Forest Lands | అటవీ భూమి హాంఫట్.. చెట్లు నరికి కబ్జా చేస్తున్న ఆక్ర‌మ‌ణ‌దారులు

అడ్డుకునే ఫారెస్ట్ అధికారులపై దాడులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసులు న‌మోదు కాని వైనం విధాత, మెదక్ బ్యూరో: అడవులు అధిక‌ ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల పెంపకం కోసం హరిత హారం పథకాన్ని ప్రవేశపెట్టాయి. హరిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఐదు విడుతలుగా హరిత హారం కార్యక్రమం చేపట్టి లక్షలాది మొక్కలు నాటింది తెలంగాణ ప్ర‌భుత్వం. హరిత విప్లవం దిశ‌గా అడుగులు వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం […]

  • Publish Date - April 17, 2023 / 11:12 AM IST

  • అడ్డుకునే ఫారెస్ట్ అధికారులపై దాడులు
  • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసులు న‌మోదు కాని వైనం

విధాత, మెదక్ బ్యూరో: అడవులు అధిక‌ ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల పెంపకం కోసం హరిత హారం పథకాన్ని ప్రవేశపెట్టాయి. హరిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఐదు విడుతలుగా హరిత హారం కార్యక్రమం చేపట్టి లక్షలాది మొక్కలు నాటింది తెలంగాణ ప్ర‌భుత్వం.

హరిత విప్లవం దిశ‌గా అడుగులు వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం కొందరి స్వలాభాపేక్ష‌తో నిష్ఫ‌లమ‌వుతుంది. అడ్డదారిలో అటవీ భూములను ఆక్రమించ‌డ‌మే కాకుండా, పచ్చని మొక్కలను తొలగించి అటవీ భూములను చదును చేస్తున్నారు. అడవుల రక్షణ కోసం కృషి చేస్తున్న అధికారుల పై దాడులు చేసి మ‌రీ ఆక్ర‌మిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు భయబ్రాంతులకు గురై అటవీ భూములను రక్షించడానికి సంబంధిత అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

బంగారు కత్తి అని గొంతు ఎవ్వరూ కోసుకోరు కదా అలాగే అటవీ భూముల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్నందుకు జీత భత్యాలు తీసుకొన్న వారికి భద్రత కరువు కావడంతో అడవులను కాపాడేందుకు ముందుకు రాలేక పోతున్నారు. అడవులు అంతరించి పోయే ప‌రిస్థితి దాపురించింది.

పోడు భూముల పేరుతో అడవుల ఆక్రమణ

పోడు భూముల సమస్యతో అడవులు ఆక్రమణకు నెలవులుగా మారాయి. ప్రభుత్వం పోడు భూముల రైతులకు భూమి హక్కు కల్పిస్తామని ప్రకటించడంతో ఆశావహుల కన్ను స్థానికంగా చుట్టుప్రక్కల ఉన్న అటవీ ప్రాంతాల పై పడింది. దీంతో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తారని ప్రకటించిందే తడువుగా వందలాది ఎకరాల అడవిని నరుకుతూ విచ్చలవిడిగా అటవీ భూములను ఆక్రమణ చేస్తున్నారు.

పాపన్న పేట మండల పరిధిలోని కంపార్ట్ మెంట్ 70లో సుమారు 50హెక్టార్ల అటవీ భూమిని అక్రమార్కులు మొక్కలను తొలగించి భూమి ఆక్రమణకు తెరలేపడంతో అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారుల పై దాడులకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 1999-2020సంవత్సరంలో కంపార్ట్ మెంట్ 70లో నీలగిరి మొక్కలను నాటి పెంచి పోషించారు. అయితే 2022సంవత్సరంలో నీలగిరి మొక్కలు పెరిగి పోవడంతో చెట్లను తొలగించి అదే సమయంలో మళ్ళీ మిశ్రమ మొక్కలను పెంచేందుకు లక్షలాది రూపాయల నిధులను వెచ్చించి మొక్కలను నాటీ వాటిని పెంచి పోషించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములలో దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతులకు పోడు భూముల పై హక్కు కల్పించాలన్న లక్ష్యంతో గిరిజనులు 25ఏళ్ళు గిరిజనేతర కుటుంబాలకు 75ఏళ్ళుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు హ‌క్కు కల్పించేందుకు వినతి పత్రాలు స్వీక‌రించింది. క్షేత్రస్థాయిలో అటవీ శాఖ అధికారులు శాటిలైట్ ద్వారా జీపీఎస్ సర్వే నిర్వహించి టైం లైన్ మ్యాప్ ద్వారా వారు ఎన్ని ఏళ్ళుగా సాగులో ఉన్నారో గుర్తించి ఉన్నత అధికారుల ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

కానీ నిబంధనలకు విరుద్ధంగా కొందరు అక్రమార్కులు రెచ్చి పోయి అటవీ భూములను దక్కించుకునేందుకు అడ్డగోలుగా అటవీ భూములలో నాటిన మొక్క లను తొలగిస్తున్నారు. రాత్రి స‌మ‌యాల్లో అడ‌వుల‌ను చదను చేయడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళితే అధికారుల పై దాడులు చేస్తున్నారు.

అరికట్టేందుకు వెళితే దాడులు

మండలంలో నామపూర్, చిత్రియల్ తండా, అమీరియ తండా, అన్నారం, అబలా పూర్, నగ్సాన్ పల్లి, తదితర గ్రామాల పరిధిలో అటవీ భూములు ఆక్రమణకు గుర‌వుతున్నాయి. దీంతో కంపార్ట్ మెంట్‌లలో అటవీ భూములలో ఆక్రమదారులు చొరబడుతున్నారని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో చీకటిని లెక్క చేయకుండా రాత్రుల్లో సైతం వాహనాలలో అటవీ ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వ‌హిస్తున్నారు. కానీ ఆక్ర‌మ‌ణ‌దారులు అధికారుల పై నే దాడులు చేయడంతో అధికారులు గాయ‌ప‌డి, ప్రాణభయంతో వెనుదిరుగాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. గాయ‌ప‌డిన వారు ఆసుపత్రిలో సైతం చికిత్స తీసుకోవాల్సి వ‌చ్చింది. ఎక్కడైనా అటవీ భూములు ఆక్రమణ జరుగుతున్నాయని తెలిసినా వెళితే దాడులు చేస్తారన్న భయంతో వెళ్లేందుకు అటవీ రక్షకులు జంకుతున్నారు.

కేసులతోనే సరి… చర్యలు లేవు మరి

చిన్న పాటి మొక్కలను తొలగిస్తే రాద్దాంతం చేస్తూ కేసులు, ఫైన్ చర్యలకు పాల్పడే అధికారులు సుమారు 50హెక్టార్ల మేర అటవీ భూములలో మొక్కలను తొలగించి భూములను చదను చేస్తున్న అక్రమార్కులను అరికట్టడంలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.

గతంలో కంపార్ట్ మెంట్ 70లో అక్రమార్కులు చొరబడి ట్రాక్టర్లతో మొక్కలను తొలగిస్తే కేవలం వారి పై నామమాత్రపు కేసులు నమోదు చేశారు. దీంతో అక్రమార్కులు రెచ్చి పోతున్నారు. ఇలాగే కొనసాగితే అడవుల పెంపకం దేవుడెరుగు అటవీ భూములే మాయం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి అటవీ భూములను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

దాడి చేస్తారన్న భయం

ఈ విషయమై పాపన్న పేట సెక్షన్ అధికారిని వివరణ కోరగా గతంలో పాపన్న పేట మండల పరిధిలోని కంపార్ట్ మెంట్ 70లో స్థానికులు అటవీ భూములలోని మొక్కలను తొలగించి భూ ఆక్రమణకు పాల్పదిండి వాస్తవమన్నారు. అయితే అటవీ భూమినీ రక్షించేందుకు వెళ్లగా దాడి చేసి గాయ‌ప‌ర‌చ‌డంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. మళ్ళీ వెళితే దాడి చేస్తారన్న భయం ఉందని పేర్కొంటున్నారు.

Latest News