EPFO | పీఎఫ్ ఖాతాదారులకు EPFO శుభవార్త.. ప్రొఫైల్‌లో మార్పులకు చక్కటి అవకాశం..

EPFO : మీరు పీఎఫ్ ఖాతాదారులా..? మీ పీఎఫ్ ఖాతాలో తప్పులేమైనా సరిచేసుకోవాలా..? లేదంటే మీ వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవాలా..? ఈ మార్పులు ఎలా చేసుకోవాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక పనిని వాయిదా వేసుకుంటున్నారా..? అయితే మీ లాంటి ఖాతాదారుల కోసమే ‘ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)’ ఒక శుభవార్త చెప్పింది. మీ పీఎఫ్ ప్రొఫైల్‌లో వివరాలను సులభంగా మార్చుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
ఖాతాదారుల సౌకర్యా్ర్థం జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాంతో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక్క జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్ లాంటి 11 రకాల వివరాలను ఆ ఫామ్‌తో మార్చుకోవచ్చు.
అయితే వివరాలను అప్‌డేట్ చేయడానికి ఉద్యోగితోపాటు, ఆ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ యజమాన్యం కూడా మార్పును ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంతకాలు చేసిన డిక్లరేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో పీఎఫ్ కమిషనర్‌కి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మీ పీఎఫ్ ఖాతాలోని వివరాలు అప్‌డేట్ అవుతాయి.
ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకోండి ఇలా..
- ముందుగా EPFO అధికారిక పోర్టల్ epfoindia.gov.in ను ఓపెన్ చేయాలి. పైన కనిపించే services బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రోల్ చేసి For Employee అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- తర్వాత అందులో కనిపించే services సెక్షన్‌కు వెళ్లి Member UAN/online serviceపై క్లిక్ చేయాలి.
- మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- తర్వాత స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్‌డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి.
- అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత యజమానికి ఎంప్లాయర్ లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి. ఎంప్లాయర్ ఆ వివరాలను ధృవీకరించాలి. అనంతరం ఫామ్‌పై సంతకం చేసి పీఎఫ్ కమిషనర్‌కు పంపించాలి.