కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె అయిన వీణా విజన్‌పై కూడా బుధవారం కేసు నమోదు చేసింది
విధాత: దక్షిణ భారతంపై ఈడీ గురి పెట్టింది. నిన్న తెలంగాణ నేడు కేరళ. ఇటీవలే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా కేరళవైపు మళ్లింది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె అయిన వీణా విజన్‌పై కూడా బుధవారం కేసు నమోదు చేసింది. 2018-19 సంవత్సరంలో ఒక మినర్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఐటీకంపెనీకి చట్ట వ్యతిరేకంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణతో కేసు నమోదు చేసినట్లు ఈడీ పేర్కొన్నది. వీణా విజయన్‌తో పాటు ఈ కేసుకు సంబంధం ఉన్నవారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఈడీకి ఫిర్యాదు అందడంతో దాన్ని ఆధారంగా చేసుకుని ఈడీ కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై కేసు నమోదు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి రూ. 1.72కోట్లు వీణా ఐటీ కంపెనీకి చట్టవ్యతిరేకంగా, రహస్యంగా ముడుపులు అందాయని ఆరోపించింది. సదరు మినరల్ కంపెనీ వీణా ఐటీ కంపనీ నుంచి ఎలాంటి కార్యకలాపాలు పొందకుండానే ఈ ముడుపులు వీణాకు అందినట్లు ఆరోపించింది.
అయితే బీజేపీ కావాలనే తన ప్రతిపక్ష పార్టీలను అనిచి వేసేందుకు ఈడీని వినియోగించుకొని అక్రమ కేసులు పెడుతుందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న భయంతో ప్రధానీ మోదీ ఎలాగైనా మూడవ సారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.