Financial mistakes | మీరు కొత్తగా జాబ్‌లో చేరారా.. అయితే ఈ ఆర్థిక పొరపాట్లు అస్సలు చేయకండి

Financial mistakes | మీరు కొత్తగా జాబ్‌లో చేరారా.. అయితే ఈ ఆర్థిక పొరపాట్లు అస్సలు చేయకండి

Financial mistakes: మనిషి తన జీవితంలో తొలిసారి ఉద్యోగంలో చేరడం అనేది ఓ గొప్ప మైలురాయి. ఎందుకంటే సొంత సంపాదనతో సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. అయితే ఉడుకు రక్తం, అనుభవలేమీ కారణంగా ఇలాంటి సమయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. ఇబ్బడిముబ్బడిగా డబ్బును ఖర్చుచేస్తారు. దాంతో సొంతిల్లు, వాహనం, వివాహం, పిల్లల ఖర్చులు, పదవీ విరమణ వంటి పెద్ద లక్ష్యాల కోసం నిధులను మిగిల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. మరి అలాంటి పరిస్థితి రాకూడదంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…


బడ్జెట్‌ రూపకల్పనలో నిర్లక్ష్యం

కొత్త ఉద్యోగంలో చేరినవాళ్లు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి బడ్జెట్‌ రూపకల్పనలో నిర్లక్ష్యం. ఆదాయ, వ్యయాలపై స్పష్టమైన అవగాహన లేకుండా అతిగా ఖర్చు చేయడం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. వేతనం, ఇతర ఆదాయ వనరులతో కలిపి మొత్తం మీ నెలవారీ రాబడిని లెక్క చేసుకోండి. అనంతరం ఆ నెల మొత్తంలో మీకయ్యే ఖర్చులను లెక్కించండి. అప్పుడు మీ సంపాదనలో ఆ నెల ఎంత మిగులుతుందనే అవగాహన మీకు వస్తుంది. దాంతో అనవసరపు ఖర్చులు తగ్గించుకునే అవకాశం దక్కుతుంది. ఇలా బడ్జెట్‌ను రూపొందించుకోవడం వల్ల ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థంగా చక్కబెట్టుకోవచ్చు.


పొదుపును విస్మరించడం

ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో యువత చేసే మరో పొరపాటు పొదుపును విస్మరించడం. చాలామంది కొత్త ఉద్యోగులు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును కేటాయించరు. వచ్చిన సంపద మొత్తం ఖర్చు చేస్తుంటారు. కానీ, అది భవిష్యత్తులో చాలా ఇబ్బందులపాలు చేస్తుంది. జీవితాంతం ఎలాగోలా నెట్టుకు రాగలిగినా పదవీ విరమణ అనంతరం చేతిలో పైసా ఉండని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి నెల సంపాదనలోంచి కొంత తీసి అత్యవసర నిధిని నిర్మించుకోవాలి. పదవీ విరమణ అనంతర ఖర్చుల కోసం మదుపు చేయాలి.


శక్తికి మించిన లైఫ్‌స్టైల్‌

చాలామంది ఉద్యోగంలో చేరిన కొత్తలో తరచూ రెస్టారంట్లకు వెళ్తారు. కొత్తకొత్త్ గ్యాడ్జెట్లు కొంటుంటారు. లగ్జరీ లైఫ్‌స్టైల్‌ కోసం అధికంగా ఖర్చులు చేస్తుంటారు. ఇలాంటి వాటికి అరుదుగా ఖర్చు చేస్తే పరవాలేదు. కానీ ఆ లగ్జరీ లైఫ్‌స్టైలే అలవాటుగా మారితే మాత్రం ఆర్థిక పరిస్థితి వేగంగా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి కోరికల కంటే అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. శక్తికి మించిన లైఫ్‌స్టైల్‌ కోసం వెంపర్లాడొద్దు.


రుణ చెల్లింపుల్లో అలసత్వం

ఒకవేళ మీరు విద్యా రుణాలు, క్రెడిట్ కార్డ్ బాకీలు, ఇతర అప్పుల లాంటివి చేసి ఉంటే.. వాటిని సాధ్యమైనంత త్వరగా తీర్చడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వడ్డీ భారం పెరుగుతుంది. ఆది ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రతి నెలా ఆదాయంలో కొంత భాగాన్ని రుణ చెల్లింపుల కోసం పక్కన పెట్టాలి. అధిక వడ్డీ అప్పులను ముందుగా తీర్చేయాలి.


ఆరోగ్య, జీవిత బీమాలు లేకపోవడం

చాలామంది కొత్తగా ఉద్యోగంలో చేరగానే ఎన్నో ప్రణాళకలు వేసుకుంటారు. కానీ బీమా ప్రాముఖ్యతను మాత్రం విస్మరిస్తారు. ప్రతి ఉద్యోగికి ఆరోగ్య, జీవిత బీమాలు చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలి. ప్రమాదాల బారినపడి ఆస్పత్రి పాలైతే లక్షల్లో ఖర్చవుతుంది. దానికి మన కొన్ని నెలల వేతనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఆరోగ్య బీమా ఉంటే ఆ ఆర్థిక భారం తప్పుతుంది. అదేవిధంగా జీవిత బీమా ఉంటే ఊహించని సంఘటన జరిగినప్పుడు మనపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుంది. కాబట్టి బీమా చేయించుకోవడం అస్సలు మరువద్దు.