నేను తెలంగాణ మట్టి బిడ్డను..ప్రాంతానికి పరిమితం కాదు.. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై ఈటల కౌంటర్‌

సీఎం రేవంత్‌రెడ్డి నన్ను పట్టుకుని మల్కాజిగిరికి ఈటల రాజేందర్‌కు ఏంటి సంబంధమని అడుగుతున్నాడని, నేను కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించిన బిడ్డను

  • Publish Date - March 10, 2024 / 02:08 PM IST

విధాత, హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి నన్ను పట్టుకుని మల్కాజిగిరికి ఈటల రాజేందర్‌కు ఏంటి సంబంధమని అడుగుతున్నాడని, నేను కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించిన బిడ్డను కాదని, ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డనని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ మారేడుపల్లి లోని అంబేద్కర్ నగర్ బస్తీలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఈటల మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అది మాట్లాడే రకం కాదని, చప్పట్లు కొట్టగానే రెచ్చిపోయి మాట్లాడేవారు కొంతమంది ఉంటారని, కానీ వారికి ముందుంది ముసళ్ళ పండగ అంటు పరోక్షంగా రేవంత్‌కు హెచ్చరికలు చేశారు.


ఈ రాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నామని, ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థికస్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగే సత్తా నాకుందని, కానీ మూడు నెలలకే ఎవరి మీద విమర్శ చేయకూడదు కాబట్టి చేయడంలేదని స్పష్టం చేశారు. నా మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీదగానీ, ఏ పార్టీ మీదగానీ వ్యక్తిగతమైన దూషణలు చేయలేదని, నేను సంస్కారం ఉన్నవాడినన్నారు. ఏ పొలిటికల్ లీడర్ అయిన విశాలంగా ఆలోచించి ఉండాలని, ఉన్నతంగా ఉండాలని, సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్‌గా మనలేడని చెప్పారు. పొలిటికల్ లీడర్ సంకుచితవాది, డైరెక్షన్ లేని వాళ్ళు అయితే వ్యవస్థ కూలిపోద్ది అని నమ్మే వాడిని నేను అన్నారు.

అలాంటి చిన్న, కురుస నాయకులు గురించి నేను మాట్లాడనని పేర్కోన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నోడికి తెలవదు, విన్న మనకు కూడా తెలుసుకునే ఆస్కారం లేకుండా పోయిందని, ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.ఈ కార్యక్రమంలో 150 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొణతం దీపికా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్‌, జే. రామకృష్ణ, బి. మల్లికార్జున్, గణేష్, చిన్న వీరయ్య, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.