్ రాజ‌కీయాల్లో మార్మోగిపోయింది. ఆమెనే సీఎం అంటూ ఊహాగానాలు వినిపించాయి.

పీపుల్స్ ప్రిన్సెస్‌ రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం.. ఎవ‌రీ దియా కుమారి..?

జైపూర్ : ఓ వారం రోజుల పాటు దియాకుమారి పేరు రాజ‌స్థాన్ రాజ‌కీయాల్లో మార్మోగిపోయింది. ఆమెనే సీఎం అంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ‌ను రాజస్థాన్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో సీఎం రేసులో ఉన్న దియా కుమారికి మాత్రం చివ‌ర‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కింది. పీపుల్స్ ప్రిన్సెస్‌గా పేరు సంపాదించుకున్న ఈ దియా కుమారి ఎవ‌రు..? ఆమె కుటుంబ నేప‌థ్యం ఏంటి..? అనే విష‌యాల‌పై నెటిజ‌న్లు దృష్టి సారించారు.


దియా కుటుంబ నేప‌థ్యం..


దియా కుమారి జైపూర్ రాజ కుటుంబానికి చెందిన మ‌హిళ‌. ఆమె 1971, జ‌న‌వ‌రి 30న జ‌న్మించారు. దియా తాత మాన్ సింగ్ II బ్రిటీష్ రాజ్యంలో జైపూర్‌ను పాలించిన చివ‌రి మ‌హారాజు. ఆమె తండ్రి బ్రిగేడియ‌ర్ సవాయ్ భ‌వాని సింగ్.. 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ధైర్య సాహ‌సాల‌కు గానూ మ‌హా వీర్ చ‌క్ర అవార్డును అందుకున్నారు. ఇక దియా ప్రాథ‌మిక విద్య‌ మ‌హారాణి గాయ‌త్రి దేవి స్కూల్‌లో, ఉన్న‌త విద్య జైపూర్‌లోని మ‌హారాణి కాలేజీలో కొన‌సాగింది.


2018లో భ‌ర్త‌కు విడాకులు


దియా కుమారి న‌రేంద్ర సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు సంతానం. ముగ్గురిలో ఒక‌రైన పద్మ‌నాభ్ సింగ్ జైపూర్ మ‌హారాజుగా కొన‌సాగుతున్నారు. దియా త‌న భ‌ర్త‌కు 2018లో విడాకులు ఇచ్చింది.


2013లో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభం..


దియా కుమారి 2013లో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. రాజ‌స్థాన్‌లోని స‌వాయి మాధోపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆమె గ్రామాల్లో స‌మ‌గ్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. 2019 ఎన్నిక‌ల్లో రాజ్‌స‌మంద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దియా.. విద్యాధ‌ర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి సీతారాం అగ‌ర్వాల్‌పై 71,368 ఓట్ల మెజార్టీతో భారీ విజ‌యం సాధించారు.


పీపుల్స్ ప్రిన్సెస్ దియా..


దియా రాజ‌కీయాల‌కు అతీతంగా రెండు పాఠ‌శాల‌లు, ట్ర‌స్టుల‌తో పాటు అనేక వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియం ట్రస్ట్, జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్ట్‌లను కూడా ఆమె ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేష‌న్‌ను కూడా న‌డుపుతున్నారు దియా కుమారి. ఈ ఫౌండేష‌న్ ద్వారా మ‌హిళ‌ల‌కు, అమ్మాయిల‌కు వృత్తిప‌ర‌మైన శిక్ష‌ణ‌, విద్య‌, జీవనోపాధి క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.


అంతేకాకుండా మ‌హిళ‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంపై దృష్టి సారించారు. దీంతో ఆమె పీపుల్స్ ప్రిన్సెస్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆమె చేసిన సేవ‌ల‌కు గానూ జైపూర్‌లోని అమిటీ యూనివ‌ర్సిటీ నుంచి గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్నారు దియా కుమారి.