ఈటల కోటపై మంత్రి KTR గురి.. అభివృద్ధి పేరుతో ఎంట్రీ
ఈ నెల 31న కమలాపురం మండలంలో పర్యటన గూడూరులో రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్సీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకప్పటి తమ సహచర మంత్రివర్గ సభ్యుడు, టీఆర్ఎస్‌లో ద్వితీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన నేత, ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ కోటపై రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురి పెట్టారా? అనే చర్చ ప్రారంభమైంది. మొన్నటి వరకు […]

- ఈ నెల 31న కమలాపురం మండలంలో పర్యటన
- గూడూరులో రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్సీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకప్పటి తమ సహచర మంత్రివర్గ సభ్యుడు, టీఆర్ఎస్‌లో ద్వితీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన నేత, ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ కోటపై రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురి పెట్టారా? అనే చర్చ ప్రారంభమైంది.
మొన్నటి వరకు తమ సహచరునిగా ఉన్న ఈటల, ప్రత్యర్థి బీజేపీలో చేరి కొరకరాని కొయ్యగా మారాడు. ఈ నేపథ్యంలో ఈటల కోటగా మారిన హుజురాబాద్ సెగ్మెంట్‌లో గులాబీ పట్టు కోసం ఉప ఎన్నికల్లోనే తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
రానున్న ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని నిలబెట్టడమే కాకుండా, అధికార పార్టీగా అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకొని, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఈ నియోజకవర్గంలో తిరిగి తమ జెండా ఎగిరేసేందుకు అంతర్గత ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
గంగుల టూ కేటీఆర్‌కు షిఫ్ట్
ఉప ఎన్నికల్లో పనిచేసిన మంత్రి హరీష్ రావు తర్వాత ఈ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కొంత దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న హుజూరా బాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపురం మండల కేంద్రం, గూడూరులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
గూడూరులో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తారని సమాచారం. మంత్రి రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ పాల్గొంటారా? లేదా? చూడాలి.
అప్పుడు సహచరుడు ఇప్పుడు ప్రత్యర్థి
ఇదిలా ఉండగా ఒకప్పుడు సహచరుడుగా ఉన్న ఈటల ఇప్పుడు ప్రత్యర్థిగా మారాడు. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం సాగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కు ఈటల చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్ చేత తమ్ముడు అంటూ పిలిపించుకొని గులాబీ పార్టీలో అత్యంత ప్రాధాన్యతతో కొనసాగిన వ్యక్తి ఈటెల రాజేందర్.
ఉమ్మడి రాష్ట్రంలోనే టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఓ వెలుగు వెలిగాడు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంత్రివర్గంలో రెండు పర్యాయాలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
విభేదాలతో విషాద ముగింపు
గత ఏడాదిన్నర క్రితం 2021లో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ఆ పార్టీ అధిష్టానం పై తమ ఉద్యమ నేపథ్యాన్ని తెలియజేస్తూ చేసిన కామెంట్లు అంతర్గతంగా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈటెల, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు తీవ్రమై మంత్రి వర్గం నుంచి ఈటలను భర్త్ రఫ్ చేసిన విషయం తెలిసిందే. తదుపరి భూ ఆక్రమణ కేసులో ఈటెలపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ప్రత్యేక పరిస్థితులలో తన రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడు కోవడానికి ఈటల బీజేపీని ఆశ్రయించాడు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు.
ఉప ఎన్నికల్లో ఈటల ఘన విజయం
నవంబర్ 2021లో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఈటెలను ఓడించేందుకు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థి కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఈటెల ముందు దీటుగా నిలబడలేకపోయారు. ఈటల ఓటమి లక్ష్యంగా సర్వశక్తులను గులాబీ పార్టీ ఒడ్డినప్పటికీ వీటన్నింటి నుంచి తన ఉనికిని కాపాడుకొని ఎమ్మెల్యేగా ఈటల గెలిచి కేసిఆర్ కు గట్టి చెంపదెబ్బ కొట్టారు.
పట్టుకు గులాబీలు తిరిగి ప్రయత్నం
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే హుజురాబాద్ పై పట్టు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఏర్పాట్లను పరిశీలించారు.
కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, స్కూల్, కుల సంఘ భవనాలను ప్రారంభిస్తారని అంటున్నారు. పాఠశాల ఆవరణలో సుందరీకరణ, మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. పటిష్ట మైన కాన్వాయ్, హెలీప్యాడ్, బందోబస్తు, ఏర్పాట్లపై సూచనలు చేశారు.