Warangal | మేం సింహం సింగిల్‌గానే.. ఆ గుంట నక్కలు గుంపుగానే: బండి సంజయ్

ఆర్డినెన్స్ తెచ్చి.. గిరిజన రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా? గిరిజనాభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి ప్రశ్నించే వాళ్లను జైళ్లకు పంపుతున్నారు రేయాన్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి ములుగు బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారని, ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు […]

Warangal | మేం సింహం సింగిల్‌గానే.. ఆ గుంట నక్కలు గుంపుగానే: బండి సంజయ్
  • ఆర్డినెన్స్ తెచ్చి.. గిరిజన రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా?
  • గిరిజనాభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
  • ప్రశ్నించే వాళ్లను జైళ్లకు పంపుతున్నారు
  • రేయాన్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం
  • డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి
  • ములుగు బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారని, ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే 9 ఏళ్లలో గిరిజనుల కోసం ఏం చేశావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బెంగాల్ తరహా పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్లను జైళ్లకు పంపుతూ భయ పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించారు? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారు? ప్రజలంతా ఆలోచించాలని సూచించారు.

ములుగు జిల్లా కేంద్రంలో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌రావాల్సిందేనన్నారు. రాష్ట్రం కోసం కల్వకుంట్ల కుటుంబం ఏం త్యాగం చేసిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నా..సీఎం కేసీఆర్‌ అందుకు సహకరించడం లేదని అన్నారు.

ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వబోతున్నారని తెలిసి కేసీఆర్ గుండెల్లో డప్పులు కొడుతున్నాయని బండి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రేయాన్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్నారు. గిరిజన వర్శిటీ ఏర్పాటుకు భూములు ఇవ్వకుండా ఏళ్ల తరబడి నాన్చిన మూర్ఖుడని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ పెడుతామంటే సర్కార్‌ భూమి ఇవ్వట్లేదని అన్న సంజయ్‌.

బిడ్డను కాపాడుకోవడానికి కేబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి పంపుతారా? పేపర్ లీకేజీలో కేసీఆర్ కొడుకును కాపాడేందుకు ప్రయత్నిస్తారా? నిరుద్యోగుల జీవితాల కంటే కేసీఆర్‌కు కొడుకు, బిడ్డ, అల్లుడే ముఖ్యమన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దోషులు తేలేవరకు బీజేపీ యుద్ధం చేస్తుందన్నారు.

లీకేజీపై ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మనందరినీ చంపుతామని హెచ్చరించిన వాళ్లను ఉరికించి ఉరికించి కొడుతామని, పర్మిషన్ తీసుకుని వెళ్లే పిరికి పందలం కాదు.. పచ్చ జెండాలున్న చోట కాషాయ జెండా ఎగరేస్తామన్నారు.

బీజేపీని అడ్డుకునేందుకు ఒక్కటైతున్నారు..

తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని బండి ఆరోపించారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే బీఆర్ఎస్‌తో పొత్తుకు సిద్ధమైందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడదని.. ఏర్పడితే మేము కలిసి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని వాళ్లే చెప్పారు.

అయినా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడబోతున్నదన్నారు. కానీ అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీలన్నీ కలిసి వస్తున్నాం అంటున్నారు. అంటే నేను చెబుతున్నా బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదు బీజేపీ సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. గుంట నక్కలు గుంపుగా వస్తాయి ఎదురు కోవడానికి మా పార్టీ సిద్ధమని స్పష్టం చేశామన్నారు. హిందువుల పండుగ వేళల్లో షాపులు మూసేస్తారా? ఇతరుల పండుగలకు మాత్రం తెల్లవార్లు షాపులు తెరిచినా పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు.

పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ మాట్లాడుతూ ఒకే కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళానికి ఎంపీ సోయం బాపూరావు, నాయకులు చాడా సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, రవీంద్రనాయక్, కూన శ్రీశైలం గౌడ్, వన్నాల శ్రీరాములు,గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హుస్సేన్ నాయక్, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.