జూ.ఎన్టీఆర్ స్పందించకపోయిన డోంట్‌కేర్: ఎమ్మెల్యే బాలకృష్ణ

- తెలంగాణలో టీడీపీ సత్తా చాటుతాం
- ఎన్నికలొస్తున్నాయనే తన తండ్రి జపం
విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా వాళ్లు స్పందించకపోయినా తాను పట్టించుకోనన్నారు.
బాబు అరెస్టుపై కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తానన్నారు. బాబు అరెస్టు పరిణామాల క్రమంలో పార్టీ శ్రేణులకు అండగా తాను ముందుండి పనిచేస్తానన్నారు. బాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందో లేదో తనకు అవగాహాన లేదన్నారు. అనవసరంగా నిందలు వేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం కల్పించుకోవాల్సివున్న వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
బీజేపీ అధ్యక్షురాలిగా మా అక్కడత పురంధేశ్వరి ఉందని ఆమెతో మాట్లాడుతున్నామన్నారు. రోజా లాంటి వారిపై మాట్లడటం బురదలో రాయి వేయడం లాంటిదన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని, తెలంగాణలో టీడీపీ లేదన్నవారికి రాబోయే ఎన్నికలో్ తామేంటో చూపిస్తామని, టీడీపీ సత్తా చాటుతామన్నారు.
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయనే కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గతంలో ఈ ప్రాంతానికి చేసిన సేవ, అభివృద్ధి పార్టీకి కలిసివస్తుందన్నారు. బాబు అరెస్టుపై తెలంగాణలో గత మూడు రోజులుగా ఖండిస్తున్నారని, కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు.
రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగు వారి గౌరవం కోసం పనిచెద్దామన్నారు. కేసులకు అరెస్టులకు తాము భయపడమని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. బాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు నిరసన చేస్తే హైద్రాబాద్‌లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారంటూ మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించామన్నారు. ఇప్పుడు టైం వచ్చిందని, తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగురుతుందన్నారు. పొత్తుల అంశం చంద్రబాబు మాట్లాడుతారని, తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తామన్నారు.